Monday, May 6, 2024

ఆన్‌లైన్‌ టిక్కెట్లకు బ్రేక్‌.. 27న తుది విచారణ జరుపుతామన్న హైకోర్టు

అమరావతి, ఆంధ్రప్రభ: ఆన్‌లైన్‌ టిక్కెట్ల వివాదానికి హైకోర్టు తాత్కాలికంగా బ్రేక్‌ వేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఏపీ ఫిలిం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీఎఫ్‌డీసీ) పోర్టల్‌ అనుసంధానంతో టిక్కెట్ల విక్రయంతో పాటు రెండు శాతం సర్వీస్‌ చార్జీలు చెల్లించాలంటూ ప్రభుత్వం విధించిన గడువు శనివారంతో ముగియనుంది. ఈనేపథ్యంలో హైకోర్టు ప్రభుత్వం తీసుకొచ్చిన చట్ట సవరణ నిబంధనతో పాటు అందులో భాగంగా జారీచేసిన జీవోలను నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వ విధానాలను సవాల్‌ చేస్తూ బుక్‌ మై షో, మల్టిప్లక్స్‌ థియేటర్ల యాజమాన్యాలు, విజయవాడ ఎగ్జిబిటర్స్‌ అసోసియేషన్లు వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన సంగతి విదితమే. ఈ వ్యాజ్యాలపై గత రెండురోజులుగా వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం శుక్రవారం తన నిర్ణయాన్ని ప్రకటించింది. వ్యాజ్యాలపై విచారణ జరిపిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, న్యాయ మూర్తి జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులుతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం నిర్ణయించిన గడువులోగా రిజిస్ట్రేషన్‌ చేసుకోని మల్టిప్లక్స్‌ థియేటర్ల లైసెన్స్‌లు రద్దయ్యే ప్రమాదం ఉన్నందున తాత్కాలిక స్టే విధిస్తున్నట్లు స్పష్టం చేసింది.

ఆన్‌లైన్‌ విధానాన్ని కొంతకాలం వాయిదా వేయటం వల్ల ప్రభుత్వానికి కానీ ప్రేక్షకులకు కానీ ఎలాంటి నష్టం కలగదని తేల్చి చెప్పింది. ప్రభుత్వ ఉత్తర్వులను నిలుపుదల చేయకపోతే థియేటర్లకు తీరని నష్టం జరుగుతుందని ప్రస్తుత ఒప్పందాలన్నీ గందరగోళ మవుతాయని వ్యాఖ్యానించింది. ఈ నిలుపుదల తాత్కాలికమైందేనని చెప్తూ మరింత లోతుగా దీనిపై విచారణ జరపాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. ప్రస్తుత దశలో స్పందించకపోతే మల్టిప్లక్స్‌, బుక్‌ మై షో వంటి సంస్థలకు కోలుకోలేని దెబ్బ తగులుతుందనే ప్రాథమిక నిర్థారణకు వచ్చి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తున్నట్లు స్పష్టం చేసింది. ప్రభుత్వం, థియేటర్ల యాజమాన్యాలకు వాటిల్లే నష్టాన్ని సమతూకంతో చూస్తే థియేటర్లకే ఎక్కువ నష్టం జరుగుతుందని తేల్చి చెప్పింది. సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లు కూడా గడ్డు పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందని వివరించింది. ఈ వ్యాజ్యాలపై పూర్తి స్థాయిలో ఈనెల 27న విచారణ జరుపుతామని స్పష్టం చేసింది. ఇందులో అనేక అంశాలు నిబిడీకృతమై ఉన్నందునే ప్రభుత్వ నిర్ణయాన్ని నియంత్రిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తున్నట్లు ప్రకటించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement