Sunday, April 28, 2024

Breaking: న‌ల్లారికి ఢిల్లీ నుంచి పిలుపు.. అస్త్రస‌న్యాసం చేసిన వ్య‌క్తికి ఏపీ కాంగ్రెస్​ ప‌గ్గాలు?

ఉమ్మ‌డి ఏపీలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత‌గా, ముఖ్య‌మంత్రిగా ఉన్న న‌ల్లారి కిర‌ణ్‌కుమార్‌రెడ్డికి ఢిల్లీ నుంచి పిలుపొచ్చింది. ఏపీ, తెలంగాణ విడిపోయిన సంద‌ర్భంలో సొంత పార్టీ పెట్టి ఎన్నిక‌ల బ‌రిలో దిగిన కిర‌ణ్‌రెడ్డి చాలా కాలంగా రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటున్నారు. సొంత పనుల్లో బిజీ అయిన ఆయ‌న ఎవ‌రైనా పొలిటిక‌ల్ లీడ‌ర్లు ప‌ల‌క‌రిస్తే మిన‌హా ఎవ‌రికీ ట‌చ్‌లో కూడా రావ‌డం లేదు. మార్నింగ్ వాక్ టైమ్‌లో కేబీఆర్ పార్క్ వ‌ద్ద ప‌లుమార్లు ఆయ‌న‌ను ప‌ల‌క‌రించేందుకు చాలా మంది లీడ‌ర్లు ట్రైచేసినా సో సోగా మాట్లాడుతూ త‌న ప‌నులేవే త‌ను చూసుకుంటున్నారు.

కంప్లీట్‌గా రాజ‌కీయ స‌న్యాసం స్వీక‌రించిన‌ట్టున్న న‌ల్లారికి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ హైక‌మాండ్ నుంచి పిలుపు రావ‌డంతో అంత‌టా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఒక్క‌సారిగా రాజ‌కీయ వ‌ర్గాల్లోనూ ఈ విష‌య‌మే చ‌ర్చ‌కు వ‌స్తోంది. కాంగ్రెస్ పార్టీ ఏం నిర్ణ‌యం తీసుకోబోతోంది అనే అంశంపై ప‌లు విధాలుగా చ‌ర్చించుకుంటున్నారు. అయితే.. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాలని కిరణ్ కుమార్ రెడ్డిని కాంగ్రెస్ హై క‌మాండ్ కోరుతున్న‌ట్టు ప్రాథ‌మికంగా స‌మాచారం అందుతోంది. నిన్న‌టిదాకా చింత‌న్ శిబిర్ పేరిట పార్టీలో జోష్ తెచ్చే కార్య‌క్ర‌మాల‌పై చ‌ర్చించిన కాంగ్రెస్ అధినాయ‌క‌త్వం.. ప‌లు రాష్ట్రాల్లో స్త‌బ్ధుగా ఉన్న లీడ‌ర్ల‌పై ఫోక‌స్ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. దానిలో భాగంగానే న‌ల్లారి కిరణ్‌కుమార్ రెడ్డిని పిలిచిన‌ట్టు స‌మాచారం. కాగా, రేపు (మంగ‌ళ‌వారం) కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ముఖ్య‌నేత రాహుల్ గాంధీతో కిర‌ణ్‌రెడ్డి భేటీ అయ్యే అవకాశాలున్నట్టు ఆ పార్టీ వ‌ర్గాల ద్వారా తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement