Sunday, April 28, 2024

వాణిజ్య పన్నుల శాఖలో అధికారాల కేంద్రీకరణపై నిరసన

విజయవాడ, : వాణిజ్య పన్నుల శాఖలో సంస్కరణల పేరుతో అధికారాల కేంద్రీకరణ జరుగుతుందని, ప్రభుత్వ విధానమైన అధికార వికేంద్రీకరణ సూత్రానికి వ్యతిరేకంగా అన్ని అధికారాలు కేవలం నలుగురైదుగురు ఉన్నతాధికారుల చేతులలో పెట్టుకునే విధంగా మంత్రాంగం నడుపుతున్నారని వాణిజ్య పన్నుల శాఖ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షులు కె.ఆర్. సూర్యనారాయణ ఆరోపించారు.ఆదివారం విజయవాడ మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన వాణిజ్య పన్నుల శాఖ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర సర్వసభ్య సమావేశానికి సూర్య నారాయణ అధ్యక్షతవహించి ప్రసంగిస్తూ క్షేత్రస్థాయిలోని సర్కిల్ కార్యాలయాలకు ఉన్న అధికారాలన్నీ తీసివేసి, వాటిని నిర్వీర్యం చేయడం ద్వారా శాఖను బలహీనపరుస్తున్నారని సూర్యనారాయణ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయంలో సింహభాగాన్ని సమకూరుస్తున్న వాణిజ్య పన్నుల శాఖలో ఈ విధమైన తిరోగమన చర్యలు ఉద్యోగుల మనోస్థైర్యాన్ని
దెబ్బతీసి, శాఖ ఉనికిని ప్రశ్నార్థకంగా మారుస్తాయని అన్నారు. హేతుబద్ధత లేని నిర్ణయాల వల్ల రాష్ట్ర ఖజానాకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని, ఈ చర్యలపై నిరసనగా వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగులు దశలవారీ ఆందోళనా కార్యక్రమాన్ని చేపట్టనున్నారని సూర్యనారాయణ తెలియచేశారు.

ఈ సమావేశంలో రాష్ట్రంలోని 26 జిల్లాల నుండి వాణిజ్య పన్నుల శాఖ అధికారులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సంఘ ప్రధాన కార్యదర్శి జి.ఎమ్. రమేష్ కుమార్ తీర్మానాలను ప్రవేశపెట్టారు. శాఖలో ఏడు వందల యాభైకి పైగా ఉన్న ఎ.సి.టి.వో.లకు ఎటువంటి చట్టబద్ధ అధికారాలు లేకుండా చేయడం వల్ల క్షేత్రస్థాయిలో జి.ఎస్.టి. చట్టం అమలులో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, కనుక ఈ అధికారుల సేవలు గరిష్ఠ
స్థాయిలో ఉపయోగించుకొనే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతూ సమావేశం తీర్మానించింది.

శాఖలో సర్కిల్ కార్యాలయాలకు సరైన అధికారాలు కల్పించి బలోపేతం చేయాలని, అధికారాల కేంద్రీకరణను విరమించుకోవాలని, ఉద్యోగుల బదిలీలలో అవకతవకలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని మరియు శాఖ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ హేతుబద్ధంగా చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరుతూ సమావేశం తీర్మానించింది. వాణిజ్య పన్నుల శాఖ ప్రధాన కార్యాలయంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న అధికారులపై ఉన్న అవినీతి ఆరోపణలపై దర్యాప్తు చేయాలని, అప్పటి వరకు వారిని ఈ బాధ్యతల నుండి తప్పించాలని సమావేశం కోరింది. క్రమశిక్షణ చర్యల పేరుతో క్రిందిస్థాయి ఉద్యోగులను అకారణంగా వేధిస్తున్నారని పలువురు ఆరోపించారు. సమస్యల పరిష్కారం కోసం ఏప్రిల్ నెల రెండవ వారం నుండి దశల వారీ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని కూడా సమావేశం తీర్మానించింది.

- Advertisement -

ఈ సమావేశంలో సంఘ ప్రధాన కార్యదర్శి జి.ఎమ్. రమేష్ కుమార్, గెజిటెడ్ అధికారుల సంఘ అధ్యక్షుడు వై. హరికృష్ణ, నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు బి. గోపాలకృష్ణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల
సంఘం ప్రధాన కార్యదర్శి జి. ఆస్కారరావు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement