Friday, March 1, 2024

Final – తేలిన ఓట్ల లెక్కలు – 71.34% పోలింగ్… మునుగోడులో 91.89 శాతంతో టాప్. .39.64 శాతం ఓటింగ్ తో యాకుత్ పురా లీస్ట్

తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో నమోదైన తుది పోలింగ్‌ శాతాన్ని ఎన్నికల సంఘం శుక్రవారం వెల్లడించింది. 71.34 శాతం పోలింగ్‌ నమోదైనట్టు అధికారులు తెలిపారు.

గురువారం రాత్రి 10.30 గంటల వరకు కొన్ని పోలింగ్‌ కేంద్రాల్లో ఓటర్లు బారులు తీరి ఉండటంతో పోలింగ్‌ శాతం వెల్లడించడంలో ఆలస్యమైంది. 2018లో రాష్ట్రంలో 73.37 శాతం ఓట్లు పోలయ్యాయి. గతంలో కంటే రెండు శాతం పోలింగ్‌ తగ్గింది. రాష్ట్రంలో మొత్తం 3,26,02,793 మంది ఓటర్లు ఉండగా… గురువారం నాటి పోలింగ్‌లో 2,32,59,256 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. వీరిలో 1,15,84,728 మంది పురుషులు, 1,16,73,722 మంది మహిళలు, 806 మంది ఇతరులు ఉన్నారు. నియోజకవర్గాల వారీగా చూస్తే అత్యధికంగా మునుగోడులో 91.89 శాతం ఓటింగ్ జరిగింది. పాలేరులో 90.89, ఆలేరులో 90.77 శాతం పోలింగ్ నమోదైంది.

అత్యల్పంగా యాకుత్ పురాలో కేవలం 39.64 శాతం ఓటర్లు మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. మలక్‌పేట్‌లో 41.32 శాతం, చార్మినార్‌లో 43.27 శాతం, చాంద్రాయణగుట్టలో 45.26 శాతం ఓటింగ్ నమోదైంది. బహదూర్ పురాలో 45.50 శాతం, జూబ్లీహిల్స్ లో 47.49 శాతం, శేరిలింగంపల్లిలో 48.75 శాతం, ఎల్బీనగర్‌లో 49.07శాతం, కంటోన్మెంట్‌లో 49.36 శాతం పోలింగ్ జరిగింది. జిల్లాల వారీగా చూస్తే యాదాద్రి జిల్లాలో అత్యధికంగా 90.36 శాతం పోలింగ్ నమోదైంది. అత్యల్పంగా హైదరాబాద్ జిల్లాలో కేవలం 47.88 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. మేడ్చల్ – మల్కాజ్ గిరిలో 56.17 శాతం, రంగారెడ్డిలో 59.94 శాతం, హన్మకొండలో 68.81 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది

Advertisement

తాజా వార్తలు

Advertisement