Sunday, April 28, 2024

Congress – ఏపీ కి ప్రత్యేక హోదా తెస్తాం – ష‌ర్మిల

రెండు లక్షల రైతు రుణమాఫీ చేస్తాం
రాజన్న పాలన కాంగ్రెస్ తోనే సాధ్యం..
బాబు, జగనన్న ఇద్దరూ ఇద్దరే
తమపై కేసులతో భయపడి
మోదీకి తొత్తులయ్యారు
ఏపీ పీసీసీ చీఫ్ వైయస్ షర్మిలా రెడ్డి

( కార్వేటినగరం, ప్రభ న్యూస్) – ఏపీకి ప్రత్యేక హోదా తెచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని, సీఎం జగనన్న, మాజీ సీ ఎం చంద్రబాబు ఇద్దరూ ప్రధాన మంత్రి నరేంద్రమోడీ కి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. చిత్తూరు జిల్లా జీడి నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరం లో సోమవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పోటుగారి భాస్కర్ ఆధ్వర్యంలో న్యాయ యాత్ర నిర్వహించారు. వైఎస్ షర్మిలకు గజమాలతో సత్కరించి రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీపీసీసీ అధ్యక్షురాలు షర్మిల రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజన్న రాజ్యం కావాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని , కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతోనే ఖచ్చితంగా ప్రత్యేక హోదా రాష్ట్రానికి ఇప్పించి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతానని ప్రజల సమక్షంలో హామీ ఇచ్చారు.

ఇద్దరూ ఇద్దరే

గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ప్రస్తుత ప్రభుత్వంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇద్దరూ రాష్ట్రానికి చేసిన మేలు ఏమీ లేదని ఇద్దరూ కూడా బీజేపీకి పొత్తులేనని , చంద్రబాబు నాయుడు ప్రత్యక్షంగా పొత్తు పెట్టుకుంటే జగన్ మోహన్ రెడ్డి రహస్యంగా పొత్తు పెట్టుకున్నారని, వీరిద్దరే తమపై కేసుల నుంచి తప్పించుకొని తిరగడానికి బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని షర్మిల ఆరోపించారు. . అంతేకాకుండా వీరిద్దరతో రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని, చెప్పిన హామీలు నెరవేర్చి ఉంటే చంద్రబాబు 2019 ఎన్నికల్లో ఎందుకు ఓడతాడని, 2019 ఎన్నికల తర్వాత జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి ప్రజలకు బటన్ నొక్కి మంచి చేస్తానని ప్రజలను నమ్మించారని షర్మిల విమర్శించారు.

- Advertisement -

ఇచ్చేది మట్టి కుండ.. గుంజేది వెండి కుండ

ఇచ్చేది మట్టి కుండ, ప్రజల నుంచి తీసుకునేది వెండికుండ అని ఎద్దేవా చేశారు . ఈ ప్రభుత్వంలో ప్రజల నడ్డి విరిచేలా నిత్యవసర సరుకులు నుంచి పెట్రోల్ డీజెల్, మద్యం వరకు రేట్లు అనూహ్యంగా పెంచి దోచుకొంటున్నారని ఆరోపించారు.తాము అధికారంలోకి వస్తే రైతులకు రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని పంటలకు గిట్టుబాటు ధరను తీసుకొస్తామని , చెరకు రైతులకు ఫ్యాక్టరీలను మళ్లీ తెరిపించి న్యాయం చేస్తామని మామిడి రైతులకు గిట్టుబాటు ధరలు ఉండేలా చర్యలు తీసుకొని సిండికేట్ వ్యాపారాన్ని లేకుండా చేస్తామని రైతులకు హామీ ఇచ్చారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ తరఫున గంగాధర నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా దెయ్యాల రమేష్ బాబు ను చూపించి అఖండ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మీడియా అధికార ప్రతినిధి గోవర్ధన్ రెడ్డి, జిల్లా నాయకులు మాజీ జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు గౌతమ్ రాజు, జిల్లా మహిళా అధ్యక్షురాలు చందురాణి, కన్నన్ సుబ్బరాయుడుపాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement