Sunday, April 28, 2024

AP Political Story – ఎన్నిక‌ల వేడి – కొత్త మ‌లుపులు – పేలుతున్న మాట‌ల తూటాలు…

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు జరిగేందుకు మరో ఏడాది సమయం ఉన్నప్పటికీ అన్ని రాజకీయ పార్టీలు ప్రజల మధ్యకు వచ్చి మాటలు తూటాలు పేల్చుతు న్నారు. ముందస్తు ఉందా అన్న రీతిగా ప్రతిపక్షా లు చేస్తున్న హడావిడికి సీఎం జగన్‌ ఆలోచనే లేదని స్పష్టమైన సంకేతాలి స్తున్నారు. ఈక్రమంలోనే నిన్న మొన్నటి వరకూ పొత్తులు పెట్టుకుని ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలకుండా చేస్తానని చెప్పిన జనసేనాని పవన్‌ కల్యాన్‌ ఉన్నట్టుండి వారాహి యాత్రను ప్రారంభిం చి సీఎం అయ్యేందుకు తాను సిద్ధంగా ఉన్నా నంటూ హాట్‌ హాట్‌ ప్రకటనలు చేస్తున్నారు. అంతటితో ఆగకుండా ప్రభుత్వంపై విరుచుకుపడు తున్నారు. ఈక్రమంలోనే పొత్తులపై ఇప్పుడే ఏమీ చెప్పలేమని చెప్పుకొస్తు న్నారు. ఈక్రమంలోనే అధికార వైసీపీ పవన్‌కు ధీటైన కౌంటర్లు ఇస్తూ వస్తోంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో మైత్రీ చెడిపోవడం వల్లే పవన్‌ రోడ్డెక్కి అరుస్తున్నా డంటూ పవన్‌ వ్యాఖ్యలు అర్ధరహితమని చెబుతూ ధీటైన కౌంటర్లు చేస్తున్నారు. పవన్‌ చేసిన ప్రతి వ్యాఖ్యకు కౌంటర్‌ ఇస్తున్నారు. అసలు ఎక్కడ నుండి పోటీ చేస్తారో చెప్పకుండా తనను అసెంబ్లిdకి పంపాలంటూ ప్రజలను అడుగుతున్నారని ఎద్దేవా చేస్తున్నారు. ఎవరెన్ని చెప్పినా వై నాట్‌ 175 అనేది నిజమవుతుందని అంటున్నారు.

ఇక తెలుగుదేశం కూడా తామేమీ తక్కువ కాదంటూ 175కు 175 స్థానా లు గెలవాల్సిందేనంటూ కేడర్‌ను సమాయత్తం చేస్తున్నారు. మెరుగైన సంక్షేమం అందిస్తామంటూ ప్రజలకు తెలియజెప్పేలా బస్సు యాత్ర ద్వారా రాష్ట్రాన్ని కలియతిరుగుతున్నారు. ఈ మధ్యలో బీజేపీ కూడా తానున్నానంటూ అటు వైసీపీ, ఇటు తెదేపా మీద విమర్శ నాస్త్రాలు చేస్తూ వస్తున్నారు. ఈ మధ్యలో రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఓటర్ల చేర్పులు, మార్పులు, డూప్లికేట్లు తదితరాలపై ప్రత్యేక దృష్టిపెట్టి ఎన్నికల ప్రక్రియన ప్రారంభించింది. ఈనేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి.

సీఎం సీట్లో కూర్చోవడానికి సిద్ధంగా ఉన్నా
జనసేనాని పవన్‌ కల్యాన్‌ ఉన్నట్లుండి తన స్టాండ్‌ మార్చుకున్నారు. నిన్నమొన్నటి వరకూ పొత్తుల అంశంపై పదే పదే మాట్లాడిన ఆయన ఇప్పుడప్పుడే పొత్తులపై నిర్ణయం ఏమీ లేదని చెబుతున్నారు. తనకు అవకాశం ఇస్తే సీఎం కుర్చీలో కూర్చోవడానికి సిద్ధంగా ఉన్నానంటున్నారు. తనతోపాటు తన అభ్యర్ధులను అసెంబ్లిdలోకి పంపాలంటూ పదే పదే అభ్యర్ధిస్తున్నారు. ఈక్రమంలోనే అవినీతి వైసీపీ అంటూ అధికారపార్టీపై విరుచుకుపడుతున్నారు. ఇప్పుడు పవన్‌ వ్యాఖ్యలు చూస్తే సీఎం జగన్‌ సింగిల్‌గా పోటీచేసే దమ్ముందా అంటూ పదేపదే ప్రశ్నించిన పరిస్థితి గుర్తుకొస్తోంది. పవన్‌ సీఎం జగన్‌ ట్రాప్‌లో పడ్డారా అన్న అనుమానం కలుగుతోంది. పవన్‌ వ్యాఖ్యలను చూస్తుంటే ఈసారి ఎన్నికల్లో వైసీపీ, తెలుగుదేశం, జనసేన-బీజేపీ వేర్వేరుగా పోటీచేస్తాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కత్తిపుడి నుండి ప్రారంభమైన వారాహి యాత్రలో పవన్‌ ప్రభుత్వంపై ఘాటైన విమర్శలు చేస్తూ వస్తున్నారు. సీఎం జగన్‌, మంత్రి పెద్దిరెడ్డి, కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి ఇలా ఎవరు దొరికితే వారిపై ఘాటైన విమర్శలు చేస్తూ వస్తున్నారు.

బాబుతో చెడ్డాకే.. రోడ్డెక్కిన పవన్‌
ఇదిలా ఉండగా, పవన్‌ వ్యాఖ్యలపై అధికార వైకాపా సీరియస్‌గా స్పందిస్తూ వస్తోంది. ఆయన చేసిన ప్రతి వ్యాఖ్యను ఉటంకిస్తూ మీడియా ముఖంగా ఎండగట్టే ప్రయత్నం చేస్తోంది. గతంలో పవన్‌ వ్యాఖ్యలకు, ఇప్పటి పనవ్‌ వ్యాఖ్యలకు తేడా గమనిస్తే చంద్రబాబుతో పవన్‌ కల్యాణ్‌కు చెడ్డబట్టే ఆయన రొడ్డెక్కారంటూ సెటైర్లు వేస్తోంది. అంతటితో ఆగకుండా వేల కోట్ల అవినీతి అంటూ పవన్‌ చేస్తున్న వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందిస్తోంది. మంత్రులైతే ఎవరికివారే స్పందిస్తూ వస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా కొంత మంది టీంగా ఏర్పడి పవన్‌ చేసిన ప్రతి వ్యాఖ్యను ఖండిస్తూ వస్తున్నారు. కాకినాడ అర్బన్‌ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి దమ్ముంటే కాకినాడ నుండి పోటీ చేయాలని పవన్‌కు సవాల్‌ విసిరారు. అంతేకాకుండా ఎవరెన్ని కుట్రలు పన్నినా వై నాట్‌ 175 అన్న తమ అధినేత జగన్‌ ఆశయాన్ని నూటికి నూరు శాతం నెరవేర్చి తీరుతామని ప్రతినబూనుతున్నారు. ఈక్రమంలోనే సీఎం జగన్‌ నెల రోజులపాటు మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టి నేతలను ప్రజల మధ్యే తిరిగేట్టు చేస్తూ అక్కడే పవన్‌ వ్యాఖ్యలపై కౌంటర్‌ ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. జగనన్న సురక్ష పేరుతో తొమ్మిది అంశాలపై ప్రజలకు న్యాయం చేసేలా నిర్ణయం తీసుకున్నారు. ఒకవైపు గడప గడపకు మన ప్రభుత్వం, ఇంకో వైపు జగనన్న సురక్ష పేరుతో నిత్యం నేతలను ప్రజల మధ్యే ఉంచుతూ తాను జిల్లాల పర్యటనల్లో మునిగి తేలుతున్నారు.

- Advertisement -

175 గెలుస్తాం
ప్రతిపక్ష నేత చంద్రబాబు కూడా అన్నీ తానై రాష్ట్రం మొత్తం కలియతిరుగుతున్నారు. మరోవైపు ఆయన కుమారుడు లోకేష్‌ పాదయాత్రతో చుట్టేస్తున్నారు. ఈక్రమంలోనే చంద్రబాబు కేడర్‌లో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు 175కు 175 స్థానాలను మనమే గెలుస్తామంటూ భరోసా నింపే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. ఇది చాలదన్నట్లు తాజాగా బస్సు యాత్రతో మరోమారు ప్రజల్లోకి వస్తున్నారు. నిరంతరం ఆయన ప్రజల మధ్యే ఉండేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వైసీపీ నేతల దురాగతాలపై గొంతెత్తి నినదిస్తున్నారు. అవినీతిపైన, రౌడీయిజంపైన ఆయన చేస్తున్న పోరాటం ఆపార్టీ నేతల్లో స్ఫూర్తిని నింపుతోంది. అందివచ్చిన ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోకుండా ముందస్తు జాగ్రత్తలు పాటిస్తున్నారు. పార్టీలోకి చేరికలను ప్రోత్సహిస్తూ అధికార పార్టీ ధోరణివల్లే పార్టీలు మారుతున్నారంటూ చెప్పుకొస్తున్నారు. కుప్పం కోటలో ఎవరెన్ని కుయుక్తులు పన్నినా మళ్లిd తానే పాగా వేస్తానని, అంతేకాకుండా రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తుందంటూ కార్యకర్తల్లో ధైర్యం నింపుతున్నారు.

ఎన్నికలకు ఈసీ సమాయత్తం
ఎన్నికల కమిషన్‌ 2024లో జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు ఇప్పటి నుండే సమాయత్తమవుతోంది. ఓటర్ల జాబితాలపై ఫోకస్‌ పెట్టింది. బోగస్‌ ఓటర్లను ఏరివేయడంతోపాటు మార్పులు, చేర్పులు తదితరాలపై అధికార యంత్రాంగానికి సూచనలు, సలహాలు ఇస్తూ వస్తోంది. అంతేకాకుండా ఈవీఎంల పరిస్థితిపైనా ప్రత్యేక దృష్టిపెడుతోంది. అధికార యంత్రాంగం ఎంత మంది అందుబాటులో ఉన్నారు.. ఈసారి ఎన్నికల నిర్వహణ ఏవిధంగా చేపట్టాలి తదితర అంశాలపై కసరత్తు ప్రారంభించింది. ఈనేపథ్యంలోనే ఓటర్ల జాబితాల సవరణకు సంబంధించి హైకోర్టులో దాఖలైన పిటీషన్‌ను విచారించిన న్యాయమూర్తులు ఎన్నికల కమిషన్‌కు నోటీసులు జారీ చేశారు. దీనిపై ఈసీ దృష్టిసారించింది.

వ్యాఖ్యలతో .. విడివిడిగా పోటీయేనా
జనసేనాని పవన్‌ కల్యాణ్‌ తాను సీఎం సీట్లో కూర్చోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పడంతో పొత్తులు ఉండబోవన్న సంకేతాన్ని పంపారని విశ్లేషకులు భావిస్తున్నారు. పవన్‌ చేసిన ఈ వ్యాఖ్యలు తాను సింగిల్‌గానే పోటీచేస్తానని చెప్పినట్లయ్యాయని వారు పేర్కొంటున్నారు. తెలుగుదేశం కూడా ముఖ్యమైన సీట్లను జనసేనకు ఇవ్వడానికి సుమఖంగా కనిపించడం లేదు. జనసే, బీజేపీ కలిసి పోటీకి రానుండటంతో ఆ రెండు పార్టీలను కలుపుకుంటే తమకు భారీగా నష్టం వాటిల్లుతుందని తెదేపా భావించిన మీదటే పవన్‌ వ్యాఖ్యలు చేస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. వీటన్నంటి నడుమ ఈసారి ఎన్నికల్లో ఎవరి వారే విడివిడిగా పోటీచేసే అవకాశాలున్నాయని వారు చెబుతున్నారు. సీఎం జగన్‌ మొదటి నుండి సింగిల్‌గా పోటీచేసే దమ్ముందా అంటూ వ్యాఖ్యలు చేస్తూ విసిరిన పాచికకు అటు జనసేన, ఇటు టీడీపీ పడ్డాయని అంటున్నారు. మొత్తం మీద అన్ని ప్రధాన పార్టీలు ప్రజల మధ్యకు వచ్చి హడావిడి చేస్తుండటంతో ఎన్నికల వాతావరణం స్పష్టంగా కనిపిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement