Tuesday, April 23, 2024

AP Politics – ఉత్త‌రాంధ్ర‌లో స‌స్పెన్స్‌! ఇటు బొత్స‌.. అటు గంటా

చీపురుపల్లిపై చింత
బీమిలీలో పాగాకు సై
ఇటు బొత్స… అటు గంటా
సతి కోసం పతి త్యాగం
కిమిడితో రచ్చకు శ్రీనయ్య నో
టీడీపీ టార్గెట్.. విజయనగరం కింగ్

(ఆంధ్రప్రభ స్మార్ట్, విశాఖపట్నం ప్రతినిధి ) – విశాఖపట్నం వేదికగా అధికార పార్టీ వైసీపీ, ప్రతిపక్షం టీడీపీలో కీలక నేతల సీట్ల వ్యూహం క్షణక్షణం రంగులు మారుతోంది. మరీ ముఖ్యంగా మంత్రి బొత్స సత్యానారయణ, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వ్యూహాలు మలుపులు మీద మలుపులు తిరుగుతూ రాజకీయ వర్గాల్లో నరాలు తెగే ఉంత్కంఠతను రేపుతున్నాయి. గత ఇరవై ఏళ్లుగా చీపురుపల్లి హీరోగా పేరొందిన బొత్స సత్యనారాయణ సరికొత్త ప్లాన్ తెరమీదకు తీసుకువచ్చినట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అదే రీతిలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా తన పావులను అతివేగంగా కదుపుతున్నట్టు టీడీపీ వర్గాల కథనం. ఈ ఆసక్తికర సన్నివేశాన్ని ఓ సారి అవలోకనం చేస్తే..

చీపురుపల్లిపై టీడీపీ వ్యూహం.. బీమిలిపై వైసీపీ ప్రతివ్యూహం

ఈ ఎన్నికల్లో ప్రత్యర్థుల కోటల్ని ధ్వంసం చేసి.. తమ సామాజ్యాల్ని స్థాపించాలని ప్రధాన రాజకీయ పార్టీలు వ్యూహాల మీద వ్యూహాలు రచిస్తున్న తరుణంలో ఉత్తరాంధ్రాలో వైసీపీకి ఆయువు పట్టు, ఆర్థిక శక్తిని నిర్వీర్యం చేయాలనే ఆశతో తెలుగుదేశం పార్టీ… విజయనగరం జిల్లా చీపురుపల్లిపై కన్నువేసింది. ఆ కోటను స్వాధీనం చేసుకోవటానికి ధీటైన అభ్యర్థిని, బలగాలని మోహరిస్తున్న తరుణంలో… తాజాగా ఎత్తులు, జిత్తులు మారిపోతున్నాయి. అందేంటంటే.. చీపురుపల్లిలో మంత్రి బొత్స సత్యనారాయణపై గంటా శ్రీనివాసరావును నిలబెట్టాలని చంద్రబాబు భావించారు. ఆ మేరకు తన నిర్ణయాన్నీ వెళ్లగక్కారు. కానీ ఇక్కడ బొత్స సత్యనారాయణదే హవా. 2004లో కాంగ్రెస్ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించగా.. 2014లో మినహా ఇప్పటి వరకూ బొత్స తన సత్తాను చాటుతూనే ఉన్నారు. ఎలాగైనా బొత్స హవాకు గండి కొట్టాలన్నది చంద్రబాబు ఆకాంక్ష. అందుకే గంటా శ్రీనివాసరావును చీపురుపల్లి బరిలోకి దించాలని టీడీపీ యోచిస్తుండగా.. తనకు భీమిలీ టిక్కెట్ కావాలనిగంటా శ్రీనివాసరావు కోరుతున్నారు. ఇంతలో అనూహ్యంగా మంత్రి బొత్స స‌త్యనారాయ‌ణ‌ భీమిలీ నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. దీనికి కారణం వైజాగ్ ఎంపీ అభ్యర్థిగా బొత్స ఝాన్సీని ఖరారు చేయడమే. భార్యను గెలిపించుకునేందుకు అన్ని స్థానాల్లోనూ తాను చెప్పిన అభ్యర్థులే ఉండాలని.. తాను కూడా భీమిలీ నుంచి పోటీ చేస్తానని బొత్స చెప్పడంతో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అంగీకరించారని అంటున్నారు. ఇది ఇలా ఉంటే బొత్స ఝాన్సీ ల‌క్ష్మీ అభ్యర్ధిత్వం ప్రక‌టించి నెల దాటిన ఇంత వ‌ర‌కూ విశాఖ‌ప‌ట్నంలో అడుగుపెట్టలేదు.. దీంతో ఆమె అక్కడ నుంచి పోటీ చేస్తారా లేక వేరే స్థానానికి వెళ‌తారా అనేది కూడా పెద్ద స‌స్పెన్స్ గా మారింది..

విజయ ఘంటారావం పై సస్పెన్స్…

ఇప్పుడు గంటా విషయంలో టీడీపీ హైకమాండ్ కూడా ఆలోచించే అవకాశం ఉంది. బొత్స భీమిలీలో పోటీ చేస్తే ఆయనకు పోటీగా టీడీపీ తరపున గంటానే బరిలోకి దిగుతారు. ఆయన కోరుకున్న టిక్కెట్ లభిస్తుంది. ఎందుకంటే విశాఖపట్నం జిల్లాలోనే గంటా శ్రీనివాసరావు బలం, బలగం ఎక్కువ. 2004లో చోడవరం నియోజకవర్గంలో బాలి రెడ్డి సత్యారావుపై 9,601 ఓట్ల మెజారిటీతో గంటా శ్రీనివాసరావు గెలిచారు. అలాగే 2014లో భీమిలిలో 37,226 మెజారిటీతో వైసీపీ అభ్యర్థి కర్రి సీతారాము పై విజయం సాధించారు. ఇక విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 2019లో కన్నుల కన్నపరాజు పై 1944 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇప్పటి వరకూ విశాఖజిల్లాలో నియోజకవర్గాలు మారినా గంటా విజయ ఘంట మోగిస్తున్నారు. అలాగే చంద్రబాబు కోరుకున్న పోటీ కూడా జరుగుతుంది. అప్పుడు చీపురుపల్లిలో పని చేసుకుంటున్న కిమిడి నాగార్జునకే అవకాశం లభిస్తుంది. గంటా పోటీ చేసే పరిస్థితి ఉంటే బొత్స ఆలోచించే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారమూ జరుగుతోంది.మొత్తంగా వైసీపీలో టిక్కెట్ల పంచాయతీ నామినేషన్ల వరకూ తేలేలా కనిపించడం లేదు. అటూ ఇటూ మార్పులతో… అభ్యర్థుల్లో ఎక్కడా లేనంత టెన్షన్ ఉంది. చాలా మంది .. ఖర్చు పెట్టుకోవడం ఎందుకు అని సైలెంట్ అయిపోయారు. ఉంటుందో ఉండదో తెలియని టిక్కెట్ కోసం ఫ్లెక్సీలు కూడా దండగనుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement