Monday, May 27, 2024

Vijayawada: నేటి నుంచి ఇంద్రకీలాద్రిలో భవాని దీక్ష విరమణలు.. భారీగా ట్రాఫిక్‌ ఆంక్షలు

ఇవాళ్టి నుంచి ఇంద్రకీలాద్రిలో 5 రోజులపాటు భవాని దీక్ష విరమణలు జరగనున్నాయి. ఉదయం ఆలయ అర్చకులు అగ్ని ప్రతిష్టాపన చేశారు. రేపు శత చండీయాగము నిర్వహణ, గిరి ప్రదక్షణ, భవాని దీక్ష విరమణలు ఉంటాయి. గురు భవానీల చేత ఇరుముడులను సమర్పించేందుకు ఆలయ అధికారులు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు.

నాలుగు హోమ గుండాలలో నేతి టెంకాయలను వేసే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 7వ తేదీన మహా పూర్ణాహుతితో భవాని దీక్షలు పరిసమాప్తం అవుతాయి. ఈ క్రమంలో ఆలయ పరిసర ప్రాంతాల్లో పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. బందోబస్తును (లా & ఆర్డర్ -26, ట్రాఫిక్ -08) మొత్తం 34 సెక్టార్లుగా విభజించారు. వివిధ జిల్లాలు, ఎన్టీఆర్‌ కమీషనరేట్ నుంచి మొత్తం 4200 మంది పోలీసులు విధుల్లో ఉంటారు. దర్శనానికి వచ్చే వారికి తెల్లవారు ఝామున 3.00 గంటల నుంచి రాత్రి 11.00 గంటల వరకు దర్శనం కల్పించనున్నారు. భవాని దీక్షా విరమణలు సందర్భముగా నగరంలో ట్రాఫిక్ మళ్లింపులు ఉండనున్నాయి.

ఈ సందర్భంగా నేటి నుంచి 7 వ తేదీ వరకు ట్రాఫిక్ మళ్ళింపులు కొనసాగనున్నాయి. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం, విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వైపుకు భారీ, మద్యతరహా రవాణా వాహనాల రాకపోకల మళ్లింపులు ఉంటాయి. ఇబ్రహీంపట్నం నుంచి జి కొండూరు – మైలవరం- నూజివీడు -హనుమాన్ జంక్షన్ వైపుకు వాహనాలు మళ్ళిస్తారు. విశాఖపట్నం నుండి చెన్నై, చెన్నై నుంచి విశాఖపట్నం వైపుకు భారీ, మద్యతరహా రవాణా వాహనాలను హనుమాన్ జంక్షన్ బైపాస్ మీదుగా గుడివాడ – పామర్రు – అవనిగడ్డ – రేపల్లె- బాపట్ల – చీరాల – త్రోవగుంట – ఒంగోలు జిల్లా మీదుగా మళ్ళిస్తారు. అలాగే గుంటూరు, చెన్నై రహదారి మీదుగా కూడా మళ్లింపులు ఉండనున్నాయి. ప్రయాణికులు ఈ మేరకు సూచనుల పాటించాలని అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement