Monday, April 29, 2024

Big Story – సైకిల్ దూకుడుకి కేంద్ర బ్రేకులు..?

అమరావతి, ఆంధ్రప్రభ బ్యూరో: వచ్చే ఎన్నికల్లో మిత్రపక్షాలుగా కలిసి బరిలోకి దిగాలని భావిస్తోన్న బీజేపీ, తెలుగుదేశం పార్టీల మధ్య ఈ వ్యవహారం మరింత బెడిసి కొట్టిందా..? ప్రధానమంత్రి నరేంద్రమోడీ, తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుల మధ్య దూరం మరింత పెరిగిందా..? అంటే అవుననే సమాధానం ఇరుపార్టీ ముఖ్య నేతల నుంచి వినిపిస్తోంది. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఉన్న చంద్రబాబుకు ఢిల్లి పెద్దల నుంచి కనీస మద్దతు కూడా లభించకపోవడం, ఆ దిశగా కేంద్ర పెద్దలు మౌనంగా ఉండడాన్ని బట్టి చూస్తుంటే పొత్తుల చర్చల్లోనే ఈ వ్యవహారం బెడిసినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరుగనున్న సాధారణ ఎన్నికల్లో బీజేపీకి టీడీపీ
సహకారం అవసరముంది. ఇదే అంశంపై గతంలో చంద్రబాబు, అమిత్‌ షాతో భేటీ అయిన సందర్భంలో కూడా తెలంగాణలో బీజేపీకి మద్దతివ్వాలనే అంశంపైనే చర్చ జరిగినట్లు చెబుతున్నారు. అయితే చంద్రబాబు ఏపీలో జరిగే ఎన్నికల్లో మాత్రమే కలిసి పోటీ చేద్దామని, తెలంగాణ అంశంలో ఇప్పట్లో ఏ నిర్ణయం తీసుకోలేనని ఖరాఖండిగా బాబు చెప్పినట్లు అప్పట్లోనే రాజకీయ వర్గాల్లో చర్చ నడిచింది. ఈ నేపధ్యంలోనే ఏపీలో జరుగుతున్న రాజకీయ సంఘటనలపై ఢిల్లి బీజేపీ పెద్దలు మౌనంగా ఉండడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికే పూర్తి సహకారాన్ని అందించే దిశగా అడుగులు వేస్తున్నారు.

రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా వచ్చే ఎన్నికల్లో తిరిగి అధికారాన్ని సొంతం చేసుకోవాలని పావులు కదుపుతున్న టీడీపీని మరింత వీక్‌ చేసి.. తమ మిత్రపక్షమైన జనసేనకు పరోక్షంగా అనుకూల వాతావరణాన్ని కల్పించే దిశగా బీజేపీ పావులు కదుపుతోందన్న సందేహాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ బీజేపీతో పాటు తెలుగుదేశం పార్టీని కూడా కలుపుకుని వచ్చే ఎన్నికల్లో బలమైన కూటమిగా ఏర్పడి వైసీపీని ఓడించాలని పట్టుదలతో ఉన్నారు. ఆ దిశగానే ఇటీవల ఢిల్లి పెద్దలతో భేటీ అయిన సందర్భంలోనూ తెలుగుదేశంతో కలిసే ఎన్నికలకు వెళ్లాలని ఆ దిశగా వారిని ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అందుకు బీజేపీ పెద్దలు సానుకూలంగా స్పందించనప్పటికీ ఎలాగైనా వారిని ఒప్పించి సైకిల్‌పై బీజేపీ, జనసేన కలిసి ప్రయాణం చేయాలని పవన్‌ పట్టుదలతో ఉన్నారు. ఈ నేపధ్యంలోనే టీడీపీతో కలిసి ప్రయాణం చేయడం కంటే రాష్ట్రంలో గత ఎన్నికలతో పోలిస్తే 12 శాతం పైగా ఓటు బ్యాంకును పెంచుకున్న జనసేనకు మరింత ప్రయోజనం చేకూర్చేలా వ్యవహరిస్తే రానున్న రోజుల్లో ఏపీలో కూడా జనసేన, బీజేపీ కూటములతో కలిసి కీలక పాత్ర పోషించవచ్చని కమలనాధులు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. రాజకీయ విశ్లేషకుల్లో కూడా ఇదే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

తెలంగాణలో 38 నియోజకవర్గాలకు పైగా బలమైన ఓటు బ్యాంకును సొంతం చేసుకున్న తెలుగుదేశం గత కొంతకాలంగా ఆ రాష్ట్రంలో ఆశించిన స్థాయిలో తమ కార్యకలాపాలను వేగవంతంగా చేపట్టలేకపోతోంది. ఈ నేపధ్యంలోనే తెలుగుదేశం మద్దతిస్తే బీజేపీ తెలంగాణలో అధికారాన్ని సొంతం చేసుకునే అవకాశం ఉందని ఆ పార్టీ ఢిల్లి నేతలు భావిస్తూ వస్తున్నారు. అందుకోసం చంద్రబాబు మద్దతు కోరారు. అందుకు ఆ పార్టీ ముఖ్య నేతలతో పాటు చంద్రబాబు కూడా సానుకూలంగా స్పందించలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement