Tuesday, June 25, 2024

సీఎం జగనన్న ప్రభుత్వానికి ప్రజల్లో విశేష ఆదరణ – ఎమ్మెల్యే చెవిరెడ్డి

తిరుపతిరూరల్ – ప్రజా సంక్షేమమే పరమావధిగా సాగిన సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి రెండు సంవత్సరాల పాలనకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోందని ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు సీఎం జగన్మోహన్ రెడ్డి పై పెట్టుకున్న ఆశలకు అనుగుణంగా ప్రజారంజకంగా పాలనను కొనాగిస్తున్నరని కొనియాడారు. ప్రజల ఆర్థిక స్వావలంబనకు రాష్ట్ర ప్రభుత్వం చేయూతనిచ్చిందన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు సున్నా వడ్డీ రుణాలను అందిస్తూ ఆసరా కల్పిస్తున్నారని వివరించారు. అంతే కాకుండా ప్రభుత్వ పథకాలు ప్రజల ఇంటి వద్దకే చేర్చే విధంగా వాలంటరీ వ్యవస్థను తీర్చిదిద్దారని అన్నారు. అంతే కాకుండా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు మేరకు నిరుద్యోగులకు సచివాలయ వ్యవస్థ ఏర్పాటుతో ఉద్యోగాల కల్పన కు శ్రీకారం చుట్టారని వెల్లడించారు. అమ్మ ఒడి, రైతు భరోసా, ఆరోగ్య శ్రీ వంటి ప్రజామోద పథకాలతో ప్రజలను ఆకట్టుకుంటున్నారని తెలియజేశారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు ధైర్యం కల్పించేలా చర్యలు చేపట్టారని అన్నారు. వ్యాక్సిన్ విషయంలో ఇతర రాష్ట్రాల కంటే మెరుగ్గా దశల వారీగా ప్రజలకు వేయిస్తున్నట్లు వివరించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనపై ప్రజలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారన్నారు. 2019 ఎన్నికల్లో తిరుగులేని మెజారిటీతో చారిత్రాత్మక విజయాన్ని కల్పించి వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలిచిన ప్రజలకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. చంద్రగిరి నియోజకవర్గంలో సీఎం జగన్మోహన్ రెడ్డి స్పూర్తి తో కరోనా మొదటి వేవ్ తో పాటు ప్రస్తుత పరిస్థితుల్లో నా నియోజకవర్గ ప్రజలకు అండగా నిలిచానన్నారు. నిత్యావసర వస్తువులు, మాస్కులు, సానిటైజర్లు, కోడిగుడ్లు, పండ్లు, మల్టీవిటమిన్ సిరప్ లు, ఆయుర్వేద మందులు, కూరగాయలు వంటివి సొంత నిధులు ఖర్చు చేసి బాసటగా నిలిచానన్నారు. నియోజకవర్గ పరిధిలో రెండు కోవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేసి వ్యక్తిగత పర్యవేక్షణ లో కరోనా పేషెంట్లకు మెరుగైన సౌకర్యాలు కల్పించినట్లు తెలియజేశారు. అంతే కాకుండా నియోజకవర్గ పరిధిలో రెండు సంవత్సరాల కాలంలో రూ.270 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. నియోజకవర్గంలో 104 సచివాలయాల భవంతుల నిర్మాణానికి రూ.34 కోట్లు, సీసీ రోడ్లు రూ. 70.23 కోట్లు, 130 గ్రంధాలయాల నిర్మాణానికి రూ.18.02 కోట్లు, నాడు – నేడు పథకం కింద 94 స్కూల్ భవంతుల నిర్మాణానికి రూ.12 కోట్లు, 104 కాలువల నిర్మాణానికి రూ.28 కోట్లు, ఆసుపత్రి భవంతుల నిర్మాణం, ఆర్ అండ్ బి రోడ్లకు రూ.32 కోట్లు, ఇరిగేషన్ పనులకు రూ.36 కోట్లు, 104 రైతు భరోసా భవంతుల నిర్మాణానికి రూ. 22 కోట్లు తదితర పనులు చేపట్టినట్లు వివరించారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement