Sunday, April 28, 2024

AP: చదువుల్లో క్లాస్ వార్ – మనపై చంద్రబాబు అండ్ కో యుద్ధం – జ‌గ‌న్

(ప్రభ న్యూస్ బ్యూరో -కృష్ణా) – పేద పిల్లల చదువుల కోసం విద్యారంగంలో సంస్కరణలు తీసుకొస్తుంటే పెత్తందారులు అడ్డుకుంటున్నారని.. ఈ రంగంలో కూడా క్లాస్ వార్ చేయాల్సిన పరిస్థితి నెలకొనడం దురదృష్టకరమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. కృష్ణాజిల్లా పామర్రులో జరిగిన జగనన్నవిద్యా దీవెన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని బటన్ నొక్కి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్​ను జమచేశారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. పేద విద్యార్థులు ఉన్నత ప్రమాణాలతో విద్య అందించాలనే లక్ష్యంతో పలు కార్యక్రమాలు చేపట్టామన్నారు. విద్యలో తీసుకొస్తున్న సంస్కరణలు పేదల ఉన్నత చదువులు చదివి అంతర్జాతీయ రంగంలో పోటీపడే విధంగా తీర్చిదిద్దుతున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం తీసుకువస్తామనంటే మనం చంద్రబాబుతో యుద్దం చేయాలి, ఒక పచ్చ మీడియాతో యుద్ధం చేయాలి, ఒక దత్తపుత్రుడితో యుద్దం చేయాల్సి వస్తుందని వాపోయారు.

పేదోళ్లు పనిరానోళ్ల…
పెత్తందారులుగా వాళ్లే ఉండాలట, పేదోళ్లు పని వారిగా మనం ఉండాలట, పరిశ్రమలు వారివట, కార్మికులు మనమట, పెత్తందారి మనస్తత్వాలు అర్థం చేసుకోవాలని, జగనన్న పేదల కుటుంబాలలో వెలుగు నింపాలని విద్యారంగంలో విప్లవాత్మకమైన సంస్కరణలు తీసుకొచ్చినట్లు చెప్పారు. పెత్తందారి పిల్లల చేతుల్లో ట్యాబ్ లు ఉండొచ్చు, కానీ మన పిల్లలకు ట్యాబ్ లు ఇస్తే చెడిపోతారని అడ్డుపడుతున్నారని చెప్పారు. పెత్తందారి మనస్తత్వానికి ఇవన్ని కూడా నిదర్శనం అన్నారు. విద్యారంగంలో వారికి మనకి యుద్ధం జరుగుతుందన్నారు.

ఉన్నత విద్య కోసమే… ఈ జగన్నాథ రథం

- Advertisement -

రాష్ట్రంలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న 9.44 లక్షల మంది విద్యార్థులకు అక్టోబరు–డిసెంబరు–2023 త్రైమాసికానికి సంబంధించిన జగనన్న విద్యా దీవెన కింద రూ.708.68 కోట్లను నేడు జమ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ 57 నెలల కాలంలోనే మొత్తం రూ.29.66 లక్షల మంది పిల్లలకు మంచి జరిగిస్తూ రూ. 12,610 కోట్ల తల్లుల ఖాతాల్లోకి జమ చేసినట్లు పేర్కొన్నారు. విద్యా దీవెన, వసతి దీవెన పథకాలకు ప్రభుత్వం ఇప్పటివరకూ రూ.18,002 కోట్లను వ్యయం చేసినట్లు వెల్లడించారు.

మూడు పార్లు సీఎం చేసిన మంచేంటీ..

మూడుసార్లు సీఎంగా పని చేసిన చంద్రబాబు పేద విద్యార్దులకు చేసిన మంచేంటి అని జగన్ ప్రశ్నించారు. పేద పిల్లల భవిష్యత్తు మార్చేందుకు ఎప్పుడైనా చంద్రబాబు ప్రయత్నించారా ఆ లైన్ ఇన్కమ్ టాక్స్ తీసుకువచ్చారా అని ప్రశ్నించారు. చంద్రబాబు పేద విద్యార్థుల కోసం చేసిన మంచి ఏంటి చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు పేరు చెబితే ఆయన చేసిన చెడు చాలానే ఉందన్నారు. చంద్రబాబు ఏ రోజైనా ప్రభుత్వ పాఠశాలలను పట్టించుకున్నారా అని సూటిగా ప్రశ్నించారు. తాను చేసిన పనుల్లో ఒక్క శాతమైనా చంద్రబాబు చేశారా అంటూ జగన్ ప్రశ్నించారు.

కార్పోరేట్ గాళ్ల కోసమే .. విద్యా వ్యవస్థ భ్రష్టు..
నారాయణ, చైతన్య విద్యాసంస్థల కోసమే చంద్రబాబు విద్యా వ్యవస్థను పట్టించుకోలేదని ఆరోపించారు. చంద్రబాబు ఆయన మనుషులు, పెత్తందారుల భావజాలాల మీద తిరుగుబాటుగానే విదేశీ విద్యాలయాల్లోని కోర్సులు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకువచ్చినట్లు చెప్పారు. ఇందుకోసమే మన జగన్నాథ రథం కదులుతుందన్నారు. మూడవ తరగతిలోనే మన ప్రభుత్వ బడుల్లో సబ్జెక్ట్‌ టీచర్‌ కాన్సెప్ట్‌ తీసుకొచ్చామన్నారు. మూడవ తరగతిలోనే టోఫెల్‌ ఓరియెంటేషన్‌ కాన్సెప్ట్‌, బై లింగ్విల్‌ టెక్స్ట్ బుక్స్‌ తీసుకొచ్చినట్లు చెప్పారు.

తొలుత దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పామర్రు శాసనసభ్యులు కైలా అనిల్ కుమార్ అధ్యక్షత వహించగా.. మంత్రులు బొత్స సత్యనారాయణ, జోగి రమేష్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పల హారిక, మాజీ మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని, ఎమ్మెల్సీలు మొండితోక అరుణ్ కుమార్, జయ మంగళం వెంకటరమణ, కల్పలత, ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు, వ్యవసాయ కమిషన్ చైర్మన్ నాగిరెడ్డి, ఎస్సీ కమిషన్ చైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్, కలెక్టర్ రాజబాబు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement