Saturday, September 21, 2024

ఏపీ కేబినెట్‌ అంతా రీ ఫ్రెష్‌.. లిస్ట్ ఫైనల్ చేస్తున్న సీఎం జగన్

అమరావతి ఆంధ్రప్రభ బ్యూరో: మంత్రివర్గ విస్తరణ అంటే చాలు.. సాధారణంగా ప్రభుత్వంపైనా, పార్టీ పైనా వ్యతిరేకత వస్తుంటుంది. పదవులు కోల్పోయినవారు అధిష్టానంపై అసంతృప్తి వ్యక్తం చేయడం అనేక సందర్భాల్లో లేని బలాన్ని కూడగట్టుకుని తిరుగుబాటు చేసే ప్రయత్నం చేస్తుంటారు. అయితే ఇటువంటి సంఘటనలకు అవకాశం కల్పించకుండా ఉండేందుకు సీఎం జగన్‌ వ్యూహాత్మకంగా మంత్రివర్గ విస్తరణను చేపట్టబోతున్నారు. కేబినెట్‌ను పూర్తి స్థాయిలో మార్పులు చేసి 25 మంది కొత్త మంత్రులతో క్యాబినెట్‌ ఏర్పాటుచేసే దిశగా కసరత్తు చేస్తున్నారు. ఒకవిధంగా సీఎం జగన్‌ సాహసోపేత నిర్ణయం తీ సుకోబోతున్నారు. సహజంగా మంత్రివర్గ విస్తరణ అంటే పనిచేయని మంత్రులను తొలగించి ఆ స్థానంలో సమర్థులైన వారికి అవకాశం కల్పిస్తుంటారు. ప్రస్తుతం జగన్‌ కేబినెెట్‌లో చాలామంది పనిచేసే మంత్రులుగా పేరు తెచ్చుకున్నారు. అనేక సందర్భాల్లో సీఎం జగన్‌ ప్రశంసలు కూడా అందుకున్నారు. అయితే మంత్రివర్గ విస్తరణలో భాగంగా పనిచేయని వారితో పాటు ప్రశంసలు అందుకున్న వారిని కూడా తొలగించాలని ఆయన యోచిస్తున్నారు. ఇంత కఠిన నిర్ణయా లు తీసుకోవడం వెనుక సీఎం జగన్‌ సరికొత్త వ్యూహం దాగి ఉంది. రెండున్నరేళ్ల తరువాత చేపడుతున్న మంత్రివర్గ విస్తరణలో ఎక్కడా వ్యతిరేకత అనేది కనిపించకూడదన్న ఉద్దేశ్యంతో ఆయన పూర్తి స్థాయి ప్రక్షాళనవైపు మొగ్గుచూపుతున్నట్లు పార్టీ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. వాస్తవానికి విజయదశమిని పురస్కరించు కుని ఆయన మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని భావించినప్పటికీ.. గతంలో చెప్పిన విధంగా సరిగ్గా రెండున్నర సంవత్సరం తరువాతే విస్తరణ చేపట్టాలని యోచిస్తున్నారు. ఇప్పటికే దాదాపు 28 నెలలు పూర్తయింది. డిసెంబరు 8వ తేదీకి సరిగ్గా రెండున్నర సంవత్సరం పూర్తవుతుంది. ఈలోపే మంచి ముహూర్తం చూసుకుని విస్తరణ చేపట్టాలని, ఆ దిశగా సీఎం జగన్‌ సరికొత్త వ్యూహాలతో కసరత్తు చేస్తున్నారు.

కొత్త మంత్రులు వారేనా?
మంత్రివర్గ విస్తరణకు సంబంధించి అధికారికంగా ముహూర్తం ఖరారు కాలేదు. అయినా రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల పరిధిలో మంత్రి పదవులు ఆశిస్తున్న శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు పెద్దఎత్తున ప్రయత్నాలు మొదలుపెడుతున్నారు. మరికొన్ని జిల్లాల్లో అయితే ఏకంగా కొత్త మంత్రుల పేర్లు సొంత పార్టీ నేతలే వేదికలపై ప్రచారం చేస్తున్నారు. అదేవిధంగా ఆయా జిల్లాల్లో మంత్రి పదవులు ఆశిస్తున్న వారి మధ్య పోటీ కూడా తీవ్ర స్థాయిలో ఉంది. శ్రీకాకుళం నుండి సీనియర్‌ నేత ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారాం పోటీ పడుతున్నారు. సీతారాం స్పీకర్‌గా ఉన్నప్పటికీ ఆయనకు మంత్రిగా చేయాలన్న కోరిక బలంగా ఉంది. సీఎం జగన్‌ కూడా అందుకు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఇక విజయనగరం నుండి రాజన్న దొర, కోలగట్ల వీరభద్రస్వామి పేర్లు స్పష్టంగా వినిపిస్తున్నాయి. విశాఖ జిల్లా నుండి గుడివాడ అమర్నాథ్‌, కరణం ధర్మశ్రీ, ముత్యాల నాయుడు, తూర్పు గోదావరి నుండి దాడిశెట్టి రాజా, జెక్కంపూడా రాజా, పొన్నాడ సతీష్‌, కొండేటి చిట్టిబాబు, పశ్చిమ గోదావరి గ్రంథి శ్రీనివాస్‌, కారుమూరి నాగేశ్వరరావు, ప్రసాద రాజు, బాలరాజు, తలారి వెంకట్రావు పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఇక రాష్ట్ర రాజకీయ రాజధాని కృష్ణా జిల్లా నుండి సామినేని ఉదయ భాను, కొలుసు పార్థసారథి, జోగి రమేష్‌, మల్లాది విష్ణు పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. రాష్ట్ర రాజధాని గుంటూరు జిల్లా నుండి ఆళ్ల రామకృష్ణా రెడ్డి, మర్రి రాజశేఖర్‌, ముస్తఫ, అంబటి రాంబాబు, పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి, విడదల రజని, ప్రకాశం జిల్లా నుండి మద్దిశెట్టి వేణుగోపాల్‌, టీజేఆర్‌ సుధాకర్‌ బాబు, అన్నా రాంబాబు పేర్లు ప్రచారంలో ఉన్నాయి. నెల్లూరు జిల్లా నుండి కాకాని గోవర్ధన్‌ రెడ్డి, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్‌రెడ్డి పేర్లు సీఎం జగన్‌ పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. చిత్తూరు జిల్లాకు ఆర్కే రోజా, భూమన కరుణాకర రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఇక సీఎం సొంత జిల్లా కడప జిల్లా నుండి కోరుమట్ల శ్రీనివాసులు, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, అనంతపురం జిల్లా నుండి అనంత వెంకట్రామి రెడ్డి, కాపు రామచంద్రా రెడ్డి, జొన్నలగడ్డ పద్మావతి, ఉషశ్రీ చరణ్‌, కర్నూలు జిల్లా నుండి శిల్పా చక్రపాణి రెడ్డి, సాయిప్రసాద రెడ్డి, ఆర్థర్‌, బాల నాగిరెడ్డి పేర్లు ప్రస్ఫుటంగా వినిపిస్తున్నాయి.


వారికోసం ప్రత్యేక పదవులు?
ప్రస్తుతం అటువంటి సక్సెస్‌ మంత్రుల జాబితాను జగన్‌ ప్రత్యేకంగా సిద్ధం చేస్తున్నారు. వారందరికీ ప్రభుత్వంలో మరో కీలక బాధ్యతలు అప్పగించే దిశగా ఆలోచన చేస్తున్నారు. వాస్తవానికి ప్రస్తుత మంత్రివర్గంలో ఉన్న ఆరేడు మంది మంత్రులను తిరిగి కొనసాగించాలని సీఎం జగన్‌ భావిస్తున్నప్పటికీ పార్టీలో అసంతృప్తి వస్తుందన్న ఉద్దేశ్యంతో మంత్రివర్గం మొత్తాన్ని మార్పులు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అటువంటి మంత్రుల సేవలను మరో రకంగా ఉపయోగించుకునే దిశగా సీఎం జగన్‌ వారి కోసం ప్రత్యేక పదవులను కూడా కల్పించబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలియవచ్చింది. రాష్ట్ర పరిశ్ర మలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డితో పాటు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్‌రెడ్డి, పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉపముఖ్యమంత్రి, రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌, పౌరసరఫరాల శాఖ మంత్రి నాని తదితరులు అనేక సందర్భాల్లో సీఎం వద్ద పనిచేసే మంత్రులుగా పేరు తెచ్చుకున్నారు. వీరందరితో పాటు మరికొంతమందికి మంత్రివర్గ విస్తరణ అనంతరం ప్రాధాన్యత కలిగిన కీలక పగ్గాలు అప్పగించబోతున్నట్లు పార్టీ వర్గాల్లో పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement