Sunday, April 28, 2024

AP: రేప‌టి నుంచి భ‌వానీ దీక్ష‌ల విర‌మ‌ణ‌.. ఇంద్ర‌కీలాద్రీపై భారీ ఏర్పాట్లు ..

విజ‌య‌వాడ – విజయవాడ అమ్మ భవానీ దీక్షా విరమణలు రేప‌టి నుంచి జరుగనున్నాయి. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం నలుమూలల నుంచి, తెలంగాణ, కర్ణాటక, ఒరిస్సాల నుంచి భారీ సంఖ్య‌లో భవానీలు వస్తారని అంచనా వేస్తున్నారు అధికారులు. దీంతో అధికారులు ఇంద్ర‌కీలాద్రిపై భారీ ఏర్పాట్లు పూర్తి చేశారు.. ఈ మేరకు మూడు క్యూలైన్లు ఏర్పాటు చేశారు విజయవాడ దుర్గగుడి అధికారులు. దీక్షా విరమణలకు హోమగుండాలను ఏర్పాటు చేశారు. రేపు ఉదయం 6:30 గంటల నుంచీ భవానీ దీక్షా విరమణలు ప్రారంభమవుతాయి. పున్నమి, కృష్ణవేణి, సీతమ్మ పటదాలు ఘాట్లలో జల్లు స్నానాలకు ఏర్పాట్లు చేశారు అధికారులు. కేశఖండన శాల, క్లోక్ రూంలను సిద్ధం చేశారు. ప్రతి అరగంటకు ఉచిత బస్సు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

పారిశుధ్యం, భవానీల వస్త్రాల సేకరణ కోసం ఘాట్ ల వద్ద ప్రత్యేక ఏర్పాటు చేశారు. భవానీలకు అమ్మవారి కుంకుమ, అన్నప్రసాదం అందించనున్నారు విజయవాడ దుర్గగుడి అధికారులు, పాలకమండలి. మెడికల్ క్యాంపులను వినాయకుడి గుడి వద్ద నుంచీ, మెట్ల మార్గం వైపు, గిరిప్రదక్షిణ చేసే దగ్గర ఏర్పాటు చేశారు. క్యూలైన్లలో, గిరిప్రదక్షిణ మార్గంలో మజ్జిగ, పాలు, నీళ్ళు అందించనున్నారు విజయవాడ అమ్మవారి గుడి అధికారులు. మాల ధార‌ణ విర‌మ‌ణ చేసే భ‌క్తుల‌కు ఎటువంటి అసౌక‌ర్యం క‌లుగ‌కుండా అన్నిఏర్పాట్లు చేసిన‌ట్లు క‌న‌క‌దుర్గ‌మ్మ ఆల‌య క‌మిటీ ఛైర్మ‌న్ క‌ర్నాటి రాంబాబు, ఈవో రామారావు లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement