Thursday, April 25, 2024

భజన కళాకారులూ కార్మికులే… సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ

తిరుపతి సిటీ : తిరుమల తిరుపతి దేవస్థానంలో భజన కళాకారులుగా ఉన్న వారి సేవలను కొనసాగించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ అన్నారు. కళాకారులు కూడా సమాజం ప్రగతిలో భాగస్వామ్యం అవుతున్నారని చెప్పారు. భక్తి పార్వశ్యంతో భజనలు చేసే కళాకారులు కూడా కార్మికులే అని తాము భావిస్తామని స్పష్టం చేశారు. భజనలు చేసే వారిని కళాకార్మికులుగా గుర్తించాలి అని టిటిడి యాజమాన్యానికి విజ్ఞప్తి చేశారు. దేవస్థానంలో పని చేస్తున్న వేలాది మంది శాశ్విత ఉద్యోగుల మాదిరిగానే అంకిత భావంతో భక్తితో కళా కార్మికులు సేవలు అందిస్తారని పేర్కొన్నారు. శాశ్వ‌త ఉద్యోగుల మాదిరి కళాకారులను మానవత్వంతో చూడాలని కోరారు. వారి సమస్యను పరిష్కరించాలని చెప్పారు. శాశ్వ‌త ఉద్యోగుల మాదిరి వేతనాలు పెంచమని బోనస్ లు ఇవ్వమని కళాకారులు డిమాండు చేయడం లేదని చెప్పారు. తమ భక్తి విశ్వాసాలు ప్రదర్శించే అవకాసంతో పాటు కొంచెం ఆర్థిక సహాకారం మాత్రం అందించాలని యాజమాన్యానికి సూచించారు.

దేవుడు కోరుకునేది కూడా అదే కదా అంటూ వ్యాఖ్యానించారు. టీటీడీ యాజమాన్యం, ఈవో ధర్మారెడ్డి, చైర్మన్ సుబ్బా రెడ్డిల నాయకత్వాన కళాకారులకి మంచి అవకాశాలు అందాలని పేర్కొన్నారు. వారి సేవలను కొనసాగిస్తామని యాజమాన్యం ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ అభినందించారు. తాము కమ్యూనిస్టులమే అయినా సమాజంలో భాగమేనని ఎదుటివారి భక్తిని కాదనలేమని పేర్కొన్నారు. శ్రమ శక్తికి తాము అండగా ఉంటామని… అది కర్మాగారంలో పని చేసిన కార్మికులయినా, రైతాంగం అయినా… కళా కార్మికులు అయినా తాము శ్రమ శక్తిగానే చూస్తామని స్పష్టం చేశారు. ఈ విషయంలో తాను కొన్ని సందర్భాలలో వివాదస్పదం అవుతానని… భక్తికి కాదు భక్తి రూపంలో సేవలో ఉన్న కార్మికులకు తమ మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. టీటీడీలో పని చేస్తున్న కార్మికులకు అన్ని విధాలా అండగా ఉంటామని.. వారి సమస్యలు పరిష్కరించాలని కోరారు. జానపద వృత్తి కళాకారుల సంగం ఆధ్వ‌ర్యంలో దాదాపు 40 వేల మంది బజన కళాకారులు పాల్గొన్నారు. వారికి నాయకత్వంవహించి సమస్తను బలోపేతంగా నడిపిస్తున్న శ్రి పులి మామిడి యాదగిరి నారాయణ అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement