Friday, May 3, 2024

వివేకా హత్య కేసు.. దేవిరెడ్డి బెయిలు పిటిషన్ను కొట్టేసిన హైకోర్టు

ఏపీ సీఎం జగన్ బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి బెయిలు కోసం దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. హత్య కేసులో సీబీఐ దర్యాప్తు కీలక దశలో ఉన్నందున బెయిలు మంజూరు సాధ్యం కాదని తేల్చిచెప్పింది. కేసు తీవ్రత , ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకొని దిగువ కోర్టు సైతం బెయిలు నిరాకరించిందని గుర్తుచేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి.రమేష్ ఈ మేరకు నిర్ణయాన్ని వెల్లడించారు.వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న డి.శివ శంకర్ రెడ్డిని అరెస్ట్ చేసిన సీబీఐ .. పులివెందుల కోర్టులో హాజరుపరిచింది. న్యాయస్థానం శివశంకర్ రెడ్డికి బెయిలు నిరాకరిస్తూ డిసెంబర్ 21న ఉత్తర్వులిచ్చింది. ఈ నేపథ్యంలో నిందితుడు బెయిలు కోసం హైకోర్టును ఆశ్రయించారు.

సీనియర్ న్యాయవాది టి.నిరంజన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ .. పిటిషనర్ నేరానికి పాల్పడ్డట్టు ఆధారాలు లేవన్నారు. పోలీసులు మొదట నమోదు చేసిన కేసులో ఆయన పేరు లేదన్నారు. తర్వాత సీబీఐ అధికారులు ఆయన్ని ఇరికించారన్నారు. హత్య కేసులో మరో నిందితుడు దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా సీబీఐ పిటిషనర్ను అరెస్ట్ చేసిందన్నారు. దస్తగిరితో పాటు పలువురు నిందితులు ఇప్పటికే బెయిలుపై బయట ఉన్నారన్నారు.
వివేకా హత్యకు సంబంధించిన సాక్ష్యాధారాలను నాశనం చేయడంలో శివశంకర్ రెడ్డి కీలక పాత్ర పోషించారని సీబీఐ తరఫు న్యాయవాది చెన్నకేశవులు వాదనలు వినిపించారు. దర్యాప్తు కీలక దశలో ఉందన్నారు. పిటిషనర్ బెయిలుపై విడుదల అయితే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందన్నారు. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని పిటిషన్ ను కొట్టేయాలని కోరారు. సీబీఐ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి .. పిటిషన్ను కొట్టేస్తూ తీర్పు ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement