Wednesday, May 1, 2024

AP | ఈ-ఆఫీస్‌కు బ్రేక్‌, సర్వర్‌ సాప్టువేర్‌ అప్‌గ్రేడ్‌.. కలిసొచ్చిన సెలవులు

అమరావతి, ఆంధ్రప్రభ : ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ- ఆఫీస్‌కు ఆన్‌లైన్‌ వ్యవస్థకు బ్రేక్‌ పడింది. రాష్ట్రస్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ఈ- ఆఫీస్‌ ఒకే సర్వర్‌పై పనిచేస్తోంది. కాగా సర్వర్‌ సాఫ్ట్‌వేర్‌ అప్‌గ్రేడ్‌ కారణంగా శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు షట్‌డౌన్‌ చేయాలని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని నేషనల్‌ ఇన్‌ఫర్మాటిక్‌ సెంటర్‌ (ఎన్‌ఐసీ) సూచనలిచ్చింది. దీంతో శుక్రవారం మధ్యాహ్నం నుంచే అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఆన్‌లైన్‌ వ్యవస్థను షట్‌డౌన్‌ చేశారు. ముఖ్యమంత్రి విదేశీ పర్యటన.. రెండు రోజులు సెలవు కావటంతో అత్యవసర ఫైళ్లు మినహా అంతగా లావాదేవీలు జరిగే అవకాశం లేదు.

శని, ఆది వారాలు హెచ్‌ఓడీలకు, రెండో శనివారం కారణంగా ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు వరుసగా రెండురోజుల సెలవులు కలసిరావటంతో సాఫ్ట్‌ వేర్‌ అప్‌గ్రెడేషన్‌కు అనువుగా ఉంటుందని భావిస్తున్నారు. కాగితరహిత ప్రభుత్వ కార్యకలాపాల్లో భాగంగా 2016 జూలైలో రాష్ట్రంలో ఈ ఆఫీస్‌కు అంకురార్పణ జరిగింది. దేశం మొత్తంగా ఈ ఆఫీస్‌ ప్రక్రియ ఎన్‌ఐసీ కనుసన్నల్లో జరుగుతుంది. తొలుత 13 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా రెండు లక్షల పై చిలుకు ఫౖౖెళ్లను డిజిటలైజ్‌ చేసి ఆన్‌లైన్‌ ప్రక్రియను ప్రారంభించారు. ఇదిలా ఉండగా ప్రతి ఐదేళ్ల కోసారి సాఫ్ట్‌ వేర్‌ అప్‌గ్రేడ్‌ చేయటం ద్వారా ఆన్‌లైన్‌ సేవల విస్తరిస్తున్నాయి.. రాష్ట్రంలో రెండేళ్ల క్రితమే సాఫ్ట్‌వేర్‌ను అప్‌గ్రేడ్‌ చేయాల్సి ఉంది.

అయితే కరోనా కారణంగా అప్పట్లో నిలిచిపోయింది. ప్రస్తుతం ప్రభుత్వ కార్యాలయాల్లో 5.6 వెర్షన్‌ సాఫ్ట్‌ వేర్‌ వినియోగంలో ఉంది. ప్రస్తుతం కేరళతో సహా కొన్ని ఇతర రాష్ట్రాల్లో 7.0 వెర్షన్‌తో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేశారు. ప్రస్తుతం కొన్ని కేంద్ర మంత్రిత్వశాఖలు కూడా ఇదే వెర్షన్‌ను అప్‌లోడ్‌ చేస్తున్నాయి. అయితే మన రాష్ట్రంలో రెండు దశలుగా అప్‌గ్రేడ్‌ చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం 6.0 వెర్షన్‌ను అందుబాటులోకి తెచ్చి తరువాత పరిస్థితులు అనుకూలించినప్పుడు పూర్తి స్థాయిలో 7.0కు పెంచే విధంగా ఉన్నతాధికారులు కార్యాచరణ రూపొందించుకున్నారు. ఈ రెండు రోజులు ఆర్థిక పరమైన లావాదేవీలకు విఘాతం కలగదని అధికారులు చెబుతున్నారు.

ఫైనాన్స్‌ విభాగం చెల్లింపులు కాంప్రెహెన్సివ్‌ ఫైనాన్స్‌ మేనేజిమెంట్‌ సిస్టం (సీఎఫ్‌ఎంఎస్‌) పోర్టల్‌ కింద జరుగుతుంటాయి కనుక ఆర్థిక అంశాలకు అంతరాయం ఉండదు. ప్రభుత్వ విభాగాల్లో హెచ్‌ఓడీల పర్యవేక్షణలో ఈ- ఆఫీస్‌ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే గత కొద్దిరోజుల క్రితం ముఖ్యమంత్రి కార్యాలయంలో డిజిటల్‌ కీ టాంపరింగ్‌ వ్యవహారం వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో మరింత భద్రతా ప్రమాణాలతో ఈ ఆఫీస్‌ను కట్టుదిట్టం చేయనున్నారు. ఈ రెండు రోజుల్లో సాఫ్ట్‌ వేర్‌ ప్రక్రియ పూర్తయితే సోమవారం నుంచి రాష్ట్ర సచివాలయంలో 6.0 వెర్షన్‌ అందుబాటులోకి వస్తుందని అధికారులు తెలిపారు. సాఫ్ట్‌ వేర్‌ అప్‌గ్రేడ్‌ సందర్భంగా ప్రస్తుతం నిక్షిప్తమైన డేటాకు అంతరాయం ఉండదని ఐటీ శాఖ ఉన్నతాధికారి ఒకరు వివరించారు. రాష్ట్ర కేబినెట్‌ సమావేశాల అజెండాతో సహా ఆన్‌లైన్‌లో ఉంచుతున్నారు.

కాగా ప్రస్తుతం అప్‌గ్రేడ్‌ చేస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కార్యాలయం, హెచ్‌ఓడీ కార్యాలయాల పరిధిలోని కీలక ఫైళ్లను భద్రం చేశారు. అయితే ఈ రెండు రోజులు రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ స్థాయి వరకు ఈ- ఆఫీస్‌ ఫైళ్లను తెరవరాదని ఎన్‌ఐసీ స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వ కార్యాలయాలకు ఐటీ శాఖ సర్క్యులర్లు జారీ చేసింది. దైనందిన ప్రభుత్వ కార్యక్రమాలతో బిజీగా ఉన్న అధికారులు సెలవు రోజుల్లో ఇళ్ల వద్ద నుంచే ఈ ఫైళ్లను ఆమోదిస్తారు. అందుకు ఈ రెండు రోజులు బ్రేక్‌ పడనుంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ సేవలకు అంతరాయం కలగనుంది. సర్వర్‌ వెర్షన్‌ పెంచడం ద్వారా పౌరులకు మరిన్ని సేవలు అందించటంతో పాటు పారదర్శకంగా ఉండేలా జాగ్రత్తలు పాటించాల నేదే లక్ష్యమని అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement