Thursday, May 2, 2024

Avanigadda – నీరసం.. నిస్తేజం – ఇటు సిట్టింగ్ మార్పు

(అవనిగడ్డ, ప్రభన్యూస్) : అవనిగడ్డ నియోజకవర్గంలో రాజకీయం చాలా మర్మగర్భంగా.. గుమ్మనంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయం వేసవితోపాటు వేడెక్కుతున్నా ఈ నియోజకవర్గంలో మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా చడిచప్పుడు లేకుండా ఉంది. ఇటీవల నియోజకవర్గంలో బాబు షురిటీ.. భవిష్యత్‌ గ్యారింటీ పేరుతో తెలుగుదేశం కార్యక్రమం జోరుగా సాగింది. ఇంటింటికీ తిరిగి తెలుగుదేశం, జనసేనల మ్యానిఫెస్టోను వివరిస్తూ తెలుగుదేశం, జనసేన పార్టీల అధికారం చేపడితే ప్రజలకు అందించే సంక్షేమ పథకాలను వివరిస్తూ ఉమ్మడి పసుపు సేన కందం తొక్కింది. నెల రోజుల కిందట వరకు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం హోరెత్తింది.

శాసనసభ్యుడు సింహాద్రి రమేష్‌ బాబు ఇంటింటికి తిరిగి ప్రభుత్వం పేద ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌వెూహన్‌రెడ్డి మచిలీపట్నం పార్లమెంట్‌ అభ్యర్థిగా సింహాద్రి రమేష్‌బాబును, అవనిగడ్డ శాసనసభ్యుడిగా దివంగత మాజీ మంత్రి కుమారుడు క్యాన్సర్‌ వైద్య నిపుణులు డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్‌ రావు పేర్లను ప్రకటించారు. దీనిపై డాక్టర్ చంద్రశేఖర్‌ రెండు పర్యాయాలు అవనిగడ్డ వచ్చినప్పటికి పత్రికాముఖంగా ఏ విషయం తెలియచేయలేదు. సింహాద్రి రమేష్‌ బాబు సైతం ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో కూడా ఏ విధమైన రాజకీయ ప్రకటనలు చేయడం లేదు.

జనసేన, టీడీపీ పొత్తులో భాగంగా ఏ పార్టీ అభ్యర్థి పోటీలో ఉండేది కూడా ప్రకటించకపోవడంతో జనసేన తరుపునే అభ్యర్థిని ప్రకటిస్తారని పలువురు పేర్కోంటున్నప్పటికి జనసేన, టీడీపీ పార్టీల అధ్యక్షులు మాత్రం ఏ విధమైన ప్రకటన చేయలేదు. ఎవరి అభిమానం వారు చాటుకుంటూ తెలుగుదేశం పార్టీకే ఇస్తారని ఆ పార్టీ నేతలు, కాదు జనసేన పార్టీకే ఇస్తారని ఈ పార్టీ నేతలు చెప్పుకుంటూ ఉండగా, జనసేన పార్టీలో నాయకులు ఎక్కువ కావడంతో ఎవరికి వారే మా నాయకుడికే టికెట్‌ అంటూ చెప్పుకుంటున్నారు. దీనికి తోడు సోషల్‌ మీడియాలో ఎవరికి నచ్చినట్లుగా వారు పోస్ట్‌లు పెట్టుకుంటున్నారు. ఈ పరిస్థితిలో నియోజకవర్గంలో నామినేషన్‌ల ఘట్టం పూర్తి అయ్యే రోజున బీ ఫారం ఆ యా పార్టీల అధ్యక్షులు ఎవరికి ఇస్తే వారే అభ్యర్థులు అయ్యే సూచనలే కనిపిస్తున్నాయి కానీ, ముందుగా ఫలానా పార్టీ నుంచి ఫలానా అభ్యర్థి పోటీలో ఉంటారని చెప్పడం మాత్రం కష్ఠతరంగా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement