Saturday, May 11, 2024

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు వేగవంతం.. సూచనల పరిశీలనకు కమిటీ

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఆ ప్రక్రియను మార్చి 18 నాటికి పూర్తి చేయాలని భావిస్తోంది. అందుకు అనుగుణంగా కసరత్తులు ముమ్మరం చేసింది. కొత్త జిల్లాలపై వచ్చే అన్ని రకాల అభ్యంతరాలు, సూచనలను క్షుణ్ణంగా పరిశీలించి, అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. ప్రణాళిక శాఖ కార్యదర్శి, సీసీఎల్‌ఏ కార్యదర్శి, అన్ని జిల్లాల కలెక్టర్లతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు.  కొత్తగా మరో 13 జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లపై అభ్యంతరాలు, సూచనలను జిల్లా కలెక్టర్లకు ఇచ్చేందుకు సర్కారు 30 రోజుల గడువు ఇచ్చింది. ఆయా జిల్లాల్లో కలెక్టర్లు వీటిని స్వీకరిస్తున్నారు.

తాము అందుకున్న విజ్ఞప్తులను కలెక్టర్లు www. drp.ap.gov.in వెబ్‌ సైట్‌లో ప్రతీరోజూ అప్‌లోడ్‌ చేయాల్సి వుంటుంది. ఇలా అప్‌లోడ్‌ చేసే ప్రతి అభ్యంతరం, సూచనను పరిశీలించి దానిపై రిమార్కు రాయాలి. ఆ తర్వాత వాటిని కలెక్టర్లు, రాష్ట్రస్థాయి అధికారుల కమిటీ పరిశీలిస్తుంది. వచ్చిన అభ్యంతరాలు, సలహాలను ఈ కమిటీ పూర్తిగా అధ్యయనం చేసి అది సహేతుకమైనదా? పరిగణలోకి తీసుకోవాలా లేదా? అని నిర్ణయిస్తుంది. ప్రతి అభ్యంతరం, పరిశీలనను స్వీకరించాలా? తిరస్కరించాలో? చెబుతూ ఈ కమిటీ సిఫారసు చేస్తుంది. ఈ ప్రక్రియ పకడ్బందీగా, శాస్త్రీయంగా ఉండాలని ప్రభుత్వం స్పష్టంచేసింది. వీరి సిఫార్సుల ఆధారంగా జిల్లాల పునర్వ్యవస్థీకరణపై ఏమైనా మార్పులు, చేర్పులు చేయాల్సి వుంటే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ చివరకు నిర్ణయం తీసుకుంటుంది.

కాగా, మార్చి 15-17 నాటికి జిల్లాల ఏర్పాటుపై తుది నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది. ఏప్రిల్ 2 నాటికి కొత్త జిల్లాల్లో కార్యకలాపాలు ప్రారంభమవుతాయని తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement