Wednesday, May 1, 2024

TS – సీటు బెల్ట్ పెట్టుకోక‌పోవ‌డంతోనే ఎముక‌లు విరిగి లాస్య మర‌ణం ..

హైదరాబాద్: సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ భారాస ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతికి సంబంధించిన వివరాలను గాంధీ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. ప్రమాదంలో ఆమె తలకు తీవ్ర గాయాలైనట్లు పోస్టుమార్టం పూర్తిచేసిన అనంతరం వైద్యులు మీడియాకు తెలిపారు. లాస్య నందిత దవడ ఎముక విరిగిందని.. ఎడమ కాలు ఎముక, ఛాతీ ఎముకలు సైతం విరిగాయని పేర్కొన్నారు. ఆమె సీట్లు బెల్ట్ పెట్టుకోక‌పోవ‌డం వ‌ల్లే ఆమెకు బ‌ల‌మైన గాయాలు త‌గిలి ప్రాణాలు పోయాయ‌ని వెల్ల‌డించారు..

లాస్య తప్ప ఆమె కుటుంబ సభ్యులు గురువారం రాత్రి సదాశివపేట (మం) కొనాపూర్‌లోని మిస్కిన్ బాబా దర్గాకి వచ్చారు. కాసేపటికే ఆకాష్‌తో పాటు లాస్య కూడా దర్గాకి వచ్చారు. లాస్య కుటుంబం అంతా రాత్రి 12.30 గంటలకు దర్గాలో పూజలు చేశారని అక్కడి నిర్వాహకులు చెబుతున్నారు. తిరిగి.. అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో హైదరాబాద్‌కు లాస్య కుటుంబం పయనం అయ్యింది. మొక్కులు తీర్చుకున్న తర్వాత.. 3 నుంచి 4 గంటల మధ్య లాస్య బయల్దేరిందని చెప్తున్నారు.

పూర్తిస్థాయి విచారణ తర్వాతే..
సుల్తాన్‌పూర్‌ ఓఆర్‌ఆర్‌ వద్ద కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే కారు ప్రమాదానికి గురైంది. ఘటనాస్థలాన్ని సంగారెడ్డి ఏఎస్పీ సంజీవ రావు, ఆర్టీఏ రామారావు పరిశీలించారు. ఏఎస్పీ సంజీవరావు మీడియాతో మాట్లాడుతూ.. ఉదయం 5:30 గంటలకు ప్రమాదం జరిగినట్టు పోలీసులకు సమాచారం అందింది. కారు శకలాలు 100 మీటర్ల దూరంలో పడి ఉన్నాయి. రెయిలింగ్‌ను ఢీకొట్టడంతో ఆమె ప్రయాణించిన కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. అక్కడిక్కడే ఎమ్మెల్యే లాస్యనందిత మృతి చెందారు. మరో వ్యక్తి ఆకాష్ మియపూర్ లో ప్రయివేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రమాదంపై పూర్తిస్థాయి విచారణ చేసి వివరాలు వెల్లడిస్తాం అని అన్నారాయన. . డ్రైవర్‌ నిద్రమత్తు, వేగమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement