Saturday, May 18, 2024

హోదా పేరుతో వైసిపి, టిడిపిలు మోసం చేస్తున్నాయి – ఎంపి సుజ‌నా చౌద‌రి..

తిరుప‌తి – ప్ర‌త్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయ‌మ‌ని, ఇంకా ఆ పేరుతో వైసిపి, టిడిపిలు ప్ర‌జ‌లను మోసం చేస్తున్నాయ‌ని బిజెపి ఎంపి సుజ‌నా చౌద‌రి అన్నారు.. తిరుప‌తిలో ఆయ‌న మీడియ‌తో మాట్లాడుతూ, ఏపీకి హోదా పేరుతో కొన్నిపార్టీలు రాజకీయం చేస్తున్నాయని విమర్శించారు. పుదుచ్చేరికి ప్ర‌త్యేక‌ హోదా ఇస్తామ‌ని త‌మ పార్టీ ఎక్క‌డ పేర్కొన‌లేద‌ని తేల్చి చెప్పారు.. టిడిపి అధినేత చంద్రబాబు ప్రధానమంత్రి అయినా ఏపీకి హోదా ఇవ్వలేరని అన్నారు. ఎందుకంటే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు హోదా కుదరదని ఆర్థిక సంఘం చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వం, ఎమ్మెల్యేల తీరుతో ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టాలంటే కంపెనీలు భయపడుతున్నాయని, ఉన్న కంపెనీలు వెళ్లిపోతున్నాయని బీజేపీ అన్నారు. వైసీపీకి 22 మంది ఎంపీలను గెలిపిస్తే ఏపీకి ఏం సాధించారని ప్రశ్నించారు. తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ దేశంలో ఏ ప్రభుత్వం ఇంతగా కోర్టులతో మొట్టికాయలు వేయించుకోలేదని ఆయన ఎద్దేవా చేశారు. కేంద్రం నుంచి రావాల్సిన వాటిని అడిగే పరిస్థితి కూడా లేదని విమర్శించారు. ఇకనైనా ప్రజలు వైసీపీకి ఓట్లు వేసి ఓట్లను దుర్వినియోగం చేసుకోవద్దని సుజనా చౌదరి సూచించారు. ఉపఎన్నికలో బీజేపీని గెలిపిస్తే తిరుపతి అభివృద్ధి చెందుతుందని అన్నారు. విభజన చట్టంలో ఉన్నవాటితో పాటు లేనివి కూడా ఏపీకి కేంద్రం ఇచ్చిందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement