Friday, May 17, 2024

మహిళకు అగ్రస్థానంపై మేథోమథనం.. వాసిరెడ్డి పద్మ దిశానిర్దేశం

అన్నింటా ముందుకొస్తున్న ‘మహిళ’కు మరింత ఊతమిచ్చి అగ్రస్థానంలో నిలబెట్టడమే లక్ష్యంగా ‘ఏపీ మహిళా కమిషన్’ దూసుకెళ్తోంది. మహిళా సాధికారతకు ప్రభుత్వ కృషికి తోడుగా మహిళా కమిషన్ ఏడాదేడాది సరికొత్తగా ఆలోచనలు చేస్తుంది. ఈ సంవత్సర ఆరంభాన్ని ఒక అర్ధవంతమైన చర్చతో శ్రీకారం చుట్టాలని నడుంబిగించింది. రాష్ర్ట మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ నేతృత్వంలో కమిషన్ ప్రణాళికాబద్ధంగా అడుగులేస్తూ.. జాతీయ మహిళా కమిషన్  భాగస్వామ్యంతో రాష్ర్టంలో ‘మహిళా పార్లమెంట్’ నిర్వహణకు కమిషన్ పూనుకుంది. ఇందులో భాగంగా శనివారం వాసిరెడ్డి పద్మ మహిళా కమిషన్ రాష్ర్ట కార్యాలయంలో సభ్యులతో పాటు అధికారులతో సమీక్ష చేశారు. మార్చి నాలుగో తేదీన ‘మహిళా పార్లమెంట్’ నిర్వహించేందుకు నిర్ణయించారు. నిర్వహణ అంశాలకు సంబంధించి కమిషన్ సభ్యలతో వాసిరెడ్డి పద్మ చర్చించారు. ఆర్ధిక, సామాజిక, రాజకీయ,, విద్య, క్రీడలు, మీడియా, పారిశ్రామిక, సినిమా, కళలు తదితర రంగాలకు చెందిన మహిళలు పెద్ద ఎత్తున మహిళా పార్లమెంట్ కు హాజరై చర్చల్లో పాల్గొనాలన్నారు. వివిధ ప్రభుత్వ శాఖల నుంచి మహిళా ప్రతినిధులు, ఇప్పటికే మహిళా సమస్యలపై పనిచేస్తున్న ఎన్జీవోలను సైతం సదస్సులో భాగస్వామ్యం కల్పించాలని వాసిరెడ్డి పద్మ ఆదేశించారు.

ఆయారంగాల నిష్ణాతులతో పాటు బాధితుల గొంతుకను సైతం వినిపించేలా మహిళా పార్లమెంట్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని సూచించారు. సమావేశంలో కమిషన్ కార్యదర్శి శైలజ, సభ్యులు గజ్జల లక్ష్మి, గడ్డం ఉమ, బూసి వినీతతో పాటు సెక్షన్ ఆఫీసర్లు ఉన్నారు. అనంతరం పలు ఎన్జీవోల ప్రతినిధులు, వివిధ కళాశాలలు, కస్తూర్బా పాఠశాలల విద్యార్థులతో వాసిరెడ్డి పద్మ ప్రత్యేకంగా సమావేశమై మహిళా పార్లమెంట్ చర్చల్లో ప్రస్తావించాల్సిన అంశాలు, సమస్యలపై అభిప్రాయాలు స్వీకరించారు. బాలికలు, మహిళలకు సంబంధించిన చట్టాల్లో తేవాల్సిన మార్పులు, ఆర్థికపురోగతి, వారి రక్షణ, భద్రత, ఆరోగ్యం తదితర అంశాలపై సూక్ష్మ పరిశీలనతో చర్చించి రాష్ట్ర మహిళా కమిషన్ ఒక నివేదికను రూపొందించి ప్రభుత్వాలకు సమర్పించనున్నట్లు కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement