Sunday, April 28, 2024

AP – శ్రీశైలంలో ప్రారంభ మైన మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు…

కర్నూలు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభించిన ఆలయ ఈవో డి.పెద్దిరాజు మహాశివరాత్రిని పురస్కరించుకని నవాహ్నిక దీక్షతో పదకొండు రోజుల పాటు నిర్వహింపబడే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. కాగా ఈ ఉదయం ఆలయ ప్రాంగణంలో ఉత్సవ ప్రారంభ కార్యక్రమాలు ఆగమశాస్త్రానుసారం జరిపించబడ్డాయి.ఈ ప్రారంభ పూజలలో ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీరెడ్డివారి చక్రపాణిరెడ్డి దంపతులు,కార్యనిర్వహణాధికారి డి. పెద్దిరాజు దంపతులు, ధర్మకర్తల మండలి సభ్యులు విరూపాక్షయ్యస్వామి, ఎం. విజయలక్ష్మ మతి సూరిశెట్టి మాధవీలత, ప్రత్యేక ఆహ్వానితులు బి. రామమోహన్నాయుడు తదితరులు పాల్గొన్నారు.యాగశాల ప్రవేశం :ఉత్సవ నిర్వహణలో భాగంగా ముందుగా ధర్మకర్తల మండలి అధ్యక్షులు, కార్యనిర్వహణాధికారి,స్థానాచార్యులు, అర్చకస్వాములు, వేదపండితులు, అధికారులు సంప్రదాయబద్ధంగా ఆలయప్రాంగణంలోనిస్వామివార్ల యాగశాల ప్రవేశం చేశారు.

వేదస్వస్తి:ఆలయప్రవేశం చేసిన వెంటనే వేదపండితులు చతుర్వేదపారాయణలు చేసి వేదస్వస్తి నిర్వహించారు. శివసంకల్పం:వేదపఠనం అయిన వెంటనే స్థానాచార్యుల ( అధ్యాపకులు) వారు లోకక్షేమాన్నికాంక్షిస్తూ బ్రహ్మోత్సవ సంకల్పాన్ని పఠించారు. దీనికే శివసంకల్పం అని పేరు.ఈ సంకల్పంలో దేశం శాంతి సౌభాగ్యాలతో విలసిల్లాలని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా సకాలంలో తగినంత వర్షాలు కురిసి దేశం పాడిపంటలతో తులతూగాలని, జనులందరికి ఆయురారోగ్యాలుకలిగి వారికి అకాల మరణాలు రాకుండా ఉండాలని, దేశంలో అగ్నిప్రమాదాలు, వాహన, ప్రమాదాలుమొదలైనవి జరగకుండా ఉండాలని, ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలంటూ ఆలయ అర్చకులు,వేదపండితులు సంకల్పపఠనం చేశారు.

శైవక్షేత్రాల్లో శ్రీశైలం తలమానికం.

ఆది మధ్యాంత రహితుడైన పరబ్రహ్మకు పవిత్ర చిహ్నంగా ఇక్కడ మల్లికార్జున మహాలింగ చక్రవర్తి కొలువై ఉన్నాడు. పన్నెండు జ్యోతిర్లింగాలలో రెండోది ఈ క్షేత్రమే. శ్రీభ్రమరాంబాదేవికి నెలవైన శక్తిపీఠం కూడా ఇదే. కొలువైన దివ్యక్షేత్రం శ్రీశైలం. సకల వేదాలకూ మూలాధారం. అటు జ్యోతిర్లింగం, ఇటు శక్తి పీఠం ఒకే గిరిశృంగం మీద వెలసిన తావు ఇది.

సకల లోకారాధ్యంగా, త్రైలోక్య పూజితంగా భాసిల్లుతోంది.శ్రీ శైల క్షేత్రంలో పంచాక్షరి ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. శ్రీశైల క్షేత్రం ఒక్క భూమండలానికేకాక సర్వ జగత్తుకూ గరిమనాభి అని వేదోక్తి. అందుకే పూజా సమయంలో సంకల్పంలో మనం శ్రీశైలానికి ఏ దిశలో ఉన్నామో భగవంతునికి తెలియజేసుకుంటాం.

- Advertisement -

పురాణాలు వర్ణించిన శ్రీశైల ప్రాశస్త్యం మహత్త్వపూర్ణం.

.1 లక్ష 47 వేల 456 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో – ఎనిమిది శృంగాలతో శ్రీశైలం అలరారుతోంది. ఇందులో నలభై నాలుగు నదులు, అరవె కోట్ల తీర్థ రాజాలు, పరాశర, భరద్వాజాది మహర్షుల తపోవన సీమలు ఉన్నాయి. చంద్ర కుండ, సూర్యుకుండాది పుష్కరిణులున్నాయి. స్పర్శవేదులైన లతలు, వృక్షసంతతులు, అనేక లింగాలు, అద్భుత ఔషధాలు ఉన్నాయి. గిరులు బారులను దాటి శ్రీశైల మల్లన్న సన్నిధికి చేర్చే దారి ఆహ్లాదాన్ని పంచుతుంది.

బ్రహ్మగిరి, విష్ణుగిరి, రుద్రగిరి అనే మూడు పర్వతాలకు పాదాభివందనం చేస్తూ వేదఘోషను స్ఫురింపజేస్తూ కృష్ణవేణీనది పాతాళగంగ పేరుతో ఇక్కడ ఉత్తరవాహినిగా ప్రవహిస్తోంది. అష్టాదశ పురాణాల్లోనూ భారత రామాయణాది ఇతిహాసాల్లోనూ శ్రీశైల వైభవం స్తుతుల్ని అందుకొంది. కృతయుగంలో హిరణ్యకశిపుడు శ్రీశైలాన్ని తన పూజా మందిరంగా చేసుకొన్నాడు. ఈ క్షేత్ర పౌరాణిక ప్రశస్తికి గుర్తుగాసీతారాములు ప్రతిష్ఠించిన సహస్ర లింగాలు, పాండవులు సభక్తికంగా సంస్థాపించిన సద్యోజాత లింగం, పంచపాడవ లింగాలు పూజలందుకుంటున్నాయి. సంస్కృత, ఆంధ్ర, కన్నడ, మరాఠీ గ్రంథాల్లో ఈ క్షేత్రాన్ని గురించిన వర్ణనలున్నాయి. ఆయా భాషల కవులు శ్రీగిరిని కీర్తిస్తూ వ్యోమకేశ, హైమవతుల సంధ్యా సుందర నృత్యాన్ని సమనోజ్ఞంగా అభివర్ణించారు.

అరవై నాలుగు అధ్యాయాలున్న స్కాందపురాణంలోని శ్రీశైల ఖండం, ఈ క్షేత్ర మహత్తును వివరిస్తోంది. ఈ క్షేత్ర ప్రశాంతతకు ముగ్ధులైన ఆదిశంకరులు కొంతకాలం ఇక్కడ తపస్సు చేసి, శివానంద లహరిని రచించి, మల్లికార్జునుడికి పూజాసుమాలు అర్పించారు. భ్రమరాంబ సన్నిధిలో శ్రీ చక్రాన్ని ప్రతిష్ఠించారు. దత్తావతార పరంపరలో భక్తుల పూజలందుకొనే నృసింహసరస్వతీ స్వామి శ్రీశైల మహత్యాన్ని వివరిస్తూ తన పాదుకల్ని పట్టుకొన్న తంతుడు అనే భక్తుడికి ఈ క్షేత్ర దర్శన భాగ్యాన్ని కలిగించినట్లు గురుచరిత్ర చెబుతోంది.

ఆ స్వామి ఇప్పటికీ కదళీవనంలో గుప్తరూపంలో ఉన్నట్లు దత్తభక్తులు విశ్వసిస్తారు.శ్రీశైల క్షేత్రాన్ని దర్శించి ఇక్కడి మఠాలలో ఉన్న సాధకులు, యోగుల వసతి కోసం క్రీస్తుపూర్వం నుంచి అనేక రాజవంశాలు ఎన్నో భూరి దానాలను ఇచ్చినట్టుగా శిలాశాసనాలు, ఎన్నో చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఇక్ష్వాకులు, శాతవాహనులు, విష్ణుకుండినులు, పల్లవులు, రాష్ట్రకూటులు, చాళుక్యులు, కాకతీయులు, రెడ్డిరాజులు, విజయనగర సామ్రాజ్యాధీశులు, భ్రమరాంబికా సమేతుడెన మల్లికార్జునుణ్ణి దర్శించి భక్తుల సౌకర్యాలకు ఎన్నో ఏర్పాట్లు చేశారు. అశేష వస్తుసంపదలు సమర్పించారు.

శ్రీశైలంలో పంచ మఠాలు ప్రాచీనమైనవి.

మొదటిదైన ఘంటామఠం – శ్రీశైల ఆలయానికి వాయువ్యదిశగా ఉంది. శివ సాధకుడైన ఘంటాకర్ణ సిద్దేశ్వరుడు తన శిష్యులతో కలిసి దీనిని ఏర్పాటు చేశారు. రెండోదైన విభూతి మఠం వీరశైవుడైన శాంతి మల్లయ్య అనే వ్యక్తి పేరు మీదుగా ఏర్పడింది. శ్రీకృష్ణదేవరాయలి కాలంలోనే శాంతి మల్లయ్య ఇక్కడ నివసించినట్లు చారిత్రక పరిశోధనలు చెబుతున్నాయి. మూడోదైన రుద్రాక్ష మఠాన్ని మల్లి శంకరస్వామి అనే భక్తుడు నిర్మించాడని తెలుస్తోంది. ఇక్కడికి వచ్చే భక్తులకు అతడు రుద్రాక్షలను పంచిపెడుతుండేవాడని స్థానికులు చెబుతుంటారు. నాలుగోదైన సారంగ మఠాన్ని సారంగేశ్వరముని నిర్మించాడని చరిత్ర చెబుతోంది. దీనికి సంబంధించిన లిఖిత ఆధారంగా క్రీ.శ.1585 నాటి శాసనం మఠంలో లభ్యమైంది. అయిదోదైన నంది మఠంలో నందికేశ్వరుడు అనే యోగి సుదీర్ఘకాలం జీవించాడు. ఇది ఘంటా మఠానికి వైపు ఉండేది. ఇవే కాకుండా శ్రీశైలంలో పలు మఠాలు ఉండేవి. వాటిలో వీరశైవ సిద్ధాంత భిక్షావృత్తి మఠం ప్రసిద్ధమైంది. క్రీ.శ. 1518లో దీనిని సిద్ధ భిక్షావృత్తి భార్య, శిష్యుడు పర్వతయ్యలు ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది.

దీనికి చాలాకాలం ముందే 3వ కుళోత్తుంగచోలుడు ఒక మఠాన్ని క్రీ.శ. 1178-1216 మధ్య కాలంలో ఏర్పాటు చేసినట్టుగా చరిత్ర చెబుతోంది. వటసిద్ధి మఠం, చంద్రమఠం, కమరీ మఠం అనే మఠాలు భక్తులకు అన్నవసతి ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. ఇంకా అనేక మఠాలు పదహారో శతాబ్దికి పూర్వం నుంచే ఇక్కడ ఉన్నాయి

శ్రీశైల క్షేత్రం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి .రెండోరోజు నుంచి వరుసగా భృంగివాహనం, హంసవాహనం, మయూరవాహనం, రావణవాహనం, పుష్పపల్లకీ వాహనం, గజవాహన సేవలుంటాయి.

మహాశివరాత్రి నాడు ప్రభోత్సవం, నందివాహనసేవ, లింగోద్భవకాల మహారుద్రాభిషేకం, పాగాలంకరణ, కల్యాణోత్సవం జరుగుతాయి. మరునాడు రథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. మహాపూర్ణాహుతి నిర్వహించి ధ్వజావరోహణం కావిస్తారు. ఆరోజునే అశ్వ వాహనం, పుష్పోత్సవం, శయనోత్సవంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమవుతాయి.

ఈ ఉత్సవాల్లో స్వామివారు వివిధ వాహనాలను అధిరోహించి, తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులపై కరుణాకటాక్షాలను ప్రసరింపజేస్తారు. .

Advertisement

తాజా వార్తలు

Advertisement