Sunday, May 5, 2024

అవినీతి డ్రైవర్లు.. ఆఫీసర్ల అద్దెకార్ల వ్యవహారంలో అస‌లు గుట్టు ఇదే..

అమరావతి, ఆంధ్రప్రభ: ‘పేరుకే వారు కారు డ్రైవర్లు.. కానీ వారి యూపీఐ యాప్స్‌ లావాదేవీలు చూస్తే కళ్లు చెదురుతాయి. వాణిజ్య పన్నుల శాఖ అద్దె కార్లపై నెలకు రూ.15వేల జీతానికి పని చేసే వీరు ఆ స్థాయిలో లావాదేవీలు ఎలా నిర్వహిస్తున్నారంటూ’ లోతుగా ఆరా తీస్తే ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అవినీతి నిరోధక శాఖకు చిక్కకుండా కొందరు అధికారులే వీరి యూపీఐ యాప్స్‌ ద్వారా లావాదేవీలు నిర్వహిస్తున్నారు. అందుకోసమే ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వద్దంటున్నా ఉన్నతాధికారులపై ఒత్తిళ్లు తీసుకొచ్చి అద్దెకార్ల వినియోగానికి ‘లాబీయింగ్‌’ చేసినట్లు వాణిజ్య పన్నుల శాఖలో చర్చసాగుతోంది. ‘వాణిజ్యశాఖలో మళ్లీ అద్దెకార్ల పరుగులు’ శీర్శికన గురువారం ఆంధ్రప్రభ ప్రధాన సంచికలో వచ్చిన కథనం కలకలం రేపింది.

ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంఓ) అధికారులు అద్దెకార్ల వ్యవహారంపై ఆరా తీసినట్లు తెలిసింది. దాంతో వాణిజ్య పన్నుల శాఖ అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. మరింత లోతుగా వెళితే కలెక్షన్‌ ఏజెంట్ల అవతారం ఎత్తిన డ్రైవర్ల పాత్ర వెలుగు చూస్తుందనే ఆందోళన పలువురిలో నెలకొంది. అంబేద్కర్‌ జయంతిని పురస్కరించుకొని వాణిజ్య పన్నుల శాఖల కార్యాలయాలకు సెలవు ఉన్నప్పటికీ ఒకరి కొకరు ఫోన్లు చేసుకొని చర్చించుకున్నారు. సీఎంఓ ఆదేశాల మేరకు నిఘా అధికారులు విచారణ చేపడితే పరిస్థితి ఏంటనే దానిపై పలువురు తర్జనభర్జనలు పడుతున్నారు.

ఆర్థిక భారమని వద్దని.. మళ్లీ అనుమతి
రాష్ట్రవ్యాప్తంగా వాణిజ్య పన్నుల శాఖ క్షేత్రస్థాయి అధికారులకు ఐదు నుంచి ఆరొందల వరకు అద్దెకార్లు తిరుగుతున్నాయి. రాష్ట్రంలోని 290 మంది డీసీటీవోలు, 120మంది సీటీవోలు, ఇతర అధికారులు వీటిని వినియోగిస్తుంటారు. ఇందుకోసం ఏటా రూ.20వేల కోట్ల వరకు అద్దెకార్లకు చెల్లించాల్సి వస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం పొదుపు చర్యలకు దిగింది. అవసరం లేని వ్యయాలకు అడ్డుకట్ట వేసేందుకు పలు ప్రభుత్వ శాఖలకు సూచనలు జారీ చేసింది. అవసరం ఉంటే తప్ప అనవసర వ్యయం చేయవద్దనేది ప్రభుత్వ ఉద్దేశం. ఈ క్రమంలోనే వాణిజ్య పన్నుల శాఖకు కూడా ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. సీవీటీ(చెక్‌ వెహికల్‌ ట్రాఫిక్‌)లకు వెళ్లినప్పుడు మినహా అద్దెకార్లు కనీస కిలోమీటర్లు కూడా తిరగని పరిస్థితి. కొందరు అధికారులైతే ఇంటి నుంచి కార్యాలయానికి రాకపోకలు సాగించేందుకు మాత్రమే వినియోగిస్తుంటారు. వీటిని పరిగణలోకి తీసుకున్న వాణిజ్య పన్నుల శాఖ ప్రధాన కార్యాలయం ఉన్నతాధికారులు గత నెల 25న 2022-23 ఆర్థిక సంవత్సరానికి అద్దెకార్లు పెట్టొద్దంటూ ఆదేశాలు జారీ చేశారు. ఇది జరిగిన కొద్ది రోజులకే మళ్లిd అనుమతిస్తూ జిల్లా వాణిజ్య కార్యాలయాల అధికారులకు సమాచారం అందింది.

కలెక్షన్‌ ఏజెంట్లుగా డ్రైవర్లు..
అద్దెకార్ల డ్రైవర్లు అధికారులకు కలెక్షన్‌ ఏజెంట్లుగా మారారు. అనధికారికంగా వేబిల్స్‌ లేని వ్యాపారాలకు అడ్డుకట్ట వేసేం దుకు చెక్‌ వెహికల్‌ ట్రాఫిక్‌(సీవీటీ) విధులను అధికారులకు అప్పగిస్తుంటారు. గతంలో ఉన్న వాణిజ్య పన్నుల శాఖ చెక్‌ పోస్టులను తొలగించడంతో సీవీటీ విధులు అప్పగిస్తున్నారు. విధుల్లో భాగంగా తనిఖీలు చేపట్టిన అధికారులు వేబిల్స్‌ లేకుండా సరుకు రవాణా అవుతున్నట్లు గుర్తిస్తే భారీగా జరిమానా విధిస్తారు. అయితే కొందరు అధికారులు దీనిని సాకుగా చూపి అందినకాడికి దండుకుంటున్నట్లు తెలుస్తోంది.

గతంలో చెక్‌పోస్టులపై పలుమార్లు జరిగిన ఏసీబీ దాడులను దృష్టిలో ఉంచుకొని సీవీటీ విధుల్లో డ్రైవర్ల యూపీఐ యాప్స్‌ను వినియోగించుకుంటున్నారు. అనధికారిక సరుకుతో పట్టుబడిన వారితో బేరసారాలు సాగించి డ్రైవర్ల ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం వంటి యూపీఐ యాప్స్‌ ద్వారా నగదు బదిలీ చేయిం చుకుంటున్నారు. ఇటీవల కృష్ణాజిల్లాకు చెందిన అధికార వైసీపీ పార్టీ సర్పంచ్‌ని బెదిరించి రూ.60వేలు డ్రైవర్‌ యూపీఐ యాప్స్‌కు వేయించుకోవడం కొంత వివాదానికి దారితీసినట్లు తెలిసింది. రోజుకు అద్దెకార్ల డ్రైవర్ల ద్వారా రూ.లక్షల్లో లంచం సొమ్ములు చేతులు మారుతున్నాయి. ఈ తరహా లావాదేవీలకు చెక్‌ పడుతుందనే అద్దెకార్లు పెట్టుకునేలా లాబీయింగ్‌ చేసినట్లు తెలిసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement