Wednesday, May 1, 2024

Andhra Pradesh – దేశంలో మోడీ ఓడితేనే, చీకటి రాజ్యం పోతుంది… సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు

తాడేపల్లి – రాష్ట్రంలో సామాన్యుడికి 500 రూపాయల నుండి 800 రూపాయల వరకు విద్యుత్ ఛార్జీలు వసూలు చేయడం దుర్మార్గమని, రాబోయే రోజులలో మరో విద్యుత్ పోరాటం కొనసాగుతుందని సిపిఎం ఎపి రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు అన్నారు. గుంటూరు జిల్లా, తాడేపల్లి మండలం, తాడేపల్లి మండల తాసిల్దార్ కార్యాలయం వద్ద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యలు, స్థానిక సమస్యలు పరిష్కరించాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజా ధర్నా జరిగింది. సిపిఎం తాడేపల్లి పట్టణ కార్యదర్శి బూరగా వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ ప్రజా ధర్నాకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ముఖ్యఅతిథిగా విచ్చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వారం రోజులుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకించాలని కోరుతూ సిపిఎం శ్రేణులు విస్తృత ప్రచారాన్ని నిర్వహించారని అన్నారు. తాను అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు పెంచబోనని నమ్మబలికి, అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోడీ విధానాలను తూచా తప్పకుండా పాటిస్తూ, ప్రజలపై అనేక భారాలు వేశారని ఆయన విమర్శించారు. ట్రూ అప్ చార్జీల పేరుతో సామాన్యుడి నడ్డి విరిచేందుకు ప్రజలపై విద్యుత్ బారాలు వేయడం దుర్మార్గమన్నారు. అదేవిధంగా స్మార్ట్ మీటర్ల పేరుతో అదపు భారాలు వేసి, ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేసి, కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. అంతేకాకుండా 7000 రూపాయలు అయ్యే స్మార్ట్ మీటర్ వ్యవసాయ మోటార్లకు 24 వేల రూపాయలు, సామాన్య ప్రజల ఇంటికి 32 వేల రూపాయలు వసూలు చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకున్నాయని ఆయన విమర్శించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో రైతులు, కౌలు రైతులు, మైక్రో ఫైనాన్స్ బాధితులు మాత్రమే ఆత్మహత్యలు చేసుకున్నారని, రానున్న రోజులలో విద్యుత్ బిల్లులు చెల్లించలేక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి దాపురిస్తుందని ఆయన మండిపడ్డారు.

ఆనాడు బషీరాబాగ్ లో విద్యుత్ పోరాటం లో మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి పాల్గొని, విద్యుత్తు బిల్లులు పెంచబోమని చెప్పారని అన్నారు. కానీ నేడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కేంద్ర బిజెపి ప్రభుత్వం నరేంద్ర మోడీ నాయకత్వంలో అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలనుతూచా తప్పకుండా పాటించడమే కాక, వ్యవసాయ మోటార్లకు విద్యుత్ మీటర్లు పెట్టేందుకు పూనుకోవడం దుర్మార్గమన్నారు. దీనివలన రైతాంగం పూర్తిగా నష్టపోతుందని వ్యవసాయరంగం దెబ్బతింటుందని ఆయన అన్నారు. 25 పైసలకు ఒక యూనిట్ ఉత్పత్తి అయ్యే విద్యుత్తును రెండు రూపాయల 40 పైసలకు ప్రవేట్ గా కొనుగోలు చేయటం దారుణమన్నారు. ఒక యూనిట్ విద్యుత్తు రూపాయికి ప్రజలకు అందించాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు.

- Advertisement -

అదేవిధంగా రాష్ట్రంలో రాజధాని విషయం తేల్చకుండా, మూడు రాజధానుల పేరుతో రాజకీయం చేయడం తగదని ఆయన హెచ్చరించారు. ఇళ్ల స్థలాల పంపిణీ పేరుతో రాజధానిలో రాజకీయ క్రీడ లో సామాన్య ప్రజలను బలి చేయొద్దని ఆయన అన్నారు. దేశంలో పార్లమెంట్ వ్యవస్థను తీసివేసి, అధ్యక్ష తరహా పరిపాలన తీసుకొచ్చేందుకు మతోన్మాద బిజెపి ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. దేశంలో మోడీ రాజ్యం పోతేనే చీకటి రాజ్యం పోతుందని, సమానత్వ రాజ్యం కావాలని సిపిఎం పోరాటం చేస్తుందన్నారు. రాబోయే 2024 ఎన్నికలలో దేశంలో మతోన్మాద బిజెపిని గద్దిరించి, రాష్ట్రంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి గుణపాఠం నేర్పాలని ఆయన అన్నారు. మంగళగిరి నియోజకవర్గంలో సుమారు 20 వేల పైబడి ఇల్లు లేని నిరుపేదలు ఉన్నారని సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి పాశం రామారావు అన్నారు.

పిడబ్ల్యుడి కట్టల మీద, ఫారెస్ట్ ప్రాంతాలలో, రాజధాని ప్రాంతాలలో ఇల్లు వేసుకుని జీవించే పేదలకు ఉన్నచోటనే ఇళ్ల పట్టాలు ఇవ్వాలని సిపిఎం డిమాండ్ చేస్తుందని రామారావు అన్నారు. అనంతరం తాడేపల్లి మండలంలో ని వివిధ గ్రామాలలో, తాడేపల్లి పట్టణ ప్రాంతంలో ఉన్నచోటనే ఇళ్ల పట్టాలు ఇవ్వాలని, స్థానిక సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తాడేపల్లి మండల డిప్యూటీ తాసిల్దార్ కు వివిధ గ్రామాల సిపిఎం నాయకులు వినతి పత్రాలను అందజేశారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర నాయకులు భాస్కరయ్య, సూర్యారావు, సిపిఎం రాజధాని కార్యదర్శి మెరుగు మాల రవి, సిపిఎం సీనియర్ నాయకులు జొన్న శివశంకరరావు, సిపిఎం తాడేపల్లి మండల కార్యదర్శి దొంతి రెడ్డి వెంకటరెడ్డి, వేముల దుర్గారావు, సిపిఎం మండల నాయకులుకాట్రగడ్డ శివరామకృష్ణయ్య, కాజా వెంకటేశ్వరరావు, పల్లె కృష్ణ,కాట్రగడ్డ శివన్నారాయణ,బొప్పన గోపాలరావు, కే జేమ్స్,సిపిఎం పట్టణ నాయకులు కొట్టే కరుణాకర రావు, సోలా ముత్యాలరావు, దొంతి రెడ్డి విజయభాస్కర రెడ్డి, అడ్డగట్ల శౌరి భర్తలోమ్, రాజధాని సిపిఎం నాయకులు ఈమని రామారావు, ఎస్.కె ఎర్ర ఫీర్, వల్లభాపురం వెంకటేశ్వరరావు. బి శివారెడ్డి,,ఐద్వా నాయకురాలు దొంతి రెడ్డి శ్రీనివాస కుమారి, పి గిరిజ, ఉష,తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement