Saturday, April 27, 2024

రైల్వే బ‌డ్జెట్ లో గోదావ‌రి జిల్లాకు పెద్దపీట‌..

తాజా రైల్వే బడ్జెట్‌ గోదావరి జిల్లాలకు గొప్ప వరాల్ని కురిపించింది. ఈ జిల్లాల వాసుల సుదీర్ఘ కాల స్వప్నాల్ని ఇది సాకారం చేసింది. ఈ బడ్జెట్‌లో కోటిపల్లి-నర్సాపురం రైల్వేలైన్‌ నిర్మాణానికి 358కోట్లు కేటాయించారు. అలాగే విజయవాడ నుంచి గుడివాడ, భీమవరంల మీదుగా అటు నర్సాపూర్‌, ఇటు నిడదవోలు వరకు రైల్వేలైన్ల విద్యుద్దీకరణ, డబులింగ్‌ పనులకు ఏకంగా 1681కోట్లు ఇచ్చారు. ఈ రెండు ప్రాజెక్టులు ఈ ఏడాది దాదాపుగా పూర్తికాను న్నాయి. మూడ్నాలుగు మాసాల్లోనే విజయవాడ, భీమవరం, నిడదవోలు రైల్వేలైన్‌ డబులింగ్‌ పనుల్తో పాటు విద్యుద్దీకరణ కూడా పూర్తికానుంది. ఈ లైన్‌లో ఇప్పటికే విజయవాడ నుంచి భీమవరం వరకు పనులు తుదిదశకు చేరుకున్నాయి. భీమవరం నుంచి అటు నర్సాపూర్‌, ఇటు నిడదవోలు వరకు పనులు ఇప్పటి వరకు నెమ్మదిగా సాగాయి. తాజా బడ్జెట్‌ కేటాయింపుల్తో ఈ పనులు కూడా వేగం పుంజు కుంటాయి. జూన్‌లోగా పనులు పూర్తికానున్నాయి. ఇవి పూర్తయితే రాజ మండ్రి-విజయవాడ మధ్య సమాంతర రైల్వే వ్యవస్థ అందుబాటులొకి వచ్చేస్తుంది. ఓ వైపు ఏలూరు మీదుగా డబులింగ్‌ ఎలక్ట్రిఫైడ్‌ రైల్వేలైన్‌ ఉండగా ఇప్పటి వరకు నిడదవోలు నుంచి భీమవరం మీదుగా విజయవాడ వెళ్తున్న లూప్‌లైన్‌ సింగిల్‌లైన్‌గా ఉంది.

ఈరూట్‌లో ఎలక్ట్రిఫికేషన్‌ లేనందున డీజిల్‌ ఇంజన్‌తోనే రైళ్ళను నడపాల్సొస్తోంది. ఈకారణంగా ఈ రూట్లో తిరిగే రైళ్ళు తీవ్ర ఆలస్యమౌ తుంటాయి. అలాగే ప్రయాణానికి ఎక్కువ సమయం తీసుకుంటాయి. ప్రతి రైల్వేస్టేషన్‌లో ఎదురొచ్చేరైలుకు క్రాసింగ్‌ నిమిత్తం తప్పనిసరిగా ఆగాల్సొస్తుంది. డబులింగ్‌తో పాటు ఎలక్ట్రిఫికేషన్‌ పనుల్ని దశాబ్ధం క్రితమే మంజూరు చేశారు. అంచెలంచెలుగా విజయవాడ నుంచి గుడివాడ మీదుగా మచిలీపట్నం వరకు ఈ ప నులు పూర్తయ్యాయి. అనంతరం గుడివాడ నుంచి ఆకివీడు వరకు గతంలోనే పూర్తి చేశారు. కొన్ని మాసాల క్రితమే ఆకివీడు-భీమవరం మధ్య కూడా పనులు తుదిదశకు చేరుకున్నాయి. ఇక భీమవరం నుంచి ఇటు నిడదవోలు వరకు పనులు పూర్తయితే ఈ మార్గంలో వేగంగా ప్రయాణించే వెసులుబాటు అందుబాటులో కొస్తుంది. విశాఖ-విజయవాడ మధ్య మరిన్ని రైళ్ళు నడిపే అవకాశం కలుగుతుంది. అలాగే కాకినాడ నుంచి కోటిపల్లి వరకు గతంలో పునరుద్దరించిన రైల్వేమార్గాన్ని నర్సాపురం వరకు పొడిగించాలన్న డిమాండ్‌ కూడా ఏళ్ళ తరబడుంది. దివంగత లోక్‌సభ స్పీకర్‌ బాలయోగి హయాంలో అప్పటి రైల్వేమంత్రిగా పని చేసిన మమతాబెనర్జీ కోటిపల్లి నుంచి నర్సాపురం వరకు రైల్వేలైన్‌ నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. అనంతరం ఈ ప్రాజెక్ట్‌ చాలా ఆలశ్యమైంది. తిరిగి ఇటీవలె తిరిగి జోరందుకుంది. ఇప్పుడిప్పుడే నిధులు విడుదల పెరిగింది. దీంతో కోటిపల్లి నుంచి ముక్తేశ్వరం మధ్యలో గోదావరిపా యపై వంతెన నిర్మాణం జరుగుతోంది. తాజాగా మంజూరు చేసిన నిధుల్తో నర్సాపురం వరకు రైల్వేలైన్‌ పూర్తికాదు. కానీ కాస్తో కూస్తో పనుల్లో కదలికొస్తుంది. ఈమార్గంలో గోదావరిపాయలపై మూడుచోట్ల భారీ వంతెనల నిర్మాణం అవసరం. ఒక్కోదానికి మూడొందల కోట్లకు పైగా వ్యయమౌతుందని అంచనాలేశారు. కోటిపల్లి-నర్సాపురం మధ్య రైల్వేలైన్‌ నిర్మాణం పూర్తయితే కాకినాడ నుంచి నేరుగా కోటిపల్లి-నర్సాపురం మీదుగా విజయవాడ వెళ్ళేందుకు మరో ప్రత్యామ్నాయ రైల్వేమార్గం అందుబాటులోకొస్తుంది. అలాగే కోనసీమ వాసుల రైల్వేకల సాకారమౌతుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement