Friday, May 17, 2024

జూన్‌ నెలాఖరులోగా బెజవాడ కోర్టు భవనాలు..

విజయవాడలో బహుళ అంతస్థుల కోర్టు భవన సముదాయ పనులను ఈ ఏడాది జూన్‌ నెలాఖరులోగా పూర్తి చేయనున్నట్లు రోడ్లు భవనాలశాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు హైకోర్టుకు వివరణ ఇచ్చారు. ఈ మేరకు నిర్మాణ సంస్థ నుంచి లిఖిత పూర్వక హామీ తీసుకున్నామని, పనుల్లో పురోగతికి సంబంధించిన అఫిడవిట్‌ను దాఖలు చేశారు. నిర్మాణాలు, కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బకాయిలు, 8వ అంతస్తు అనుమతులకు సంబంధించి పూర్తి వివరాలను తమ ముందుంచాలని ధర్మాసనం ఆదేశించింది. కోర్టు భవన నిర్మాణంలో మితిమీరిన జాప్యం జరుగుతోందని న్యాయవాది చేకూరి శ్రీనివాసరావు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ చాగరి ప్రవీణ్‌ కుమార్‌, జస్టిస్‌ కె మన్మధరావులతో కూడిన ధర్మాసనం మంగళవారం మరోసారి విచారణ జరిపింది.

పిటిషనర్‌ తరుపు న్యాయవాది గంటా రామారావు వాదనలు వినిపిం చారు. ప్రభుత్వం కాంట్రాక్ట్‌ సంస్థకు బకాయిల చెల్లింపులో జార్యం చేస్తున్నందునే పను లు నత్తనడకన సాగటానికి కారణమన్నారు. ఇప్పటి వరకు రూ. 5కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి ఉందని 8వ అంతస్తుకు పాలనాపరమైన అనుమతులు ఇంకా మంజూరు కాలేదని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ప్రభుత్వం తరుపున న్యాయవాది కూనపల్లి నర్సిరెడ్డి వాదిస్తూ దీనిపై పూర్తి వివరాలతో అఫిడవిట్‌ దాఖలు చేశామన్నారు. ఒక్కబిల్లు మినహా మిగిలినవి చెల్లించామనగా ధర్మాసనం స్పందిస్తూ ఆ బిల్లును ఎప్పటి లోగా చెల్లిస్తారని ప్రశ్నించగా ఈనెల 15వ తేదీలోగా చెల్లిస్తామని నర్సిరెడ్డి బదులిచ్చారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement