Friday, May 17, 2024

డ్రగ్స్‌ కట్టడికి కఠిన చర్యలు.. సీఎస్‌ సోమేష్‌కుమార్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణాను కట్టుదిట్టంగా అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్‌ తెలిపారు. మంగళవారం ఆయన బీఆర్కే భవన్‌లో మాదక ద్రవ్యాల నిరోధక కమిటీ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా నిరోధంపై సీఎం కేసీఆర్‌ పలుమార్లు ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారని గుర్తు చేశారు. రాష్ట్రంలో గంజాయిని సాగు చేసే రైతులకు రైతుబంధు పథకాన్ని నిలిపివేస్తూ ఇదివరకే నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో నార్కోటిక్స్‌, ఇతర మత్తు పదార్ధాల రవాణాను గుర్తించేందుకు ఆధునిక పరికరాలను పోలీస్‌ శాఖకు అందజేయనున్నట్లు ఆయన వెల్లడించారు.

పోలీస్‌, ఎక్సైజ్‌, అటవీ, గిరిజన సంక్షేమ, రెవెన్యూ శాఖలు మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగంపై సమన్వయంతో పనిచేస్తున్నాయన్నారు. కేంద్ర నార్కోటిక్‌ డ్రగ్‌ కంట్రోల్‌ బోర్డు, డీఆర్‌ఐ తదితర సంస్థలతో కలిసి నార్కోటిక్స్‌ నియంత్రణపై పనిచేస్తున్నాయని చెప్పారు. ప్రతీ మూడు నెలలకుఓరాసి మాదక ద్రవ్యాల వినియోగ నివారణ ఉన్నతస్థాయి కమిటీ సమావేశం జరిగేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రతీ జిల్లాతోపాటు పోలీస్‌ కమిషనరేట్‌లలో మాదక ద్రవ్యాల నిరోదక సెల్‌లను ఏర్పాటు చేసినట్లు ఈ సందర్భంగా డీజీపి మహేందర్‌రెడ్డి తెలిపారు. డ్రగ్స్‌ను విక్రయించేవారిపట్ల కఠినంగా వ్యవహరిస్తున్నామని, పీడి యాక్టు కేసులు నమోదు చేస్తున్నామని ఆయన వెల్లడించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement