Monday, May 6, 2024

AP | పార్టీ వర్గాలకు ఊపు – సానుభూతి మదుపు.. విజ‌యవంతంగా ‘నిజం గెలవాలి’ యాత్ర

తిరుపతి, ( రాయలసీమ ప్రభన్యూస్ బ్యూరో ) : చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి నిజం గెలవాలి అంటూ తిరుపతి జిల్లాలో మూడు రోజుల పాటు నిర్వహించిన యాత్ర.. రాబోయే ఎన్నికలకు సానుభూతిని కూడగట్టెందుకు ఉపకరించింది. మరోవైపు చంద్రబాబు అరెస్టుతో నిస్తేజంగా మారిన పార్టీ వర్గాలకు ఊపు నిచ్చింది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్కిల్ స్కాం ఆరోపణలతో అరెస్టు అయి దాదాపు 50 రోజులు గా రాజమండ్రి జైలులో ఉన్న నేపథ్యంలో ఆ పార్టీ గత నెలన్నర రోజులుగా పలు రకాల ఆందోళనలు, ప్రదర్శనలు చేస్తున్న విషయం తెలిసిందే.

ఒకటి రెండురోజుల్లో తమ అధినేత బయటకు వస్తారని తెలుగుదేశం వర్గాల్లో తొలుత కలిపించిన ధీమా రోజులు గడిచే కొద్దీ తగ్గుతోంది. రాబోయే ఎన్నికలకు ఇబ్బందిగా పరిణమించే ఈ సమస్య ను ఆదిగమించే క్రమంలోనే ఎప్పుడూ రాజకీయ వేదికల పై కనిపించని నారా భువనేశ్వరి రంగంలో దిగాల్సి వచ్చింది. చంద్రబాబు స్వగ్రామ మైన నారావారిపల్లె లో ఈ నెల 25 వ తేదీన నిజం గెలవాలి అనే పేరుతో బస్సు యాత్ర ప్రారంభించారు. ఆ సందర్బంగా ముందురోజు తిరుమలేశుని దర్శించుకున్న విషయాన్ని ఎక్స్ (ట్విటర్) ఖాతాలో తెలియచేస్తూ తొలిసారిగా ఒంటరిగా రావాల్సి రావడం ఆవేదన కలిగించిందని పేర్కొన్నారు.

ఆ అంశానికి తెలుగుదేశం సోషియల్ మీడియా ప్రచారం కలిగించింది. బస్సు యాత్రలో భాగంగా తొలిరోజు చంద్రగిరి, రెండోరోజు తిరుపతి, మూడో రోజు శ్రీకాళహస్తి నియోజకవర్గాలలో మహిళలతో ఏర్పాటు చేసిన సభల్లో ప్రసంగించారు. ప్రతి చోటా చంద్రబాబు ను అక్రమంగా అరెస్టు చేశారని వివరిస్తూ ఆయన తొలి నుంచి ప్రజల కోసం పదే తాపత్రయం గురించి వివరించారు. చంద్రబాబు అరెస్టు తో తన కుటుంబం ఒక్కో చోట ఒక్కొక్కరు అయిన తీరును హృద్యంగా వివరించారు.

- Advertisement -

తాను రాజకీయాలు మాట్లాడడానికి రాలేదంటూనే పనిలో పనిగా వై ఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అరాచక పాలన కు చరమ గీతం పలకాలనీ పిలుపునిచ్చారు. ఆ సభలలో పాల్గొన్న తెలుగుదేశం నాయకులు, నాయకురాళ్లు యధావిధిగా రాష్ట్ర ప్రభుత్వ విధానాలను తూర్పార పట్టి వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ని గెలిపించాల్సిన అవసరాన్ని తెలియచేశారు. ఈ కార్యక్రమాలకు జనసేన పార్టీ కూడా మద్దతు ప్రకటించింది.

కొందరు నాయకులు ఆ సభల్లో పాల్గొని ప్రసంగించారు. సభల్లో కొందరు మహిళలతో అడిగించిన ప్రశ్నలకు భువనేశ్వరి ఇచ్చిన జవాబులు కూడా చంద్రబాబు అరెస్టు తమను ఎంత కలిచివేసిందో చాటి చెప్పడానికి ఉపకరించింది.ఇదికాక చంద్రబాబు అరెస్టు కారణంగా మరణించిన అభిమానుల కుటుంబాలను పరామర్శించి రూ 3 లక్షల చొప్పున పంపిణీ చేసారు.అన్నిటిని మించి నిజం నిగ్గుతేలి చంద్రబాబు త్వరలో విడుదల అయిపోతారని చెప్పడం ద్వారా పార్టీ వర్గాల్లో భువనేశ్వరి ధీమా ఇవ్వగలిగారు.

ఈ అంశాల కోణంలో చూసినప్పుడు తిరుపతి జిల్లాలో ఈ రోజు ముగిసిన మూడురోజుల నిజం గెలవాలి బస్సు యాత్ర చంద్రబాబు అరెస్టు పై ఆయా ప్రాంతాల్లోని ప్రజలలో సానుభూతి ని రగిలించడంలో విజయవంతం అయింది. మరో వైపు చంద్రబాబు అరెస్టుతో నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటూనే ఆయన విడుదల పై అనుమానం తో డీలా పడిపోయిన పార్టీ వర్గాల్లో కొంత ధీమా పెంచడంలో యాత్ర సఫలమైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement