Thursday, April 18, 2024

Atmakuru bypoll: రేపే ఉప ఎన్నిక పోలింగ్​.. గెలుపు ధీమాతో వైసీపీ, గట్టి పోటీ ఇస్తామంటున్న బీజేపీ!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి జూన్ 23న జరగనున్న ఉప ఎన్నిక కేక్‌వాక్‌గా ఉంటుందని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ (వైఎస్‌ఆర్‌సిపి) భావిస్తోంది. అయితే బీజేపీ మాత్ర గట్టి పోటీ ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఉప ఎన్నికల ప్రచారం మంగళవారంతో ముగియగా జూన్ 26న కౌంటింగ్ జరగనుంది. 14 మంది అభ్యర్థులు బరిలో ఉన్నా, పోటీ మాత్రం వైఎస్సార్‌సీపీ, బీజేపీ మధ్యే ఉంటుందని పరిశీలకులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. తెలుగుదేశం పార్టీ (టిడిపి) ఉప ఎన్నిక పోటీకి దూరంగా ఉండి, బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో వైఎస్సార్‌సీపీ ఓట్‌షేర్‌ని దెబ్బతీసే ప్రమాదం ఉందని పొలిటికల్​ అనలిస్టులు అంటున్నారు.

ఈ ఏడాది ఫిబ్రవరిలో సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతి చెందడంతో ఆత్మకూరు అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఉప ఎన్నికలో గౌతమ్‌రెడ్డి తమ్ముడు, వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డి రాజకీయ అరంగేట్రం చేస్తున్నారు. విక్రమ్‌కి రాజకీయ అనుభవం లేకున్నా ‘సానుభూతి’ అంశం అనుకూలంగా పనిచేస్తుందని అధికార పార్టీ భావిస్తోంది. ఆత్మకూరులో మేకపాటి కుటుంబానికి అపారమైన ఆదరాభిమానాలు ఉన్నాయని ఆ పార్టీ నేతలు అంటున్నారు. నియోజకవర్గ అభివృద్ధికి గౌతమ్‌రెడ్డి విశేష కృషి చేశారని చెబుతున్నారు. 200 ఎకరాల్లో పారిశ్రామిక పార్కు ఏర్పాటు చేసి స్థానిక యువతకు వందలాది ఉద్యోగాలు కల్పించారని, ఆయన అకాల మరణం పట్ల ప్రజలు శోకసంద్రంలో ఉన్నారని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. లక్ష ఓట్లకు తగ్గకుండా మెజారిటీ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారని ఉప ఎన్నికలో పార్టీ తరపున ప్రచారం చేస్తున్న మంత్రి కారుమూరి అన్నారు.

ఇక.. నియోజకవర్గంలోని బలమైన సామాజిక వర్గాల్లో ఒకటైన యాదవ సామాజిక వర్గానికి చెందిన భరత్ కుమార్ గుండ్లపల్లిని బీజేపీ పోటీకి నిలబెట్టింది. ఆత్మకూరులో పార్టీకి గణనీయమైన పునాది ఉందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ‘‘ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అంటే అక్కడి ప్రజలకు కృతజ్ఞత ఉంది. ఆత్మకూరు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తిరోగమన పాలనకు అద్దం పడుతోంది. అభివృద్ధి లేమి స్పష్టంగా కనిపిస్తోంది. సరైన రోడ్లు, డ్రెయిన్లు లేకపోవడంతో ప్రజలు అల్లాడుతున్నారు. రైతులు పండిన పంటను గిట్టుబాటు ధరకు అమ్ముకోలేక అవస్థలు పడుతున్నారు’’ అని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌. విష్ణువర్ధన్‌ రెడ్డి విమర్శలు గుప్పిస్తున్నారు.

వైఎస్సార్‌సీపీ గెలుపుపై ​​అంత నమ్మకం ఉంటే ఆత్మకూరులో పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలు, మంత్రులను మోహరించడం ఏంటని  విష్ణువర్ధన్​రెడ్డి ప్రశ్నించారు. ఉప ఎన్నికలో గెలుపు కోసం అధికార పార్టీ అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తోందన్నారు. అయితే.. నెల్లూరు జిల్లాకు చెందిన వ్యవసాయ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి బీజేపీ ఆరోపణలను కొట్టిపారేశారు. సెక్యూరిటీ డిపాజిట్ కూడా పోతుందనే భయంతో బీజేపీ లీడర్లు తప్పుడు ప్రచారానికి దిగుతున్నారని అన్నారు. బీజేపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని, అయితే అత్యధిక మెజారిటీతో సీటును నిలబెట్టుకుంటామని కాకాణి అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement