Thursday, May 2, 2024

వరి పంట తగ్గడంతో.. పశువుల మేతకు కష్టకాలం..

తెలంగాణ వ్యవసాయ రంగంలో చోటుచేసుకుంటున్న మార్పులతో పశువులకు తీవ్ర ఇబ్బందులు తప్పేట్టు లేవని పరిస్థితుల దృష్ట్యా స్పష్టమవుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో యాసంగి సీజన్‌లో వరి సాగును తగ్గించాలని ప్రభుత్వం, వ్యవసాయ శాఖ నిర్ణయించడంతో దీని ఎఫెక్ట్‌ పశువులకు అవసరమైన పశుగ్రాసంపై పడుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పశుగ్రాసం కొరతతో పల్లెల్లో పాల దిగుబడికి ఆటంకం కలగడంతో పాటు నష్టం వాటిల్లుతుందని రైతులు వాపోతున్నారు. ఇప్పటికే వ్యవసాయంలో యాంత్రీకరణ పెరగ డంతో గడ్డి దిగుబడి పూర్తిగా తగ్గిపోయింది. పైగా యంత్రంతో కోసిన వరి నుంచి వచ్చే గ్రాసం ఎక్కువ రోజులు నిల్వ ఉండకపోవడంతో రైతులకు గ్రాసం కొరత ఏర్పడడంతో పాటు గడ్డి ధర అమాంతం పెరుగుతోంది. ప్రస్తుతం ఒక్క గడ్డి కట్ట ధర రూ.150 పలుకుతుందంటే అతిశయోక్తికాదు. దీంతో ఈ యాసంగిలో వరి సాగు తగ్గిస్తున్న నేపథ్యంలో గ్రాసం కొరత ఏర్పడడంతో పాటు పాలు, పాల ఉత్పత్తులపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని పలువురు నిపుణులు అంటున్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో మూగజీవాలకు అవసరమైన మేత లేక వెతలు పడుతుండగా, తాజాగా ప్రభుత్వ నిర్ణయంతో వరి సాగు తగ్గుతోంది. వాస్తవానికి దేశ వ్యాప్తంగా ఉన్న నిల్వల దృష్ట్యా వరిని తగ్గించాలని ప్రభుత్వం భావించినప్పటికీ, మూగజీవాలకు అవసరమైన పశుగ్రాసంపై ప్రత్యేక చర్యలు లేకపోవడంతో ఇప్పటికే రాష్ట్రంలో పశుగ్రాసం కొరతను రైతులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం తెలంగాణలో ఒక్క గడ్డి కట్ట ధర రూ.150 పలుకుతుంది. దీన్ని రవాణా చేసేందుకు ట్రాక్టర్‌కు రూ.10వేల నుంచి 15 వేలు వెచ్చించాల్సి వస్తోంది. మొత్తంగా ట్రాక్టర్‌ లోడ్‌ గడ్డిని కొనుగోలు చేయాలంటే సుమారు 25వేల వరకు వెచ్చించాల్సి రావడంతో భారంగా మారింది.

ప్రస్తుతం వ్యవసాయంలో యాంత్రీకరణ పెరగడంతో వరి కోతలకు 80 శాతం రైతులు యంత్రాలనే వినియోగిస్తున్నారు. దీంతో గడ్డి దిగుబడి తగ్గిపో యింది. పశువులకు అవసరమైన గ్రాసం కొరతకు ప్రత్యామ్నాయ చర్యలను తీసుకోక పోతే పశువుల మనుగడ ప్రశ్నార్థకంగా మారనుందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే గ్రాసం ధరలు మరింత పెరిగి, గ్రాసం కొరత తీవ్రమైతే పశువు లన్నింటినీ కబేళాకే విక్రయించుకోవాల్సి వస్తుం దని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సబ్సిడీలో గడ్డి విత్తనాలు..

పశుగ్రాసం పెంచేందుకు ప్రభుత్వం గడ్డి విత్తనాలను సబ్సిడీలో అందిస్తున్నా అది పూర్తిస్థాయిలో అమలు కావడంలేదు. కార్బోహైడ్రేట్స్‌తో పాటు మాంసకృత్తులు అధికంగా ఉండే విత్తనాలను పశు సంవర్ధక శాఖ అధికారులు పశువైద్యశాలల ద్వారా రైతులకు అందిస్తున్నారు. దీనికి సంబంధించి 2020-21లో 2,400 మెట్రిక్‌ టన్నులు, 2021-22లో ఇప్పటివరకు 1,500 మెట్రిక్‌ టన్నుల మేరకు విత్తనాలను అధికారులు రైతులకు అందించారు. ఒక ఎకరానికి 14 నుంచి 16 కేజీల విత్తనాలు అవసరం పడుతుండగా వీటి ద్వారా 8 నుంచి 12 టన్నుల గడ్డి దిగుబడి రానుంది.

- Advertisement -

ఇదిలా ఉండగా గ్రాసానికి అవసరమైన షెడ్లను నిర్మించేందుకు ప్రభుత్వం రాయితీలు ఇస్తున్నా.. కొన్ని చోట్ల మాత్రమే షెడ్లు నిర్మాణం జరగుతున్నాయి. ఇందుకు సంబంధించి ఇప్పటివరకు గొర్రెల షెడ్లు 1,011, పశువుల షెడ్లు 5,909, పౌల్ట్రి షెడ్లు 85 మాత్రమే నిర్మించారు. పలు జిల్లాల్లో గ్రాసం, షెడ్ల నిర్మాణానికి దరఖాస్తులు వస్తున్నా అవి పెండింగ్‌లో ఉంటున్నా యి. ఇప్పటికైనా పశుసంవర్ధక శాఖ అధికారులు గ్రాసం పెంపుపై చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement