Friday, April 26, 2024

AP : సెల్ఫ్ అవుట్! వైసీపీకి రాయుడు గుడ్‌ బై…

గుంటూరు మిర్చి ఘాటు దెబ్బతో .. వైసీపీ ఖంగుతింది. క్రికెట్ స్టార్ కదా.. స్టార్ క్యాంపెయిన‌ర్‌గా ఉపయోగ పడతాడని భావిస్తే.. కుర్చీ మడిచి కొట్టాడు… మన క్రికెట్లో పరుగులు వీరుడు అంబటి రాయుడు. అకస్మాత్తుగా హిట్ వికెట్ తో పెవిలియన్ కు చేరుకున్నారు. ఇక ఈ రాజకీయ టోర్నీలో ఇప్పుడిప్పుడే ఆడలేనని, సెకండ్ ఇన్నింగ్స్లోనే తనకు తానుగా డకౌట్ కావటాన్ని క్రికెట్ అభిమానులు మాత్రం మురిసి పోయారు. ఆయనను ప్రశంసించారు. మద్దతూ పలికారు. ఇంతకీ ఏం జరిగింది?

వైఎస్సార్‌సీపీ నుంచి మాజీ క్రికెటర్ అంబటి రాయుడు తనకు తానుగా సెలవు ప్రకటించుకున్నారు. పదిరోజుల కిందట సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువ కప్పుకున్న రాయుడు శనివారం .. తాను వైఎస్సార్‌సీపీని వీడుతున్నట్లు ప్రకటించారు. వైఎస్సార్‌సీపీ నుంచి బయటకు రావాలని నిర్ణయించుకున్నానని.. కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉండాలని భావిస్తున్నట్టు ట్విట్టర్ ఖాతాలో తెలిపారు. త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడిస్తానని చెప్పారు. వైఎస్సార్‌సీపీలో చేరిన పది రోజుల్లోనే పార్టీని అంబటి రాయుడు వీడటం సంచలనంగా మారింది. డిసెంబర్ 28న తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో రాయుడికి వైఎస్సార్‌సీపీ కండువా కప్పిన సీఎం జగన్‌ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌ రెడ్డి పాల్గొన్నారు.రాజకీయాలతో తన సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభిస్తున్నట్లు రాయుడు వారం కిందట ప్రకటించారు.

సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరటం సంతోషంగా ఉందని తెలిపారు. మొదటి నుంచి జగన్ మీద మంచి అభిప్రాయం ఉందని.. ఆయన కులమతాలు, రాజకీయాలతో పనిలేకుండా పారదర్శకంగా పాలన చేస్తున్నారని ప్రశంసించారు. అందుకే ఆయనకు మద్దతుగా గతంలో ట్వీట్లు పెట్టారు.

అంత ఈజీ కాదు గురూ
రాజకీయాలంటే.. క్రికెట్ మైదానం కాదు. ఓటర్లు క్రికెట్ ప్రియులూ కాదు. పిచ్లో బ్యాట్ పట్టుకుంటే ఎదురొచ్చే ఫాస్ట్ , స్పిన్ బౌలర్ల తాకిడి వేరు. గుగ్లీలు తిప్పినా సింగిల్స్తో బయట పడతాం. బౌన్నర్లను తల మీదుగా సిక్స్ బాదవచ్చు. ఇన్ స్వింగ్, అవుట్ స్వింగుల్ని కట్ చేసి బౌండరీకి తరలించవచ్చు. కానీ రాజకీయ మైదానంలో సొంత బ్యాటింగ్ ఉండదు. అఫెన్స్ కుదరదు. ఢిఫెన్స్ చాన్స్ లేదు. అంతా స్టాండ్ బై యాక్షనే. కార్యకర్తలకు బిర్యానీ ఇవ్వాలని, క్వార్టర్ సీసా తప్పని సరి. పోలింగ్ రోజు నోటు ఇవ్వాల్సిందే. ఎంపీగా పోటీ చేస్తే 50 కోట్లు చాలవు. క్రికెటర్గా బీసీసీఐ ఇచ్చిన ఫీజు, కాస్తో కూస్తో యాడ్ ల ఆదాయం ఈ ఎలక్షన్ కు సరిపోదు. ఈ స్థితిలో గుంటూరు నుంచి పోటీ చేసే అభ్యర్థికి క్యాంపైన్ స్టార్గా ఊళ్లు పట్టుకు తిరగాలి. ఇదీ అసలు భవిష్యత్తు. అందుకు సెల్ఫ్ ఔటే బెస్ట్ అనిపించిందేమో.. వైసీపీకి అంబటి టాటా చెప్పాడని రాజకీయ పరిశీలకుల విశ్లేషణ. ఎలాగూ రాయుడు ఈ కథను విభిన్న కోణాల్లో వినిపిస్తారు.. ఇది ఖాయమట.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement