Monday, April 29, 2024

బస్సు ప్రమాదంపై సీఎం దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా

పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం జల్లేరు వాగులోకి బస్సు పడిపోయిన ఘటనపై సీఎం వైయస్‌.జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు సంతాపాన్ని తెలియజేశారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందించాలని అధికారులను ఆదేశించారు. గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందేలా తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.

జంగారెడ్డిగూడెంకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి జల్లేరు వాగులో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ సహా 9 మంది చనిపోయారు. పలువురికి తీవ్ర గాయాలైయ్యాయి. క్షతగాత్రులను జంగారెడ్డిగూడెం ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. చనిపోయిన వారిలో మహిళలు, చిన్నారులే ఎక్కువున్నారు. మృతుల సంఖ్య పెరిగే ప్రమాదముందని అధికారులు చెబుతున్నారు. వాగుపై ఉన్న వంతెనను ఢీకొట్టి వాగులో పడిపోయిందని స్థానికులు చెబుతున్నారు. బస్సు బోల్తా పడిన వెంటనే కొందరు ప్రయాణికులు కిటికీలోంచి బయటపడ్డారు. బస్సులోని ప్రయాణికులను పడవల సాయంతో స్థానికులు ఒడ్డుకు చేర్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement