Wednesday, May 1, 2024

Ayush Hospitals – “రోగులు రండి…రండి.. ఉచితంగా వైద్యం చేస్తాం”

అమరావతి, ఆంధ్రప్రభ: ఆయుర్వేద ఆసుపత్రులకు రోగులు కావలెను. వినడానికి కొంచెం విచిత్రంగా అనిపించినా ఇది నిజం. ఒక్కో డిస్పెన్సరీలో కనీసం 50 మంది రోగులైనా రాకుంటే సంబంధిత డాక్టర్‌ను ట్రాన్స్‌ఫర్‌ చేస్తానంటూ ఆయుష్‌ కమిషనర్‌ వార్నింగ్‌ ఇచ్చారు. రోగులు వచ్చినా, రాకున్నా ఇన్నాళ్ళ వచ్చామా.. వెళ్ళామా అన్న చందంగా ఉద్యోగాలు చేసిన డాక్టర్లు ఇప్పుడు రోగులు రాకుంటే స్థానచలనం తప్పదన్న భయం పట్టుకుంది. రాష్ట్రంలో మొత్తం 580 ఆయుర్వేద ఆసుపత్రులు పనిచేస్తున్నాయి. ఇందులో సుమారు 2 వేల మంది సిబ్బంది పనిచేయాల్సి ఉండగా వివిధ కారణాల వల్ల 1,100 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. దీంతో ఒక్కో డాక్టర్‌ రెండు మూడు డిస్పెన్సరీల బాధ్యతల్ని చూడాల్సిన పరిస్థితి. సాధారణంగా ఆయుర్వేద ఆసుపత్రులకు వచ్చే రోగుల సంఖ్య బహు స్వల్పం కాబట్టి ఇన్నాళ్ళు ఏదో గడిచిపోయింది. ఆయుర్వేద వైద్యాన్ని ప్రజలకు మరింత చేరువ చేసే దిశగా ఆయుష్‌ డిపార్ట్‌ మెంట్‌ అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఆయుష్‌ కమిషనర్‌ రాజేంద్ర కుమార్‌ ఇటీవల ఆయుర్వేద వైద్యులతో విజయవాడలో సమావేశం నిర్వహించారు. ఆసుప్రతుల వారీగా ఓపీపై సమీక్ష నిర్వహించగా అత్యధికశాతం ఆసుపత్రులకు రోజుకు పది నుంచి 15 మంది రోగులు మాత్రమే వస్తుండటంపై ఆయన విస్మయం చెందారు. ప్రజలకు మెరుగైన ఆయుర్వేద వైద్యం అందించడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుంటే ఓపీ ఇంత దారుణంగా ఉందా అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఓపీ కనీసం 50 లేకుంటే సంబంధిత డిస్సెన్సరీ డాక్టర్‌పై బదిలీ వేటు తప్పదంటూ హెచ్చరికలు జారీ చేశారు. దీంతో వైద్యుల్లో కలకలం బయలు దేరింది. ఏళ్ళ తరబడి అరకొరగా వస్తున్న రోగుల సంఖ్యను ఇప్పుడు హఠాత్తుగా ఎలా పెంచాలన్న బెంగ పట్టుకుంది.

ఇలా పెంచొచ్చు
ఆయుష్‌ కమిషనర్‌ ఆదేశాలపై సమవేశంలో వాడివేడి చర్చ సాగినట్లు అత్యంత విశ్వసనీయంగా తెలుస్తోంది. ఆయుర్వేద ఆసుపత్రులకు వచ్చే రోగుల సంఖ్య పెంచాలంటే దీనిపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని పలువురు వైద్యలు కమిషనర్‌ దృష్టికి తెచ్చారు. ఇందులో భాగంగా ఆశా వర్కర్ల ద్వారా ఇంటింటి ప్రచారం చేయిస్తే బావుంటుందని సూచించారు. గ్రామస్థాయిలో కూడా యోగా ట్రైనర్ల ద్వారా శిక్షణ ఇప్పించడం ద్వారా ఆయుర్వేద వైద్యం ఉపయోగాలను చాటి చెప్పవచ్చని పేర్కొన్నారు. ప్రస్తుతం డిస్పెన్సరీలో ఇస్తున్న మందుల బ్రాండ్‌లను మార్చినట్లైతే మరింత మెరుగైన ఫలితం ఉంటుందని కొందరు వైద్యులు కమిషనర్‌ దృష్టికి తెచ్చినట్లు తెలుస్తోంది. వివిధ జబ్బులతో ఆసుపత్రులకు వచ్చే రోగులకు ఇచ్చే లేపనాలు (ఆయిల్స్‌ ) కొరత ఉందని దీని వల్ల రోగుల సంఖ్య తగ్గుతోందన్న అభిప్రాయాలను పలువురు వ్యక్తం చేసినట్లు సమాచారం. దీనిపై స్పందించిన కమిషనర్‌ ఆసుపత్రుల్లో లేపనాల కొరత లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటి వరకు మందుల్ని పొట్లాలు కట్టి ఇస్తున్న పద్ధతిలోనూ మార్పులు తెస్తామని మందులు, ఆయిల్స్‌ మెరుగైన పద్ధతిలో ప్యాకింగ్‌ చేసి రోగులకు ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తామని కమిషనర్‌ చెప్పినట్లు తెలుస్తోంది.

ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో ఖాళీల భర్తీ
తలనొప్పి, కండరాలు, మోకీళ్ళ నొప్పులు , మానసిన ఒత్తిడి విటమిన్స్‌ లోపం అధిక బరువు వంటి సాధారణ సమస్యల్ని కూడా చాలామంది పెద్ద జబ్బులుగా భావిస్తుంటారు. ఆయుర్వేద వైద్యం ద్వారా చిన్న చిట్కాలతో సహజ పద్ధతుల ద్వారా ఈ నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఈ చికిత్సల కోసం చాలామంది కార్పొరేట్‌ ఆసుపత్రుల్ని ఆశ్రయించి రకరకాల వైద్య పరీక్షలు, మందుల కోసం ఎక్కవ మొత్తంలో ఖర్చు చేసి ఆర్థికంగా, ఆరోగ్య పరంగా ఇబ్బందులు పడుతుంటారు. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల నేపథ్యంలో పల్లె, పట్టణం అన్న తేడా లేకుండా ప్రజలు వివిధ వ్యాధుల బారిన పడుతున్నారు. ఉరుకుల పరుగుల జీవితంతో ఫాస్ట్‌ ఫుడ్స్‌కు అలవాటు పడి పౌష్టికాహార లోపాన్ని ‘కొని’ తెచ్చుకుంటున్నారు. నిత్యం యోగా చేయడం ద్వారా అధిక బరువును నియంత్రించడం తో పాటు సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చని ఆయుష్‌ డిపార్ట్‌ మెంట్‌ సూచిస్తోంది. ఆయుర్వేద వైద్యం పై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడంతో పాటు యోగాపౖౖె కూడా యువతలో అవగాహన కల్పించే దిశగా ఆయుష్‌ విభాగం దృష్టిసారించింది. ఇందులో భాగంగా యోగా శిక్షకుల సంఖ్యను పెంపుదల చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ఆయుర్వేద డిస్పెన్సరీల్లో సిబ్బంది కొరతను నివారించేందుకు గాను త్వరలోనే ఔట్‌ సోర్సింగ్‌ ద్వారా సిబ్బంది నియామకాలను చేపట్టనున్నట్లు తెలుస్తోంది. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఆయుర్వేద ఆసుపత్రుల ఆధునీకరణపై ప్రత్యేక దృష్టి సారించారు. ఎంపిక చేసిన ఆసుపత్రుల అభివృద్ధికి ఒక్కో ఆసుపత్రికి రూ.3.50 లక్షల చొప్పున విడుదల చేస్తున్నారు.

మరింత చేరువయ్యేలా
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక వైద్య ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. నాడు – నేడు పేరుతో ఆసుపత్రుల రూపురేఖల్ని మార్చింది. మున్నెన్నడూ లేని విధంగా 53 వేల కొత్త నియామకాలను చేపట్టింది. నిరంతర నియామకం ద్వారా వైద్యులు, సిబ్బంది ఖాళీ లకు సంబంధించి ఎప్పటికప్పుడు భర్తీ చేసే కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. వైఎస్‌ఆర్‌ హెల్త్‌ క్లీనిక్స్‌ను బలోపేతం చేయడంతో పాటు దేశంలోనే తొలిసారిగా ఫ్యామిలీ డాక్టర్‌ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. జననన్న ఆరోగ్య సురక్ష ద్వారా ఊరూరా వైద్య శిబిరాలు నిర్వహిస్తూ ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోంది. పూర్వ కాలం నుంచి అందరికీ అందుబాటులో ఉన్న ఆయుర్వేద వైద్యాన్ని ప్రజలకు మరింత చేరువ చేసే దిశగా ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగానే ఆయుర్వేద ఆసుపత్రుల పనితీరుపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement