Sunday, April 14, 2024

TS Teachers | పోరుబాటకు సిద్ధమైన ఉపాధ్యాయులు.. ఈనెల 18, 19 తేదీల్లో బైక్‌ ర్యాలీలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఉపాధ్యాయులు పోరుబాటకు సిద్ధమవుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విద్యా, ఉపాధ్యాయ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యుఎస్‌పీసీ) ఆధ్వర్యంలో వివిధ సంఘాలు దశలవారీ పోరాటం నిర్వహించాలని నిర్ణయించాయి. శనివారం హైదరాబాద్‌ దోమలగూడలోని టిఎస్‌ యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో టీఎస్‌యూటీఎప్‌ అధ్యక్షులు కె.జంగయ్య, చావ రవి, టీఎస్‌ఎంఎస్టీఎఫ్‌ అధ్యక్షులు బి.కొండయ్య, ఎస్సీఎస్టీటీఏ అధ్యక్షులు జాదవ్‌ వెంకట్రావ్‌, టీపీటీఎఫ్‌ అధ్యక్షులు వై.అశోక్‌కుమార్‌తో పాటు మరికొంత మంది నేతలు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో విద్యా, ఉపాధ్యాయుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందన్నారు.

పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉందని పేర్కొన్నారు. మొదటి పిఆర్సీ గడువు ముగిసినా పూర్తి స్థాయిలో అమలు జరగనేలేదని, ఇంకా రెండో వేతన సవరణ సంఘం నియామకం కాలేదని మండిపడ్డారు. జాతీయ నూతన విద్యావిధానం- 2020ను రద్దు చేయాలని డిమాండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. విద్యా, ఉపాధ్యాయ రంగ సమస్యలను పరిష్కారించాలని కోరుతూ ఈనెల 18, 19 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా మండల కేంద్రాల్లో బైక్‌ ర్యాలీలు నిర్వహించాలని వారు నిర్ణయించారు. ఆగస్టు 12న జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు, ధర్నాలకు పిలుపునిచ్చారు. సెప్టెంబర్‌ 1న ఛలో హైదరాబాద్‌లో భాగంగా ఇందిరా పార్కు వద్ద ఉపాధ్యాయ మహాధర్నాను చేపట్టనున్నట్లు వారు ప్రకటించారు.

- Advertisement -

ఉమ్మడి రాష్ట్రంలో పోరాడి హక్కుగా సాధించుకున్న నెల మొదటి తేదీన వేతనాలు ఇవ్వాలని, టెజరీల్లో ఆమోదం పొంది ప్రభుత్వం వద్ద నెలల తరబడి పెండింగ్‌లో ఉన్న సప్లిమెంటరీ బిల్లులు, సెలవు జీతాలు, జిపిఎస్‌, టిఎస్‌ జిఎల్‌ఐ క్లైములు, పెన్షనరీ బెనిఫిట్స్‌, పిఆర్సీ బకాయిలు ఇతర బిల్లులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఇహెచ్‌ఎస్‌ పథకాన్ని ఉద్యోగులపై భారం పడకుండా సమర్థవంతంగా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వేలాది ఉపాధ్యాయ పోస్టులను నియామకాల ద్వారా భర్తీ చేయాలని, టీచర్ల బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. తాత్కాలిక ప్రయోజనాల కోసం హడావుడిగా అప్‌గ్రేడ్‌ చేసిన పండిట్‌, పిఈటి పోస్టులపై నెలకొన్న వివాదాన్ని త్వరగా పరిష్కరించి వారికి న్యాయం చేయాలని కోరారు. పర్యవేక్షణాధికారుల పోస్టులను అవసరం మేరకు మంజూరు చేసి రెగ్యులర్‌ నియామకాలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. పాఠశాలల్లో సర్వీస్‌ పర్సన్స్‌ను నియమించాలని, మౌలిక వసతులు కల్పించాలని, కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు శ్రమకు తగిన వేతనాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

జీఓ 317 అమలు కారణంగా స్థానికతను కోల్పోయిన ఉపాధ్యాయులను వారి స్వంత జిల్లాలకు బదిలీ చేయాలని, బ్లాక్‌ చేయబడిన 13 జిల్లాల్లో మిగిలిపోయిన భార్యాభర్తలను ఒక దగ్గరకు చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని పేర్కొన్నారు. ఉపాధ్యాయు కొరతను తీర్చేందుకు విద్యావాలంటీర్లను నియమించాలని తెలిపారు. ఈకార్యక్రమంలో నాయకులు పి.నాగిరెడ్డి, ఎం.సోమయ్య, టి.లింగారెడ్డి, యు.పోచయ్య, డి.సైదులు, సయ్యద్‌ షౌకత్‌ అలీ, కొమ్ము రమేష్‌, ఎన్‌.యాదగిరి, ఎస్‌.హరికృష్ణ, వి.శ్రీను నాయక్‌, వై.విజయకుమార్‌ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement