Friday, May 3, 2024

ఇంటర్‌ ఫలితాలపైనా కరోనా ఎఫెక్ట్‌.. ఉత్తీర్ణతలో బాలికలే టాప్‌

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ పరీక్షా ఫలితాలలో బాలికల హవా కనిపించింది. పదో తరగతి ఫలితాల్లోనూ బాలికలే అత్యధికంగా ఉత్తీర్ణులు కాగా.. ఇంటర్‌ ఫలితాల్లోనూ పై చేయి సాధించారు. విజయవాడలోని ఓ హోటల్‌లో బుధవారం ఇంటర్మీడియట్‌ మొదటి, రెండో సంవత్సరం పరీక్షా ఫలితాలను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలో 8 లక్షల 69 వేల 59 మంది రెగ్యులర్‌ విద్యార్థులు, 72 వేల 299 మంది ఒకేషనల్‌ కోర్సు విద్యార్థులు పరీక్షలు రాయగా వారిలో మొదటి సంవత్సరానికి సంబంధించి 54 శాతం మంది, రెండో సంవత్సరానికి సంబంధించి 61 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని వివరించారు.

మొదటి సంవత్సరంలో బాలురు 49 శాతం మంది ఉత్తీర్ణత సాధిస్తే, బాలికలు 60 శాతం మంది ఉత్తీర్ణత సాధించారని, రెండో సంవత్సరంలో బాలురు 54 శాతం మంది ఉత్తీర్ణత సాధిస్తే బాలికలు 68 మంది పాసయ్యారని తెలిపారు. ఉమ్మడి జిల్లాల్లో కృష్ణా జిల్లా 72 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలవగా, కడప జిల్లా 50 శాతం ఉత్తీర్ణతతో చివరి స్థానంలో నిలిచిందని మంత్రి తెలిపారు. ఇంటర్మీడియట్‌ పరీక్షా ఫలితాలలో కొన్ని జిల్లాలలో ఉత్తీర్ణత శాతం తక్కువ రావడానికి కారణాలను విశ్లేషిస్తున్నామని, మెరుగైన ఫలితాలు సాధించే విధంగా కృషి చేస్తామని ఇందుకు విద్యా శాఖ అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటు మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.

పారదర్శకంగా పరీక్షలు..

ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలను పారదర్శకంగా నిర్వహించామని మే 6 నుంచి 25 వరకు పరీక్షలు జరిగాయని మంత్రి బొత్స తెలిపారు. మే 18 నుంచి జూన్‌ 14 వరకు స్పాట్‌ వాల్యూయేషన్‌ నిర్వహించామన్నారు. మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్‌ పరీక్షలకు 4 లక్షల 45 వేల 604 మంది పరీక్షలు రాయగా 2 లక్షల 41 వేల 591 మంది ఉత్తీర్ణత సాధించారని, రెండో సంవత్సరానికి సంబంధించి 4 లక్షల 23 వేల 455 మంది పరీక్షలు రాయగా 2 లక్షల 58 వేల 449 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని వివరించారు. విద్యార్థులు రీ వెరిఫికేషన్‌, రీ కౌంటింగ్‌ కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 25వ తేదీ నుంచి జూలై 5వ తేదీ వరకు అవకాశం కల్పించామని మంత్రి అన్నారు.

- Advertisement -

ఫెయిల్‌ అయిన విద్యార్థులకు అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నామని, జూలై 8వ తేదీ లోగా పరీక్ష ఫీజు చెల్లించాలని విద్యార్థులకు సూచించారు. ఆగస్టు మూడో తేదీ నుంచి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభమవుతాయని, అదే నెల 12వ తేదీ వరకు రోజూ రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి వివరించారు. అలాగే ప్రాక్టికల్‌ పరీక్షలు ఆగష్టు 17 నుంచి 22 వరకు జిల్లా హెడ్‌ క్వార్టర్‌లలో నిర్వహిస్తారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.

ఐదేళ్లలో తక్కువ ఉత్తీర్ణత నమోదు..

2017లో మొదటి సంవత్సరం విద్యార్థులు 64 శాతం మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 73 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. 2018లో వరుసగా 62, 69 శాతం, 2019లో 60, 68 శాతం, 2020లో 59, 59 శాతం పాస్‌ పర్సంటేజ్‌ నమోదు కాగా.. గతేడాది 2021లో కరోనా కారణంగా ఆల్‌ పాస్‌ చేయడంతో నూరు శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఈ ఏడాది గత ఐదేళ్ల కన్నా తక్కువగా ఫస్టియర్‌లో 54 శాతం, సెకండియర్‌లో 61 శాతం ఉత్తీర్ణత నమోదైంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement