Tuesday, May 28, 2024

Nizamabad – జాతీయ ప‌త‌కాన్ని ఆవిష్క‌రించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి …అల‌రించిన సాంస్కృతిక ప్రదర్శనలు

నిజామాబాద్ సిటీ,ఆగస్టు (ప్రభ న్యూస్)15 : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో మంగళవారం 76వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు పండుగ వాతావరణంలో పంద్రాగస్టు కార్యక్రమాలు కొనసాగాయి. వజ్రోత్సవాల ముగింపు వేళ జరుపుకుంటున్న సంబరాలు కావడంతో జిల్లా యంత్రాంగం విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర రోడ్లు- భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించిన మంత్రి వేముల, పుర ప్రముఖులను, అధికార అనధికారులను కలిసి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లా ప్రగతి నివేదికను వివరిస్తూ ప్రజనుద్దేశించి ప్రసంగించారు. వివిధ శాఖల ద్వారా అమలవుతున్న కార్యక్రమాలు, సాధించిన ప్రగతిని తెలిపేలా కొనసాగిన శకటాల ప్రదర్శనను తిలకించారు. నీటి పారుదల, వ్యవసాయ, సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ, విద్యుత్, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ, ఐసీడీఎస్, పశుసంవర్ధక, వైద్యారోగ్య, పోలీస్, రెడ్ క్రాస్ శకటాలు ప్రదర్శనలో పాల్గొన్నాయి. ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు బహూకరించారు. ప్రభుత్వం వివిధ పథకాల కింద మంజూరు చేసిన ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

పంద్రాగస్టు వేడుక సందర్భంగా చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను అలరింపజేశాయి. ఎదనిండా దేశ భక్తిని నింపుకుని జాతీయ స్ఫూర్తి పెంపొందేలా ఆకట్టుకునే రీతిలో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించి ఆహుతుల మన్ననలు అందుకున్నారు. బాల్కొండ కేజీబీవీ వొద్యార్థినులు జయహో జయహో గీతంపై, విశ్వవికాస్ హై స్కూల్ బాలలు ముచ్చటైన మన ఊరి కథ గీతం పై సంప్రదాయ వస్త్ర ధారణతో చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా చిన్నారులను మంత్రితో పాటు అతిథులు, జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేకంగా అభినందించారు. వేడుకలను పురస్కరించుకుని జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు మంత్రి ప్రశాంత్ రెడ్డి రెగ్యులరైజేషన్ కు సంబంధించిన నియామక ఉత్తర్వులు అందజేశారు.

ఈ వేడుకల్లో జెడ్పి చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు, ఎమ్మెల్యేలు బిగాల గణేష్ గుప్తా, ఆశన్నగారి జీవన్ రెడ్డి, నగర మేయర్ నీతూకిరణ్, డీసీసీబీ చైర్మన్ భాస్కర్ రెడ్డి, రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ డి.రాజేశ్వర్, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, జిల్లా జడ్జి కె.సునీత, ఐడీసీఎంఎస్ చైర్మన్ మోహన్, అదనపు కలెక్టర్ పి.యాదిరెడ్డి, నగర పాలక సంస్థ కమిషనర్ ఎం.మకరందు, డీ.సీ.పీ గిరిరాజ, అదనపు డీసీపీ జయరాం, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్రకుమార్, అన్ని శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది, స్వాతంత్ర్య సమరయోధులు, ప్రజలు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement