Sunday, April 28, 2024

TS: మేడారం జాతరకు ఆర్టీసీ సర్వం సిద్ధం… మంత్రి సీతక్క

ప్రభ న్యూస్ ప్రతినిధి ములుగు, తాడ్వాయి : ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసీ గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు ఆర్టీసి సర్వం సిద్ధమైందని రాష్ట్ర పంచాయతీరాజ్ మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఈ మేరకు శనివారం మేడారం జాతర కోసం ప్రత్యేకంగా అరవై ఎకరాల స్థల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన బస్ స్టాండు ప్రాంగణాన్ని మంత్రి సీతక్క జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శబరిష్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… మేడారం జాతరకు ఆర్టీసీ ప్రత్యేకంగా ఆరువేల బస్ లను నడపడానికి సిద్దంగా ఉందని, మహాలక్ష్మి పథకం ద్వారా జాతరకు మహిళా భక్తులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి భక్తుల రద్దీ దృష్ట్యా ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని, మహిళలు ఆర్టీసి ఉచిత ప్రయాణం కల్పించిందని అన్నారు.

పైసా ఖర్చు లేకుండా దర్శనం చేసుకునే ఏకైక జాతర మేడారం అని అన్నారు. గతంలో వేలాది మంది భక్తులు కాలినడకన వచ్చి తల్లులకు మొక్కులు చెల్లించుకునే వారన్నారు. కానీ నేడు సీఎం రేవంత్ రెడ్డి మహాలక్ష్మి పధకంలో భాగంగా మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యం ఏర్పాటు చేసారని తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులు, అధికారులు ఓపికతో బస్సులు నడపాలని, భక్తులతో మర్యాదగా వ్యవహరించాలని మంత్రి సీతక్క కోరారు.ఆర్టీసి ఉద్యోగులు ఆడుతూ పాడుతూ పనిచేసి ప్రయాణం చేసే భక్తులు సంతోషంగా వచ్చి వెళ్లేలా చూడాలన్నారు.

అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. గత జాతరతో పోలిస్తే ఈ సారి జాతరకు ఎక్కువ మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా ఉండేందుకు అరవై ఎకరాల స్థల విస్తీర్ణంలో సువిశ్శాల బస్టాండ్ ప్రాంగణం ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ 18తేదీ నుంచి 25వ తేదీ వరకు భక్తులకు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు పి.శ్రీజ, ఏటూరు నాగారం అదనపు ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, వరంగల్ ఆర్ ఎం శ్రీలత, స్పెషల్ ఆఫీసర్ శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement