Saturday, July 27, 2024

AP: మళ్ళీ స్వరం మార్చిన చింతా మోహన్

తిరుపతి (రాయలసీమ ప్రభ న్యూస్ బ్యూరో) : ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ మళ్ళీ స్వరం మార్చారు. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును సమర్ధించడం ద్వారా చింతా మోహన్ నాటి ఉద్యమకారుల విమర్శలకు గురయ్యారు. తరువాత దశలో విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తిరుపతి రాజధాని కావాలని డిమాండ్ చేసారు. ప్రస్తుత ఎన్నికలకు ముందు ఇటీవలి కాలంలో అయితే ఆ డిమాండ్ తో ప్రదర్శనలు నిర్వహించారు. అయితే ప్రస్తుత ఎన్నికల సందర్భంగా అమరావతి రాజధానిగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం ప్రకటించింది. ఆ విషయం అడిగినప్పుడు తమ నాయకత్వాన్ని ఒప్పిస్తానని, ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారం చేపట్టగానే తిరుపతి రాజధానిగా ప్రకటించేలా చూస్తానని ధీమా వ్యక్తం చేసారు.

కాగా ప్రస్తుత ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితా ప్రకటించే దశలో ఢిల్లీ చేరుకున్న చింతా మోహన్ పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని మీడియా సమావేశంలో ప్రకటించి చేతులు దులుపుకున్నారు. ఎన్నికలు ముగిసిన తరువాత రెండురోజుల క్రితం రాష్ట్రంలో పార్టీ అభ్యర్థుల ఎంపిక విషయంలో లోపాలు చోటు చేసుకున్నాయని రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు షర్మిలపై విమర్శలు చేసారు. దానిపై జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకులు ఆయన మాటలను తప్పుపట్టారు. ఇదిలా ఉండగా ఈరోజు ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో.. మళ్ళీ తిరుపతిని రాజధాని చేయాలనే డిమాండ్ చేసారు.

మళ్ళీ మాట మార్చడం గురించి అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ పార్టీ నిర్ణయం ఏదైనా ప్రజాస్వామ్యం లో వ్యక్తిగత అభిప్రాయాలు ఉంటాయని, పార్టీ పెద్దలను ఒప్పిస్తానని చెప్పారు. అన్నింటినీ మించి నెలరోజుల క్రితం వరకు కాంగ్రెస్ పార్టీ 130 సీట్లతో అధికారంలోకి వస్తుందని చెప్పిన చింతా మోహన్ ఎన్నికలు ముగిశాక తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి అధికారం ఖాయమని చెప్పడం మొదలుపెట్టారు. ఈ పరిణామాలు చూసినప్పుడు 1985లో తొలిసారిగా తాను ఎంపీగా గెలవడానికి కారణమైన తెలుగుదేశం పార్టీ వైపు దాదాపు 40ఏళ్ల తరువాత అడుగులు వేస్తారేమోన‌నే అనుమానాలు పలువురిలో వ్యక్తమ‌వుతున్నాయి. ఆయన సన్నిహితులు మాత్రం ఖండిస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement