Tuesday, April 30, 2024

Delhi | హస్తినలో ఏపీ సీఎం జగన్.. ఆర్థిక, విద్యుత్ మంత్రులతో భేటీ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: పోలవరం, విద్యుత్ బకాయిలే ప్రధానాంశాలుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన తొలిరోజు సాగింది. గురువారం మధ్యాహ్నం ఢిల్లీ చేరుకున్న ఆయన, ఇద్దరు కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు. సాయంత్రం గం. 6.30కు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ను ఆమె కార్యాలయంలో కలిశారు. ఇద్దరి మధ్య సుమారు 45 నిమిషాల పాటు చర్చ జరిగింది. ఈ భేటీలో పోలవరం ప్రాజెక్టు గురించి ప్రధానంగా చర్చ జరిగినట్టు తెలిసింది. ప్రాజెక్టు నిర్మాణ వ్యయం పెరిగిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం గతంలో కేటాయించిన మొత్తాన్ని మరో రూ. 10,500 కోట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అయితే పెంచిన అంచనా వ్యయానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేస్తే తప్ప నిధులు విడుదల చేయడం సాధ్యపడదు.

వీలైనంత త్వరలో ఆర్థిక శాఖ దీనిపై సానుకూలంగా నిర్ణయం తీసుకుంటే ఆ వెంటనే కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉన్నందున ముఖ్యమంత్రి జగన్ ఈ అంశంపై కేంద్ర మంత్రితో చర్చించారు. కోవిడ్-19, వరదలు వంటి వివిధ కారణాలతో ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమవుతున్న నేపథ్యంలో కేంద్రంపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారు. 2017-18 ధరల సూచీ ప్రకారం పోలవరం ప్రాజెక్టు వ్యయం రూ. 55,548.87 కోట్లుగా ఇప్పటికే టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఆమోదం తెలిపిందని గుర్తుచేసిన సీఎం, దీనికి ఆమోదం తెలపాల్సిందిగా విజ్ఞప్తి చేసినట్టు తెలిసింది.

లైడార్‌ సర్వేప్రకారం అదనంగా 36 ఆవాసాల్లో ముంపు కుటుంబాలను రక్షిత ప్రాంతాలకు తరలించాల్సి ఉందని, 2022 జులైలో వచ్చిన భారీ వరదలు వల్ల తలెత్తిన పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తొలిదశ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా చేయాల్సిన పనులపై ఈ అంచాలను రూపొందించామని సీఎం వెల్లడించారు. పోలవరం తొలిదశను పూర్తిచేయడానికి ఇంకా రూ.17,144.06 కోట్లు అవసరమవుతాయని, ఆమేరకు నిధులు విడుదలచేయాలని అభ్యర్థించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంకోసం రాష్ట్ర ప్రభుత్వం తన సొంత నిధులనుంచి ఖర్చుచేసిన రూ.1,355 కోట్లను రీయింబర్స్‌ చేయాలని కూడా విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

పోలవరంతో పాటు ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో చంద్రబాబు హయాంలో చోటుచేసుకున్న అవకతవకల గురించి కూడా నిర్మల సీతారామన్‌తో చర్చించినట్టు తెలిసింది. ఈ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ సీఐడీ దర్యాప్తు చేపట్టక ముందే కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలోని జీఎస్టీ, ఈడీ సంస్థలు విచారణ జరిపి కొందరిని అరెస్టు కూడా చేశాయి. అవినీతి నిరోధక చట్టం, ఐపీసీ సెక్షన్ల మేరకు జరిగిన నేరాలపై సీఐడీ దర్యాప్తు చేస్తుండగా, ఇందులో చోటుచేసుకున్న మనీ లాండరింగ్ అంశాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ కొందరిని అరెస్టు చేసి, ఆస్తులను అటాచ్ చేసిందని, మనీలాండరింగ్ అంతిమ లబ్దిదారుడు చంద్రబాబు నాయుడే కాబట్టి ఈడీ దర్యాప్తు మరింత ముందుకు సాగాల్సిన అవసరం ఉందని సీఎం జగన్ కేంద్ర ఆర్థిక మంత్రితో చెప్పినట్టు తెలిసింది.

విద్యుత్ బకాయిలు ఇప్పించండి
నిర్మల సీతారామన్‌తో భేటీ అనంతరం నేరుగా కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ నివాసానికి చేరుకున్న జగన్, ఆయనతో సుమారు గంట సేపు చర్చించారు. కాసేపు ముఖాముఖి నేతలిద్దరూ చర్చించుకోగా, ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి, ఎంపీలు విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి సమావేశంలో చేరారు. విభజన సమయం నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన విద్యుత్ బకాయిల విషయంలో ఏపీ ప్రభుత్వం గతంలోనూ పలుమార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. తెలంగాణ ప్రభుత్వం విద్యుత్‌ బకాయిల రూపంలో ఆంధ్రప్రదేశ్‌కు రూ.7,359 కోట్లు చెల్లించాల్సి ఉందని సీఎం తెలిపారు.

2014 జూన్‌ నుంచి 2017 జూన్‌వరకూ సరఫరా చేసిన విద్యుత్‌ ఛార్జీలను ఇప్పటికీ చెల్లించలేదని గుర్తుచేశారు. గత 9 ఏళ్లుగా ఈ సమస్య పెండింగులో ఉందని, ఏపీ జెన్‌కోకు, డిస్కంలకు ఇది తీవ్ర గుదిబండగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫలితంగా వివిధ సంస్థలకు చెల్లింపులు చేయలేని పరిస్థితిలో ఏపీ విద్యుత్ సంస్థలు ఉన్నాయని తెలిపారు. ఈ డబ్బు ఇప్పించాలంటూ ఏపీ ప్రభుత్వం పలుమార్లు విజ్ఞప్తులు చేయగా, 30 రోజుల్లోగా ఏపీకి బకాయిలు చెల్లించాలంటూ 2022 ఆగస్టు 29న కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినప్పటికీ, తెలంగాణ రాష్ట్రం హైకోర్టును ఆశ్రయించిందని, దీంతో ఈ అంశంలో కోర్టు వ్యవహారంలో పడిపోయిందని తెలిపారు. ఏపీ విద్యుత్‌ సంస్థలకు ఆడబ్బు వచ్చేలా తగిన చర్యలు తీసుకోవాలని జగన్ విజ్ఞప్తి చేశారు.

దీంతో పాటు రీవ్యాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీం (ఆర్డీఎస్ఎస్) స్కీంకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అర్హత సాధించడంతో.. ఆ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన నిధుల గురించి చర్చించినట్టు తెలిసింది. భేటీ అనంతరం కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ మీడియాతో మాట్లాడారు. ఏపీలో విద్యుత్ వ్యవస్థ, ప్రాజెక్టుల గురించి చర్చించినట్టు చెప్పారు. రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థ బాగా పనిచేస్తోందని, అందుకు తనకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. అలాగే ఆర్డీఎస్ఎస్ పథకానికి ఆంధ్రప్రదేశ్ అర్హత సాధించిందని, ఆ పథకం కింద అందించే ఆర్థిక సహాయం గురించి చర్చించామని చెప్పారు. అయితే తెలంగాణ విద్యుత్ బకాయిలపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించినప్పటికీ.. ఆయన సమాధానం ఇచ్చేందుకు నిరాకరించారు. ఆర్కే సింగ్‌తో భేటీ అనంతరం జగన్మోహన్ రెడ్డి నేరుగా జన్‌పథ్‌లోని తన అధికారిక నివాసానికి చేరుకున్నారు. పలువురు పార్టీ ఎంపీలు, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు ఆయన్ను కలిశారు.

పర్యటనకు రాజకీయ ప్రాధాన్యం
శుక్రవారం (నేడు) ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరగనున్న వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల సదస్సులో పాల్గొనేందుకు ఢిల్లీ పర్యటన చేపట్టిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేంద్ర ప్రభుత్వ పెద్దలతో కలిసి పెండింగ్ అంశాల గురించి చర్చించడం కోసం ఒక రోజు ముందుగానే ఢిల్లీ చేరుకున్నారు. అయితే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత ఆయన తొలిసారిగా ఢిల్లీ చేరుకోవడంతో ఈ పర్యటనకు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అరెస్టుతో ఒక్కసారిగా మారిన రాజకీయ పరిణామాలు, అరెస్టు వెనుక కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) హస్తం కూడా ఉందన్న ఆరోపణల నేపథ్యంలో జగన్ ఢిల్లీ పెద్దలతో జరిపే చర్చలు ఆసక్తికరంగా మారాయి.

శుక్రవారం రాత్రి గం. 8.00 తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఈ భేటీలో కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన పెండింగ్ అంశాలతో పాటు రాజకీయపరమైన చర్చ జరిగే అవకాశం ఉంది. చంద్రబాబు అరెస్టు అక్రమం అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌తో ఆ పార్టీ ఎంపీలు రాష్ట్రపతిని కలవడం, ఎంపీ కే. రామ్మోహన్ నాయుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖలు రాసిన నేపథ్యంలో జగన్-అమిత్ షా మధ్య జరిగే చర్చలో ఈ అంశం చర్చకొచ్చే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement