Monday, April 29, 2024

AP | సంక్రాంతి నాటికి మరో 5లక్షల ఇళ్ల నిర్మాణం.. జిల్లాల వారీగా లక్ష్యం

అమరావతి, ఆంధ్రప్రభ:సామాన్యులకు సొంతింటి కలను నెరవేర్చాలనే సంకల్పంతో చేపట్టిన నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా రెండో విడత ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి వచ్చే సంక్రాంతి పండుగ కానుకగా గృహ ప్రవేశాలు చేపట్టేందుకు రాష్ట్రంలో రెండో విడతలో మరో ఐదు లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలనే ప్రభుత్వ ఆదేశాలతో జిల్లాల్లో అధికారులు ఉరుకులు, పరుగులు పెడుతున్నారు. సంక్రాంతి నాటికి తమ జిల్లాల్లో ఇళ్ల నిర్మాణాలు లక్ష్మాన్ని పూర్తి చేసేందుకు జిల్లా కలెక్టర్లు తీవ్ర కసరత్తు చేస్తున్నారు.

మూడు రోజుల క్రితం గృహ నిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్‌ గృహ నిర్మాణశాఖ అధికారులతో సమీక్షించి, జిల్లాల వారీగా లక్ష్యాలను అధిగమించాలని ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో గృహ నిర్మాణశాఖ ఉన్నతాధికారులు జిల్లాల వారీగా లెక్కలు వేసి మరీ లక్ష్యాలను నిర్దేశించారు. సంక్రాంతి కానుకగా పేదలకు ఇళ్లను ఇవ్వాలనే ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చేందుకు జిల్లా కలెక్టర్లు జగనన్న ఇళ్ల నిర్మాణాల పై ప్రత్యేక దృష్టి సారించారు.

- Advertisement -

రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కలెక్టర్లు ఆయా శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహించి సంక్రాంతికి ముందే తమ లక్ష్యాలను అధిగమించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. గత నెల 12వ తేది రాష్ట్ర వ్యాప్తంగా 5,85,829 లక్షల వైఎస్సార్‌ జగనన్న ఇళ్లను ప్రారంభించిన విషయం విధితమే. ప్రతి పేదింటి మహిళలకు సొంతింటి కలను నెరవేర్చాలన్న సంకల్పంతో ఉన్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి వచ్చే సంక్రాంతి నాటికి రాష్ట్రంలో మరో ఐదు లక్షల పేదల ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేయాలనే లక్ష్యంతో గృహ నిర్మాణ శాఖ ఆ దిశగా అడుగులు వేస్తోంది.

నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 30.75 లక్షల ఇళ్ల పట్టాలను పంపిణీ చేసి వైసీపీ ప్రభుత్వం దేశంలోనే రికార్డు సృష్టించారు. అంతే కాదు పంపిణీ చేసిన స్థలాల్లో పక్కా ఇళ్ల నిర్మాణాలకు ప్రభుత్వం పేదలకు కొండంత అండగా నిలిచి, ఇళ్ల నిర్మాణాలు చేపడుతోంది. దీంతో ఏన్నో ఏళ్లగా సొంతింటి కల నేర వేర్చుకోలేని వారంతా ఇప్పుడు తమ ఇంటి కలను సాకారం చేసుకుంటున్నారు. భూముల ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో తక్కువ స్థలంలోనైనా అందమైన ఇళ్లను నిర్మించుకుంటున్నారు.

ప్రభుత్వం పంపిణీ చేసి 30.75 లక్షల ఇంటి స్థలాలకు గాను 22 లక్షల ఇళ్ల నిర్మాణానికి అనుమతులు కూడా ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో మొదటి దశ కింద ఐదు లక్షల ఇళ్ల నిర్మాణాలను పూర్తిచేయగా, రెండో విడతగా సంక్రాంతి పండుగ నాటికి మరో ఐదు లక్షల ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సంక్రాంతి నాటికి ఐదు లక్షల ఇళ్ల నిర్మాణాల్లో భాగంగా ఇప్పటికే 98,308 ఇళ్ల నిర్మాణం పూర్తయినట్లు గృహ నిర్మాణశాఖ అధికారులు చెబుతున్నారు. మిగిలిన 4 లక్షలకు పైగా ఇళ్లను నిర్దేశించుకున్న లక్ష్యంలోగా పూర్తిచేసి పేదలకు అందించేందుకు గృహ నిర్మాణ శాఖ శరవేగంగా అడుగులు వేస్తోంది.

ప్రస్తుతం నిర్మాణాలు జరుగుతున్న ఇళ్ల నిర్మాణాల్లో 12,479 ఇళ్లు పూర్తి దశలో ఉండగా, లక్ష ఇళ్ల వరకు రూప్‌ లెవల్లో ఉన్నాయి. మరో మూడు లక్షల ఇళ్లు పునాది దశల్లో ఉండటంతో ఆ ఇళ్లను శర వేగంగా పూర్తి చేసేందుకు గృహ నిర్మాణశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. అర్హులైన పేదలందరికీ ఉచితంగా ఇంటి స్థలాలను పంపిణీ చేసిన ప్రభుత్వం , అంతటితో ఆగకుండా ఇళ్లు నిర్మించుకోలేని వారందరికీ ప్రభుత్వమే ఇంటి నిర్మాణాలు చేపడుతున్న విషయం తెలిసిందే.

ఒక్కో ఇంటి నిర్మాణం నిమిత్తం యూనిట్‌కు రూ.1.80 లక్షల బిల్లు మంజూరు చేయడంతో పాటు, స్వయం సహాయక బృందాల ద్వారా లబ్ధిదారులైన మహిళలకు పావలా వడ్డీకి రూ.35 వేలు రుణసాయం కూడా చేస్తోంది. మరో వైపు ఇళ్ల నిర్మాణాలకు ఉచితంగా ఇసుకను పంపిణీ చేయడం ద్వారా రూ.15 వేలు.. స్టీల్‌, సిమెంట్‌, ఇలా 12 రకాల నిర్మాణ సామగ్రిని సబ్సిడీపై సరఫరా చేయడం ద్వారా రూ.40 వేలు చొప్పున మొత్తంగా రూ.2.70 లక్షల చొప్పున అదనంగా లబ్ధిచేకూరుస్తోంది. ఇలా ప్రతి పేద మహిళకు సొంతింటి కలను నెరవేర్చేందుకు వైసీపీ సర్కారు తీసుకున్న నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

మొదటి విడతగా 5లక్షల ఇళ్లను ప్రారంభించిన ప్రభుత్వం, రెండో విడతగా మరో 5లక్షల ఇళ్లను సంక్రాంతి నాటికి లబ్ధిదారులకు అందించి గృహ ప్రవేశాలు చేయాలని ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించడంతో మహిళల్లో ఆనందం ఉప్పొంగుతోంది. సంక్రాంతి పండుగ రోజున సొంతింటిలోకి వెళుతున్నామనే ఆనందం వారిలో వెల్లువిరుస్తోంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల మహిళల్లో ఒక రకమైన ఆనందం కనిపిస్తోంది.

ప్రస్తుతం గ్రామాల్లో ఇదే చర్చ జరుగుతుండటం గమనార్హం. నలుగురు ఒక చోట కలిసిన మహిళలు సంక్రాంతి రోజున జగనన్న ఇళ్లల్లో గృహ ప్రవేశాలు చేస్తున్నామని చర్చించుకుంటున్నారు. సంక్రాంతి పండుగ రోజుల జగనన్న ఇళ్ల గృహ ప్రవేశాల పై మంత్రి జోగి రమేష్‌ ఉన్నతాధికారులతో సమీక్షించడం, క్యాబినెట్‌ సమావేశంలో ఇదే అంశం పై చర్చించడంతో రాష్ట్రంలో సంక్రాంతి పండుగతో పాటు, ఇళ ్ల గృహ ప్రవేశాల పండుగ కూడా జరగనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement