Sunday, April 28, 2024

AP: 54 అడుగుల కుమారస్వామి విగ్రహావిష్కరణ

చంద్రగిరి (రాయలసీమ ప్రభన్యూస్ బ్యూరో) : తిరుపతి జిల్లా.. చంద్రగిరి నియోజకవర్గంలోని పాకాల మండలం ఊట్లవారి పల్లిలో కొలువుదీరిన శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో 54 అడుగుల శ్రీ సుబ్రహ్మణ్వేశ్వర స్వామి విగ్రహ ఆవిష్కరణ ఈరోజు జరిగింది. ఈ సందర్బంగా మహా సంప్రోక్షణలతో జరిగిన విగ్రహావిష్కరణ కార్యక్రమానికి భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. హరోం హర నామస్మరణలతో ఊట్లవారి పల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది.

ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి భక్తితో 100 మెట్లను మోకాళ్ళతో ఎక్కి ఆలయాన్ని చేరుకున్నారు. దాతల సహాయ సహకారాలతో ప్రతిష్టించిన విగ్రహావిష్కరణ కార్యక్రమంలో భాస్కర్ రెడ్డితో పాటు ఆయన కుమారుడు తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ (తుడా) ఛైర్మెన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి విశిష్ట అతిధులుగా హాజరయ్యారు. వారికి ఆలయ మర్యాదలతో అర్చకులు స్వాగతం పలికి స్వామివారి దర్శనం చేయించారు. స్వర్ణ కాంతులీనే ఇటువంటి 54 అడుగుల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం రాష్ట్రంలో రెండవదని నిర్వాహకులు తెలిపారు. ఆగమోక్తంగా ఆలయ ఛైర్మెన్ మహా సముద్రపు పట్టాభిరెడ్డి నేతృత్వంలో జరిగిన విగ్రహావిష్కరణ తదితర వైదిక కార్యక్రమాలలో విశేష సంఖ్యలో తరలివచ్చిన భక్తులు శ్రీ సుబ్రమణ్య స్వామి ఆశీస్సులు పొందారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement