Friday, February 23, 2024

AP: కనకదుర్గమ్మను దర్శించుకున్న సీఎం జగన్… ఆలయ పనులకు శంకుస్థాపనలు

ప్రభ న్యూస్, ఎన్టీఆర్ బ్యూరో : రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారిని దర్శించుకున్నారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, పలు ఆలయాల ప్రారంభోత్సవం సందర్భంగా ఇవాళ ఇంద్రకీలాద్రికి వచ్చిన సీఎం జగన్మోహన్ రెడ్డికి ఆలయ అధికారులు, వేద పండితులు, అర్చకులు, పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు.

అమ్మవారిని దర్శించుకున్న సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక పూజలను నిర్వహించగా, మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు. వేద పండితులు, వైదిక కమిటీ సభ్యులు అమ్మవారి ప్రసాదాన్ని అందజేయగా.. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి స్వీకరించారు. దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఈవో కెఎస్ రామారావు, ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ కర్నాటి రాంబాబు అమ్మవారి చిత్రపటాన్ని ప్రసాదాలను అందజేశారు. అంతకుముందు కనకదుర్గనగర్ వద్ద ఆలయ అభివృద్ధి పనులకు సంబంధించి శంకుస్థాపన కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా చేశారు. రూ.216 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఆలయ అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు చేశారు. అలాగే పలు ఆలయాలను పునర్నిర్మాణం చేసిన సందర్భంగా వాటిని ప్రారంభించారు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా ఆలయ పరిసర ప్రాంతాల్లో ఇంద్రకీలాద్రిపై గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement