Sunday, May 19, 2024

కుప్పం చరిత్రలో ఇదొక బ్లాక్ డే.. చంద్రబాబు

కుప్పం చరిత్రలో ఇదొక బ్లాక్ డే అని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కుప్పం నియోజకవర్గంలో రెండో రోజు పర్యటిస్తున్న చంద్రబాబు అన్న క్యాంటీన్ వద్ద మాట్లాడుతూ… ఈ రోజు కుప్పం చరిత్రలో ఒక చీకటి రోజన్నారు. అన్నం పెట్టే అన్న క్యాంటీన్ ను ధ్వంసం చెయ్యడం నీచమన్నారు. వీధికొక రౌడీని తయారు చేసి ప్రజలపైకి ఉసిగొల్పుతున్నారన్నారు. పోలీసులు సరిగా ఉండి ఉంటే అన్న క్యాంటీన్ ను ఇలా ధ్వంసం చేసేవారా అన్నారు. ఎస్పీ ఎక్కడ ఉన్నాడు…..ఏం చేస్తున్నాడని ప్రశ్నించారు. మా వాళ్లు కూడా దాడులకు దిగితే ఏం చేస్తారని అన్నారు. మీకు 60 వేల మంది పోలీసులు ఉంటే మాకు 60 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారన్నారు. పక్కనే పోలీస్ స్టేషన్ ఉన్నా దాడి చేశారు….మరి పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.

రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఉందా….పోలీసులు ఉంది మాపై దాడులు చెయ్యడానికా? అని అడిగారు. అన్న క్యాంటీన్ పై దాడి చేసిన వారిని పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లకుండా ఇంటికి తీసుకువెళతారా ? అన్నారు. మూడేళ్లుగా జరుగుతున్న గ్రానైట్ అక్రమాలను ప్రశ్నించి అడ్డుకున్నాం…..బియ్యం అక్రమ రవాణాను అడ్డుకున్నామన్నారు. మూడేళ్లలో అనేక చోట్ల తన పర్యటనలకు అడ్డంకులు సృష్టించారు. కోర్టు కూడా చీవాట్లు పెట్టిందన్నారు. అప్పుడే పోలీసు వ్యవస్థ చచ్చిపోయింది… తమ ఇంటికి వచ్చిన రౌడీలకు ప్రమోషన్ ఇచ్చి జగన్ మంత్రులను చేశాడన్నారు. దాడులు చేసి భయపెట్టి గెలవాలి అనుకుంటున్నారు.. ఇలాంటి దాడులకు టీడీపీ భయపడేది లేదన్నారు. పోలీసుల దాడిలో గాయపడ్డ కార్యకర్తను ప్రజలకు, మీడియాకు చూపించి ప్రశ్నించారు టీడీపీ అధినేత. వైసిపి, పోలీసులపై న్యాయ పరంగా పోరాడుతా…రాజకీయంగా కూడా పోరాడుతాన‌న్నారు. కొందరు పోలీసులు కంటే బ్రిటిష్ వాళ్లే నయం అనిపించిందన్నారు. వాళ్ల ప్రవర్తన అలా ఉందన్నారు.

ప్రజలు మౌనంగా ఉంటే వారి ఇంటి వరకు రౌడీలు వస్తారు. చైతన్య వంతంగా ఉండి పోరాడాలన్నారు. వైసీపీ పతనం నేటి నుంచి ప్రారంభమైంద‌న్నారు. కుప్పం నుంచి ధర్మపోరాటానికి నాంది అన్నారు. కుప్పంలో నేడు సిగ్గు లేకుండా ఆర్టీసీ బస్సులు నిలిపివేశారు…స్కూళ్లు మూసి వేశారు. ఏంటి ఇవన్నీ? అని ప్ర‌శ్నించారు. త‌న శైలికి భిన్నంగా ఇకపై కఠినంగా వెళ్లాల్సిన అవసరం ఉందని…అందుకే ఇలా మట్లాడాల్సి వస్తుందన్నారు. ఎక్కువ కాలం త‌మ కార్యకర్తలను కట్టడి చెయ్యడం కూడా సాధ్యం కాదన్నారు. వైసీపీ వాళ్లు కూల్చిన దగ్గరే అన్న క్యాంటీన్ లో భోజనం పెడుతున్నాన‌న్నారు. ఈ సారి త‌మపై దాడి జరిగితే….వాళ్ల ఇంటికి వెళ్లి కొడతామ‌న్నారు. అన్నం పెట్టే వాడిపై చెయ్యి చేసుకోవడం నీచం…కన్నతల్లిపై దాడి చేసినట్లేన‌న్నారు. పేదవాడికి అన్నం పెట్టే అన్న క్యాంటీన్ పై దాడిని తీవ్రంగా తీసుకుంటున్నామ‌న్నారు. అన్న క్యాంటీన్ ఇక్కడే కొనసాగుతుందని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement