Sunday, May 26, 2024

Congress – నిర్ణేతలు మీరే.. మీ తీర్పుతోనే న్యాయం – ష‌ర్మిల

అన్యాయంపై నా పోరాటం
హత్యకేసులోని నిందితులు గెల‌వ‌ద్దు
రాజన్న లెక్కనే సేవ చేస్తా
ఎంపీగా గెలిపించండి
వైఎస్ వివేకా ఘాట్ వద్ద నివాళులు
కాంగ్రెస్ లో ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు చేరిక
మేన‌త్త విమ‌ల‌మ్మ‌కు కౌంట‌ర్

( ఆంధ్రప్రభ , కడప –బ్యూరో) – ‘‘ఓ వైపు రాజశేఖర్‌రెడ్డి బిడ్డ నిలబడింది.. రాజశేఖర్‌రెడ్డి తమ్ముడు వివేకాను హత్య చేయించిన అవినాష్ రెడ్డి మరో వైపు నిలబడ్డాడు.. మీకు ఎంపీగా రాజశేఖర్‌రెడ్డి బిడ్డ కావాలా…? అవినాష్ రెడ్డి కావాలా? తేల్చుకోండి.. న్యాయం వైపు నిలబడి నేను చేస్తున్న పోరాటానికి మీరే నిర్ణేతలు.. ”అని పీసీసీ అధ్యక్షురాలు, కడప కాంగ్రెస్​ ఎంపీ అభ్యర్థి వైఎస్‌ షర్మిల అన్నారు. శనివారం వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె డాక్టర్ సునీతా రెడ్డి తో కలిసి జమ్మలమడుగు నియోజకవర్గం ముద్దనూరులో బస్సుయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో షర్మిల మాట్లాడుతూ.. ఓ వైపు న్యాయం, ధర్మం… ఇంకో వైపు అధికారం డబ్బు ఉన్నాయన్నారు.

తాము వైఎస్ఆర్, వివేకా మీ బిడ్డలమని, వారిలాగే మేము మీకు సేవ చేయాలని వచ్చామని తెలిపారు. స్వయంగా చిన్నాన్న వివేకాను హత్య చేసి ఐదేళ్లయినా ఇంత వరకు హంతకులకు శిక్ష పడలేదన్నారు. స్వయంగా జగన్ మోహన్ రెడ్డి హంతకులను కాపాడుతున్నారని ఆరోపించారు. అధికారం అడ్డుపెట్టుకొని దోషులను కాపాడుతున్నారని విమర్శించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డి దర్జాగా బయట తిరుగుతున్నాడని, ఈ అన్యాయం తట్టుకోలేక నే… వైఎస్ఆర్ బిడ్డ పోటీ చేస్తోందన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి లాగే నేను మీకు సేవ చేసేందుకే వచ్చా. ఎంపీగా గెలిపించండని కోరారు. ఇక్కడే ఉండి మీకు సేవ చేస్తా. ఎవరిని గెలిపించాలో ఇక నిర్ణయితలు మీరే.. ప్రజలు తీర్పు చెప్పే సమయం ఆసన్నమయ్యిందని షర్మిల అన్నారు.

- Advertisement -

ఆధారాల‌తోనే మాట్లాడుతున్నాం… మేన‌త్త‌కు ష‌ర్మిల కౌంట‌ర్

ఎపి పిసిసి చీఫ్ షర్మిల, వివేకా కుమార్తె సునీత కుటుంబ పరువు తీస్తున్నారంటూ మేనత్త విమలమ్మచేసిన వ్యాఖ్యలపై షర్మిల ఘాటుగా స్పందించారు. కడప జిల్లా సున్నపురాళ్లపల్లిలో షర్మిల మీడియాతో మాట్లాడుతూ, చనిపోయింది సొంత అన్న అని విమలమ్మ మరిచిపోయినట్టుంది అంటూ ఎత్తిపొడిచారు. వివేకా హత్య విషయంలో తామేమీ ఆధారాలు లేకుండా మాట్లాడడంలేదని స్పష్టం చేశారు. హత్య కేసులో ఆధారాలు ఉన్నందునే గట్టిగా చెబుతున్నామని అన్నారు. మళ్లీ అలాంటి అన్యాయం జరగకూడదనే అక్కాచెల్లెళ్లం పోరాడుతున్నామని షర్మిల వివరించారు. హత్యా రాజకీయాలు ఆగాలనేదే తమ పోరాటం అని పేర్కొన్నారు. “విమలమ్మ కుమారుడికి జగన్ పనులు ఇచ్చారు. ఆర్థికంగా బలపడినందువల్లే విమలమ్మ అన్నీ మరిచిపోయారు. వివేకా ఎంత చేశారో విమలమ్మకు ఏమీ గుర్తులేనట్టుంది” అంటూ షర్మిల ధ్వజమెత్తారు.

వివేకానంద ఘాట్ వద్ద నివాళులు…

బస్సు యాత్ర ప్రారంభానికి ముందు షర్మిలా రెడ్డి పులివెందులలోని వైఎస్ వివేకానంద రెడ్డి ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. డాక్టర్ సునీతా రెడ్డితో కలిసి వైఎస్ వివేకా తోపాటు వైయస్ కుటుంబ సభ్యుల సమాధులకు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.

కాంగ్రెస్​లో ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు చేరిక

వైసీపీకి మరో షాక్ తగిలింది. పి. గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు ఆ పార్టీని వీడారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ ఎన్నికల్లో టికెట్ ను ఆయన స్థానంలో విప్పర్తి వేణుగోపాల్ కు వైసీపీ కేటాయించింది. అప్పటి నుంచి అసంతృప్తిగా ఉన్న చిట్టిబాబు శనివారం పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరారు. వైఎస్ఆర్ జిల్లా ముద్దనూరులో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement