Saturday, May 4, 2024

TS | రేపు ఉమ్మడి వరంగల్‌కు కేసిఆర్.. ప్రజా ఆశీర్వాద సభల‌కు ముమ్మరంగా ఏర్పాట్లు

ఉమ్మడి వరంగల్‌, ప్రభన్యూస్‌ బ్యూరో: భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఉమ్మడి వరంగల్‌ జిల్లా పర్యటనకు వస్తున్నారు. శుక్రవారం ఖమ్మంతోపాటు ఉమ్మడి వరంగల్‌లోని మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలో, వరంగల్‌ జిల్లా వర్థన్నపేట నియోజకవర్గం భట్టుపల్లిలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాల్గొని మాట్లాడుతారు. ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేసిన తరువాత మొట్టమొదటి ప్రజా ఆశీర్వాద సభను జనగామలో ఏర్పాటు చేయగా సిఎం పాల్గొన్నారు.

దసరా పండుగ అనంతర పర్యటనలో భాగంగా ఉమ్మడి వరంగల్‌లో రెండు సభలను ఒకే రోజు ఏర్పాటు చేశారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని 12 అసెంబ్లి సీట్లకు 12సీట్లను గెలుపే లక్ష్యంగా గులాబీ దళపతి ఎన్నికల పర్యటనను చేస్తున్నారు. మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేస్తున్న ప్రజా ఆశీర్వాద సభను రాష్ట్ర గిరిజనశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ పర్యవేక్షిస్తున్నారు.

మహబూబాబాద్‌ నియోజకవర్గంలో ఏర్పాటు చేసి సభకు నియోజకవర్గం నుంచి 70 వేల మందితో సభను నిర్వహించే విధంగా సన్నాహాలు చేస్తున్నారు. సభా ఏర్పాట్లతోపాటు జన సమీకరణకు సంబంధించిన అన్ని ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 2 గంటలకు మహబూబాబాద్‌లో జరిగే సభలో పాల్గొని సాయంత్రం నాలుగు గంటలకు వర్ధన్నపేట నియోజకవర్గం భట్టుపల్లిలో జరిగే సభలో పాల్గొంటారు.

- Advertisement -

భట్టుపల్లి సభను లక్ష మందికి తగ్గకుండా జనసమీకరణ లక్ష్యంగా వరంగల్‌ జిల్లా బీఆర్‌ఎస్‌ అధ్యక్షులు, వర్థన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌ చేస్తున్నారు. వర్థన్నపేట నియోజకవర్గానికి సంబంధించిన సభను రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పర్యవేక్షిస్తున్నారు. ఎన్నికల వేళ నిర్వహిస్తున్న సభలకు పోలీసులు కూడా పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు.

హ్యాట్రిక్‌ లక్ష్యంగా ముందుకు పోతున్న ఎమ్మెల్యేలు ఆరూరి రమేష్‌, బానోత్‌ శంకర్‌నాయక్‌ ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని వర్థన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌ హ్యట్రిక్‌ లక్ష్యంగా ముందుకు పోతున్నారు. రాష్ట్రంలోనే సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు తరువాత అత్యధిక భారీ మెజారిటీతో గెలుపొందిన ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌. ఈ సారి ఏలాగైన లక్ష మెజారిటీతో గెలుస్తాననే ధీమా వ్యక్తం చేస్తున్నారు ఆరూరి రమేష్‌. అదే విధంగా మహబూబాబాద్‌ ఎమ్మెల్యే బానోత్‌ శంకర్‌ నాయక్‌ రెండు ఎమ్మెల్యేగా గెలిచారు. మూడోసారి గెలిచి హ్యట్రిక్‌ సాధించాలనే గట్టిపట్టుదలతో శంకర్‌నాయక్‌ ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement