Thursday, April 25, 2024

ఖరారైన లోకేష్ పాదయాత్ర రూట్ మ్యాప్… ఈనెల 27న కుప్పంలో ప్రారంభం 

తిరుపతి (రాయలసీమ ప్రభ వెబ్ ప్రతినిధి) : తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ ఈనెల‌ 27వ తేదీ నుంచి మొదలు పెట్ట నున్న యువగళం పాదయాత్ర రూట్ మ్యాప్ ఖరారైంది. తన తండ్రి, తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గ కేంద్రంలోని వరదరాజస్వామి ఆలయంలో పూజలు నిర్వహించిన తరువాత లోకేష్ పాదయాత్రను మొదలు పెట్టనున్నారు. రోజుకు 10కిలో మీటర్ల చొప్పున లోకేష్ పాదయాత్ర కొనసాగనుంది. 400 రోజులు 4వేల కిలోమీటర్ల దూరం కొనసాగించనున్న ఆ యాత్రకు సంబంధించిన రూట్ మ్యాప్ ను తెలుగుదేశం పార్టీ శుక్రవారం ప్రకటించింది.

ఆ యాత్ర తొలి దశలో ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన మొత్తం 14 శాసనసభ నియోజకవర్గాల గుండా కొనసాగించనున్నారు. ఆపై ఉమ్మడి అనంతపురం, కర్నూలు, వైఎస్ఆర్ కడప జిల్లాల గుండా కొనసాగేయాత్ర రెండవ దశలో ఉమ్మడి పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోనికి వెంకటగిరి గుండా యాత్ర ప్రవేశించనున్నట్టు మ్యాప్ ద్వారా తెలుస్తోంది. ఈ క్రమంలో రాయలసీమకు చెందిన 8 జిల్లాలకు చెందిన 52 శాసనసభ నియోజక వర్గాల్లో 45 నియోజకవర్గాల గుండా లోకేష్ పాదయాత్ర కొనసాగనున్నదని స్పష్టమవుతోంది. ఉమ్మడి నెల్లూరు జిల్లా మీదుగా కొనసాగే పాదయాత్ర మిగిలిన 123 నియోజకవర్గాల్లో 78 నియోజకవర్గాల గుండా రాష్ట్ర సరిహద్దుల్లోని ఇచ్చాపురం వరకు కొనసాగనున్నది. మొత్తమ్మీద‌ 400 రోజులు కొనసాగే లోకేష్ యువగళం పాదయాత్ర రాష్ట్రంలోని 27జిల్లాలకు చెందిన 175 శాసనసభ నియోజకవర్గాల్లో 123 నియోజకవర్గాల గుండా మాత్రమే కొనసాగనుందని స్పష్టమవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement