Tuesday, May 21, 2024

జేఎన్టీయూలో ఎమ్మెల్సీ కౌంటింగ్ సెంటర్.. ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్

అనంతపురము, ప్రభ న్యూస్ బ్యూరో: కడప- అనంతపురం- కర్నూలు జిల్లాల పట్టభద్రుల, ఉపాధ్యాయ మరియు అనంతపురం స్థానిక సంస్థల నియోజకవర్గ శాసనమండలి ఎన్నికల ఓట్ల లెక్కింపుకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాల్సిందిగా సంబంధిత అధికారులను రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ కేతన్ గార్గ్ ఆదేశించారు. శనివారం ఉదయం స్థానిక జేఎన్టీయూలో కౌంటింగ్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు సంబంధిత అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. కడప- అనంతపురం- కర్నూలు జిల్లాల పట్టభద్రుల,ఉపాధ్యాయ మరియు అనంతపురం స్థానిక సంస్థల నియోజకవర్గ శాసనమండలి ఎన్నికలకు సంబంధించి బ్యాలెట్ బాక్స్ లు భద్రత, స్ట్రాంగ్ రూమ్ ఎంపిక, ఓట్ల లెక్కింపుకు అవసరమయ్యే గదులు, అక్కడ వసతుల ఏర్పాట్లు, బ్యారికేడింగ్ తదితర అంశాలపై ఆయన అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. ఎన్నికలకు సంబంధించి మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ , దానికి తగిన ఏర్పాట్లు వెహికల్ పార్కింగ్ కు సంబంధించి, స్థల పరిశీలన చేసి సరైన బారికేట్లతో ఏర్పాట్లు చేపట్టాలని పోలీసు వారిని ఆదేశించారు. అదే విధంగా స్ట్రాంగ్ రూమ్ నందు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి సీసీ కెమెరాలు ఎల్లవేళలా కౌంటింగ్ పూర్తయ్యే వరకు పర్యవేక్షణలో ఉంచాలని వీడియోగ్రఫీ ని కూడా ఏర్పాటు చేయాలని తెలిపారు. కౌంటింగ్ హాల్లో సరైన క్రమంలో టేబుల్స్, ఫెన్సింగ్, రెండు వైపులా రాకపోకలు ఉండేలా ఏర్పాటు చేయాలని, చీఫ్ ఎలక్షన్ కమిషన్ జారీ చేసిన సూచనలు మేరకు కౌంటింగ్ సక్రమంగా జరపాలని సంబంధిత అధికారులకు తెలిపారు. కౌంటింగ్ కేంద్రముల బందోబస్తు, గార్డ్, వెహికల్ పార్కింగ్ విషయ్ పోలీసు అధికారులతో చర్చించారు. దానితో పాటుగా రెవెన్యూ అధికారులకు కౌంటింగ్ కేంద్రాలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాల‌ని ఆదేశించారు. జేఎన్టీయూలో కౌంటింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్టు కళాశాల ప్రిన్సిపాల్ కు లేఖను పంపాల్సిందిగా డి ఆర్ ఓ కు సూచించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ గాయత్రి దేవి, అనంతపురము రెవెన్యూ డివిజినల్ అధికారి మధుసూదన్, జేఎన్టీయూ ప్రొఫెసర్ చంద్రమోహన్ రెడ్డి, ఆర్ అండ్ బిఎస్ఈ ఓబుల్ రెడ్డి, ఈఈ ప్రసాద్ రెడ్డి, డిఈ బాల కాటమయ్య, నోడల్ అధికారులు నాగేశ్వర్ రెడ్డి ,హరికుమార్ ,స్థానిక తహశీల్దార్ శ్రీధర్ మూర్తి, పోలీసు అధికారులు,తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement