Monday, April 29, 2024

AP: బడ్జెట్లను స్తంభింప చేస్తే ప్రత్యేక హోదా వస్తుంది… జేడీ లక్ష్మీనారాయణ

శ్రీకాకుళం బ్యూరో, జనవరి 31(ప్రభ న్యూస్): కేంద్రంలో ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు బడ్జెట్ సమావేశాలకు సంబంధించి బడ్జెట్‌ను ఆమోదింప చేయకుండా స్తంభింప చేసేందుకు రాష్ట్రంలోని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం గట్టిగా కృషి చేస్తే కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ కు ఇస్తుందని ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు జేడీ లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శి చలసాని శ్రీనివాసరావు అన్నారు. బుధవారం స్థానిక హోటల్లో నిర్వహించిన మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో తెలుగుదేశం ప్రభుత్వం బిజెపితో పొత్తు పెట్టుకుని పాలన సాగించిందని, అయితే అప్పట్లో ప్రత్యేక హోదా ఇవ్వకుండా ప్రత్యేక ప్యాకేజీ కేంద్రం ప్రకటించిందని, దానికి టిడిపి అంగీకరించిందని తెలిపారు.

అయితే తర్వాత ఆ ప్యాకేజీ కూడా సక్రమంగా కేంద్రం ఇవ్వకపోవడంతో చివరికి కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంతో టీడీపీ తెగ తెంపులు చేసుకొని ధర్మపోరాటాలు చేసిందని, అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్న వైసిపి, తెలుగు తెలుగుదేశం పార్టీలు కూడా అవిశ్వాస తీర్మానం పార్లమెంటు లో ప్రవేశ పెట్టడం జరిగిందని తెలిపారు. అది ఈగిపోతుందని తెలిసినప్పటికీ ఆమెరకు ఈ రెండు పార్టీలు కేంద్రానికి వ్యతిరేకంగా పోరాడుతున్నట్లుగా చెప్పుకొచ్చాయని తెలిపారు. 2019 ఎన్నికల సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమ పార్టీకి 25 ఎంపీ స్థానాలు వస్తే కచ్చితంగా కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తామని చెప్పారని, ఆమెర కు 22 మంది వైసిపి అభ్యర్థులను రాష్ట్ర ప్రజలు గెలిపించారని, కానీ అధికారం చేపట్టిన తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వానికి పూర్తిస్థాయి మెజార్టీ వచ్చినందువల్ల ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై తాను ఒత్తిడి తీసుకురాలేనని, ఢిల్లీ వెళ్ళినప్పుడు ఈ అంశంపై వినతిపత్రం మాత్రం అందిస్తామనిని చెప్పుకు రావడం గమనార్హమని ఆయన అన్నారు. 2019 ఎన్నికల తర్వాత 2021లో రాష్ట్రపతి ఎన్నికల సమయంలోనూ, ఉపరాష్ట్రపతి ఎన్నిక సమయంలోను, ఢిల్లీలో సివిల్ ఉద్యోగుల నియామకం బిల్లు సమయంలోను కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అడగకపోయనా వైసిపి టిడిపిలు మద్దతు తెలిపాయని ఇది ప్రజలు గుర్తించాలన్నారు. రాష్ట్రపతి ఎన్నిక సమయంలో ఈ రెండు పార్టీలు మద్దతు తెలియచేయకపోతే కనీసం అప్పుడైనా కేంద్రం ప్రత్యేక హోదా ఇచ్చేందుకు అంగీకరించేదని ఆయన అన్నారు.

ఇప్పటికైనా అధికార వైసిపి ప్రభుత్వం పెద్దలు ముఖ్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అదే విధంగా ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని ఇతర పార్టీలన్నిటితోని కలిపి ఢిల్లీ వెళ్లి అక్కడ ఇతర ప్రతిపక్ష పార్టీల అందరితోనూ ప్రత్యేక హోదా అంశంపై మాట్లాడి హోదా ఇస్తామంటేనే బడ్జెట్ ఆమోదింప చేస్తామని, లేని పక్షంలో బడ్జెట్‌ను స్తంభింప చేస్తామని తెలియజేస్తే కేంద్ర ప్రభుత్వం ఆ మేరకు స్పందించేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. కేంద్ర బడ్జెట్ ఆమోదం పొందకపోతే కేంద్ర ప్రభుత్వం రాజీనామా చేయవలసి వస్తుందని, అందువల్ల తప్పనిసరిగా బడ్జెట్ ను స్తంభింప చేసే విధంగా రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్ష పార్టీలు కృషి చేయాలని ఆయన కోరారు. తాము కూడా ఫిబ్రవరి 7, 8 తేదీల్లో ఢిల్లీ వెళ్లి అక్కడ అన్ని ప్రతిపక్ష పార్టీల నాయకులతో ప్రత్యేక హోదాకు సంబంధించిన విషయం పై తెలియజేసి, జంతర్ మంతర్ వద్ద అవసరమైతే నిరసన కార్యక్రమాలు కూడా చేపడతామని ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం విభజన హామీలకు సంబంధించి ఇంతవరకు కేవలం 10 శాతం మాత్రమే అమలు చేసిందని, ఇంకా 90శాతం హామీలు అమలు కావాల్సిఉందని,వాటిని సాధించుకోవడానికి ఈ బడ్జెట్ సమావేశాలే మంచి అవకాశం అని ఆయన అన్నారు. ఈ సమావేశంలో సిపిఎం పార్టీ నాయకులు గోవిందరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement