Sunday, May 5, 2024

TS: యువతకు ఉపాధి ఇచ్చాం.. యువ సారధ్యానికి అవకాశం ఇస్తాం.. ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్: సింగరేణి సంస్థలో యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించామని, అదే స్పూర్తితో నాయకత్వ సారధ్యంలోనూ యువతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) గౌరవ అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. సింగరేణి ఎన్నికల నేపథ్యంలో టీబీజీకేఎస్ అధ్యక్షుడు బీ వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ కింగర్ల మల్లయ్య బుధవారం హైదరాబాద్ లో కవితని కలిసి అనుసరించాల్సిన వ్యూహాలు, సన్నద్ధత గురించి చర్చలు జరిపారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ… సింగరేణి కార్మికులు, ఉద్యోగుల్లో 50 శాతం ఉన్నారు.. కాబట్టి తమ యూనియన్ లో యువ నాయకత్వానికి ప్రాధాన్యం ఇస్తామని, 66 శాతం వరకు నాయకత్వ బాధ్యతల్లో అవకాశాలు కల్పిస్తామని స్పష్టం చేశారు.1998లో ఆగిపోయిన కారుణ్య నియామకాలను 2018లో కేసీఆర్ తిరిగి పునరుద్ధరించి వేలాది మందిని నియమించారని పేర్కొన్నారు.

జాతీయ సంఘాల కారణంగా 1998 వరకు కారుణ్య నియామకాలకు గండి పడిందన్నారు. కోల్ ఇండియా సంస్థలో సైతం లేని విధంగా కారుణ్య నియామకాల ద్వారా సింగరేణిలో మహిళలకు ఉద్యోగావకాశాలు కల్పించిన ఘనత కేసీఆర్ కు దక్కుతుందని స్పష్టం చేశారు. సింగరేణిని కాపాడుకోవాల్సిన బాధ్యత యువతపై ఉందని నొక్కిచెప్పారు. సంస్థను లాభాల బాట పట్టించడానికి, సంస్థ ఎదుగుదలకు, కార్మికుల సంక్షేమానికి కేసీఆర్ ఎనలేని కృషి చేశారని, సింగరేణిని కష్టాల నుంచి కాపాడిన బీఆర్ఎస్ అనుబంధ సంఘం టీబీజీకేఎస్ ను ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. టీబీజీకేఎస్ ను గెలిపించుకుంటేనే కార్మికులకు న్యాయం జరుగుతుందని, కార్మికుల పక్షాన నిలబడే ఏకైక సంఘం టీబీజీకేఎస్ అని తేల్చిచెప్పారు.

బీఆర్ఎస్ పార్టీ హయాంలో కేసీఆర్ దాదాపు 20వేల డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చి యువతకు ఉపాధి కల్పించారని తెలిపారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా సింగరేణి సంస్థ నికర లాభాల్లో కార్మికులకు భారీ మొత్తంలో వాటాలను పంచారని గుర్తు చేశారు. 1999-2000లో లాభాల్లో కార్మికులకు కేవలం 10 శాతం వాటా ఉండేదని, తెలంగాణ ఏర్పడినప్పుడు 18 శాతంగా ఉండేదని, దాన్ని కేసీఆర్ 32 శాతానికి పెంచారని వివరించారు. తద్వారా కార్మికుల కుటుంబాలకు గణనీయమైన ఆర్థిక ప్రయోజనం లభించిందని తెలియజేశారు. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 నుంచి 61కి పెంచామమని, గతంలో సమ్మె చేస్తే సంస్థ జీతం ఇచ్చేది కాదని, తెలంగాణ ఉద్యమ సమయంలో 35 రోజుల పాటు సాగిన సకల జనుల సమ్మెలో పాల్గొన్న వారికి రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ పూర్తి జీతం ఇచ్చారని ప్రస్తావించారు.

- Advertisement -

కార్మికుల తల్లిదండ్రులకు కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఉచిత వైద్య సౌకర్యం కల్పించడం, క్వార్టర్స్ లో నివసించే వారు బేసిక్ లో 1 శాతం సంస్థకు చెల్లించాలన్న నిబంధనను కేసీఆర్ రద్దు చేశారని, డిపెండెంట్ ఉద్యోగం వద్దనుకుంటే ఆ కుటుంబానికి రూ.25 లక్షలు చెల్లించాలన్న నిర్ణయం, కార్మికులు మెడికల్ అన్ ఫిట్ అయితే వేతన రక్షణ కల్పించడం, సొంత ఇల్లు నిర్మించుకునే వారికి రూ.10లక్షల వరకు సంస్థనే వడ్డీ భరించడం, ఐఐటీ, ఐఐఎం వంటి సంస్థల్లో చదువుకునే కార్మికుల పిల్లలకు ఫీజు రియంబర్స్ మెంట్ వంటి విప్లవాత్మకమైన కార్మిక సంక్షేమ నిర్ణయాలను కేసీఆర్ తీసుకున్నారని కవిత వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement