Friday, April 26, 2024

మూడో తేదీ నుండి గ్రూప్‌ వన్‌ మెయిన్స్‌ పరీక్ష.. త్వరలో గ్రూప్‌ వన్‌, గ్రూప్‌ 2 పోస్టులకు నోటిఫికేషన్‌

అమరావతి, ఆంధ్రప్రభ : ఈనెల మూడో తేదీ నుండి గ్రూప్‌ వన్‌ మెయిన్స్‌ పరీక్ష నిర్వహిస్తున్నామని, పదో తేదీ వరకు పరీక్షలు జరుగుతాయని, మొత్తం ఏడు పేపర్లు ఉంటాయని ఎపిపిఎస్‌సి ఛైర్మన్‌ గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు. పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశామని, క్వశ్చన్‌ పేపర్‌ను ట్యాబ్‌ల ద్వారా కాకుండా హార్డ్‌కాపీలు ఇస్తున్నామని చెప్పారు. ప్రిమినలరీ పరీక్షలో 6,455 మంది మెయిన్స్‌కు అర్హత సాధించారని తెలిపారు. పది జిల్లాల్లో 11 సెంటర్లలో పరీక్షలు నిర్వహించబోతున్నామని చెప్పారు. మొదటిసారిగా పరీక్ష నిర్వహణలో బయో మెట్రిక్స్‌ను కూడా తీసుకుంటున్నామని చెప్పారు. పరీక్ష నిర్వహణ కేంద్రాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశామని, ప్రతి సెంటర్‌లో సీసీ కెమోరా కూడా ఏర్పాటు చేశామని చెప్పారు.

పరీక్ష సమయం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు ఉంటుందని చెప్పారు. ఉదయం 8.30 గంటల నుండి పరీక్ష హాల్లోకి అభ్యర్ధులు రావచ్చునని, అయితే అభ్యర్ధులు ఎట్టిపరిస్థితుల్లో 9.30 గంటల కల్లా పరీక్ష హాల్లో ఉండేట్లు చూసుకోవాలని సలహా నిచ్చారు. 9.30 గంటల తర్వాత ఒక పావుగంట మాత్రమే గ్రేస్‌ పీరియడ్‌ ఉంటుందని, ఆ తర్వాత వచ్చిన వారిని లోపలికి అనుమతించేది లేదని చెప్పారు. పది గంటల కన్నా ఎట్టి పరిస్థితుల్లో పరీక్ష మొదలవుతుందని చెప్పారు. మొత్తం 111 పోస్టుల భర్తీకి పరీక్షలు జరుగుతున్నాయని తెలిపారు. జూన్‌ పది కల్లా పరీక్ష నిర్వహణ అయిపోతే జులై చివరి నాటికి ఫలితాలను విడుదల చేస్తామని, ఎట్టి పరిస్థితుల్లో అగస్టు చివరి కల్లా ఇంటర్వ్యూలు పూర్తి చేసి పూర్తి ప్రక్రియను ముగిస్తామని చెప్పారు.

- Advertisement -

త్వరలో గ్రూప్‌ వన్‌, గ్రూప్‌ 2 నోటిఫికేషన్లు

గ్రూపు వన్‌, గ్రూప్‌ 2 పోస్టుల భర్తీకి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన నేపథ్యంలో తాము త్వరలోనే నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని చెప్పారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేయాల్సి ఉందని, దాని తర్వాతే ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయనేది తెలుస్తుందని, ఆ తర్వాత నోటిఫికేషన్‌ ఇస్తామని చెప్పారు. 2019 నుండి ఇప్పటి వరకు ఎపిపిఎస్‌సి 57 నోటిఫికేషన్స్‌ ఇచ్చి 5,447 పోస్టులను భర్తీ చేసిందని చెప్పారు.

రానున్న కాలంలో మరో 19 నోటిఫికేషన్స్‌ ద్వారా 1962 పోస్టులను భర్తీ చేయబోతున్నామని తెలిపారు. కోర్టు కేసుల వల్ల నియామక ప్రక్రియ చాలా ఆలస్యమైతోందని, దీన్ని పరిష్కరిం చేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. కొంతమంది పోస్టుల భర్తీ, ఇతర అంశాలపై సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వీరిపై నిఘా పెట్టామని, వారిని కనిపెట్టి క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని గౌతమ్‌ సవాంగ్‌ హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement